విద్యార్థులకు..విశ్వమంత కష్టాలే - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

తాజా వార్తలు

విద్యార్థులకు..విశ్వమంత కష్టాలే

అధ్వానంగా ఆర్‌యూ పీజీ వసతిగృహాలు

అడుగడుగునా అపరిశుభ్రతే

విరిగిపోయిన మంచాలే దిక్కు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ ఇక్కడే వసతి

ముందే చిన్నపాటి గదులు.. మరోవైపు పెచ్చులూడడంతోపాటు దెబ్బతిన్న గోడలు.. విరిగిపోయిన మంచాలు..  తలుపుల్లేని మరుగుదొడ్లు.. ఇదీ రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పీజీ వసతిగృహం పరిస్థితి. గుక్కెడు తాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన విశ్వవిద్యాలయం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ ఇక్కడే వసతి కల్పించడం.. సదుపాయాలు ఏమాత్రం కానరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఆందోళన ఇక్కడి పరిస్థితులను చెప్పకనే చెబుతోంది.

 న్యూస్‌టుడే, కర్నూలు విద్య: ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 500 మందికిపైగా పీజీ విద్యార్థులు ఉంటున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆర్‌యూ ఆవరణలో ఉన్న సంగమేశ్వర హాస్టల్‌లోని మూడో అంతస్తులో బాలురకు.. అమ్మాయిలకు ప్రత్యేకంగా వసతి కల్పిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంకాకముందే వసతిగృహంలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. మరుగుదొడ్లు, మంచాలు, తాగునీటి సౌకర్యం తదితరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పీజీ తరగతులు ప్రారంభమై నెల దాటినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు వర్సిటీలో చీఫ్‌ వార్డెన్‌ పేరు వినగానే రెగ్యులర్‌ ఆచార్యులు ఆమడదూరం పరిగెత్తుతున్నారు. హాస్టల్‌లో మౌలిక వసతులు, మరమ్మతుల విషయంలోనూ ఉన్నతాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.. ఈ ఏడాది తెలుగు విభాగం ఆచార్యులు చీఫ్‌ వార్డెన్‌కు రాజీనామా చేసి నెలకుపైగా అవుతున్నా ఇప్పటివరకు ఎవరిని నియమించారో తెలియని పరిస్థితి నెలకొంది.

వసతిగృహాలు అధ్వానం

పీజీ ప్రథమ సంవత్సరంలో వంద మంది, ద్వితీయ సంవత్సరంలో 135 మంది అమ్మాయిలు చదువుతున్నారు. వీరు జోగులాంబ, భ్రమరాంబ వసతిగృహాల్లో ఉంటున్నారు. అబ్బాయిలు ప్రథమ సంవత్సరంలో 100 మంది, ద్వితీయ సంవత్సరంలో 180 మంది ఉండగా వీరికి తుంగభద్ర, సంగమేశ్వర, కృష్ణా వసతిగృహాలు కేటాయించారు. తుంగభద్ర, కృష్ణా వసతిగృహాల్లో విద్యార్థులకు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ప్లాస్టిక్‌ నీళ్ల ట్యాంకులే శరణ్యమయ్యాయి. వీటిల్లోని నీరు రెండు, మూడు గంటలు కూడా రావడం లేదు. మరోవైపు వసతిగృహ నిర్మాణాలను నాసిరకంగా చేపట్టారు. ఫలితంగా అక్కడక్కడా పెచ్చులూడి పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గోడలకు పగుళ్లు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్లూ అధ్వానంగా ఉంది. కొన్నిచోట్ల ఫ్యాన్లు తిరగక ఉక్కపోతతో అల్లాడుతున్నారు. 

బయటకు వెళ్లాల్సిందే

పరిశుభ్రతకు ఆదర్శంగా నిలవాల్సిన రాయలసీమ విశ్వవిద్యాలయంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. వసతిగృహాల్లో మరుగుదొడ్లు దారుణంగా ఉండటంతో విద్యార్థులు చేసేదేమీలేక ఆరు బయట ప్రదేశాలను ఆశ్రయించాల్సిన దయనీయ పరిస్థితి. మరోవైపు మరుగుదొడ్ల తలుపులు సైతం ఊడిపోయాయి. శౌచాలయాలను నిరంతరం శుభ్రం చేయకపోవడంతో భరింపరాని దుర్గంధం వస్తోంది. సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకునేవారే కరవయ్యారు. ఇకనైనా స్పందించి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

2019-20 విద్యాసంవత్సరం నుంచి ఆర్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించారు. యువతీ యువకులకు ప్రత్యేక వసతిగృహాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించారు. వర్సిటీ అధికారులు మొదట్లో చూపించిన ఉత్సాహం చివర్లో చూపకపోవడంతో ఆశించినస్థాయిలో కళాశాలలో ప్రవేశాలు జరగలేదు. రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యేసరికి నాలుగు బ్రాంచిలకు మొత్తంగా 264 సీట్లు ఉండగా 125 మంది (47.35) మాత్రమే ప్రవేశాలు పొందారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 61 శాతం మంది వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలపై ఆసక్తి చూపారు. రెండో విడత వచ్చేసరికి కొందరు విద్యార్థులు వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఇంజినీరింగ్‌ తరగతులు సోమవారం ప్రారంభమవుతాయని అధికారులు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడికి వచ్చాక అసలు వసతిగృహాలే అందుబాటులో లేకపోవడంతో విస్తుపోయారు. వారు నిరసన తెలపడంతో అప్పటికప్పుడు సంగమేశ్వర హాస్టల్‌లోని మూడో అంతస్తు గదులను తాత్కాలికంగా శుభ్రం చేయించడం గమనార్హం. 

తాగునీటికీ తంటాలే..

విశ్వవిద్యాలయంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు పదుల సంఖ్యలో బోర్లు వేశారు. చుక్కనీరు పడకపోవడంతో నీటి కొరత పెద్దఎత్తున వేధిస్తోంది. అయినప్పటికీ శాశ్వత పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వసతిగృహాల్లో ఒకటి, రెండు చోట్ల మాత్రమే నీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మిగిలినచోట్ల కనీసం కుళాయిలు  ఏర్పాటు చేయలేదు. బాలుర వసతిగృహం ఎదుట నీటి సంపును ఏర్పాటుచేసి ప్రైవేటు వాహనాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున ప్రతినెలా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. తాగునీటికి ప్రత్యేకంగా క్యాన్లు తెప్పిస్తున్నారు. ఇవి అయిపోతే విద్యార్థులు రోడ్డుపైనున్న దుకాణాలు, సమీపంలోని గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.  

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.