చిన్నారులకు..చిరునవ్వుల వరం - Kurnool - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

తాజా వార్తలు

చిన్నారులకు..చిరునవ్వుల వరం

● వీధి బాలల కోసం ఆపరేషన్‌ ముస్కాన్‌

● ముగిసన ఐదో విడత కార్యక్రమం

● ఆరు సబ్‌ డివిజన్లలో 551 మంది గుర్తింపు

బాల కార్మికుడితో పోలీసులు

ముస్కాన్‌.. అంటే చిరునవ్వు.. కష్టాల కొలిమిలో మాడి మసవుతున్న బాల్యం మళ్లీ చిగుర్లు తొడిగేలా వాడిపోయిన పెదాలపై చిరునవ్వులు చిందించేలా చేయడమే ఆపరేషన్‌ ముస్కాన్‌ .. రోడ్లపై భిక్షాటన చేస్తున్న చిన్నారులు, తల్లిదండ్రులు ఇద్దరూ లేక బంధువులు, వృద్ధుల వద్ద ఆశ్రయం పొందుతున్న పిల్లలను గుర్తించడంతో మొదలయి పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి ప్రధాన స్రవంతిలోకి కలపడంతో ముగుస్తుంది. ఈ బాలలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం పోలీసుశాఖకు అప్పగించింది. జిల్లాలోని ఆరు పోలీసు సబ్‌ డివిజన్లలో ముస్కాన్‌ కార్యక్రమం ఇటీవల ముగిసింది. 20 రోజులపాటు కొనసాగిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా 551 మంది వీధి బాలలకు విముక్తి కల్పించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో బాలకార్మికులు, వీధి బాలల సంఖ్య వేలల్లో ఉన్నా ఆపరేషన్‌ ముస్కాన్‌లో 551 మంది వీధి బాలలను గుర్తించారు. - న్యూస్‌టుడే,ఆత్మకూరు పట్టణం

ఏటా జాతీయ స్థాయిలో జరుగుతున్న ముస్కాన్‌ కార్యక్రమం ఐదో విడత ఈ నెల 1వ తేదీ ప్రారంభమయి 20న ముగిసింది. జిల్లాలోని ఆత్మకూరు, డోన్‌, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని పోలీసు సబ్‌ డివిజన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు సబ్‌ డివిజన్‌ అధికారి ఆధ్వర్యంలో ఒక ఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో ఏర్పాటయిన బృందం పనిచేసింది. వీరు గ్రామాలు, చెంచుగూడేలు, ఆర్టీసీ బస్టాండ్లు, పట్టణ శివారు ప్రాంతాలు, చెత్తకుప్పలు, డంపుయార్డులు, దుకాణాల ప్రదేశంలో మఫ్టీలో సంచరిస్తూ చిన్నారులు, వీధి బాలలను పట్టుకున్నారు.

బాల కార్మిక వ్యవస్థతో అక్షరాస్యతలో వెనుకబాటు

బాలకార్మికులు, వీధి బాలలు, చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకునే వీధి బాలలు చదువుకు దూరంగా ఉంటున్నారు. పాఠశాలల్లో ఉండాల్సిన బాలలు విద్యకు దూరంగా ఉండటం వల్ల జిల్లా అక్షరాస్యత శాతం తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు. అక్షరాస్యతలో జిల్లా బాగా వెనకబడి ఉంది. జిల్లాలోని తొమ్మిది పురపాలికల్లో బాలకార్మికులు, తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుంచి రహదారులపై చెత్తకాగితాలు, బీరు సీసాలు ఏరుకునే వారు దర్శనమిస్తూనే ఉంటారు. పంచరు బంకులు, హోటళ్లు, తినుబండారాల దుకాణాలు, సర్వీసింగ్‌ కేంద్రాల్లోనే వందలాది మందిని గుర్తించవచ్ఛు జిల్లా కేంద్రంలో 17 మందిని, డోన్‌లో 36 మందిని మాత్రమే గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే బాలకార్మికుల సంఖ్య వేలల్లోనే ఉన్నా పోలీసులు గుర్తించింది 551 మందిని మాత్రమే.

కార్యక్రమ లక్ష్యం ఇదీ

పట్టణాల్లో తెల్లవారినప్పటి చాలా మంది పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఆటలాడుకునే వారి వివరాలు సేకరించారు. చెత్తకుప్పల్లో కొంత మంది చెత్తకాగితాలు, ప్లాస్టిక్‌ సామాన్లు, ఇనుప సామగ్రి ఏరుకుంటూ మరికొంత మంది పిల్లలు జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేక కొంత మంది తమ చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఆర్టీసీ బస్టాండ్లు, రహదారుల వెంబడి సంచరిస్తున్నారు. తల్లిదండ్రులు లేక జేజమ్మ, అమ్మమ్మల వద్ద నివసించే పిల్లలను గుర్తించారు. వృద్ధుల వద్ద ఆదరణ లేక దుర్భర జీవనం గడుపుతున్న పిల్లలతో మాట్లాడిన ముస్కాన్‌ సభ్యులు తమ అవస్థలకు కారణాలు తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా పిల్లల తల్లిదండ్రులు, పనులు చేయించుకుంటున్న యజమానుల వద్దకు తీసుకువెళ్లి వారికి కౌన్సిలింగు నిర్వహించి నచ్చజెప్పారు. బాల కార్మికులతో పనులు చేయించుకునే యజమానులకు హెచ్చరికలు జారీ చేసి చదువుకునేలా ప్రోత్సహించారు. అనాథలు, వీధి బాలలను ప్రభుత్వ పునరావాస కేంద్రాలు, వసతి గృహాలకు తరలించారు.

వీధి బాలల వివరాలు సేకరించాం- ఓబులేష్‌, ఎస్సై

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి బాలలు, అనాథలు, చెత్తకాగితాలు ఏరుకునే పిల్లల వివరాలను ఆపరేషన్‌ ముస్కాన్‌లో సేకరించాం. పిల్లలు ఈ పనులు ఎందుకు చేస్తున్నది అడిగి తెలుసుకున్నాం. వీధి బాలలను పాఠశాలలు, పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలకు చేర్చటమే ఈ కార్యక్రమం ఉద్ధేశ్యం. ముస్కాన్‌ అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందంలోని సభ్యులు మఫ్టీలో తిరుగుతూ వివరాలను తీసుకున్నాం.

తల్లిదండ్రులకు కౌన్సిలింగు - వెంకటరావు, డీఎస్పీ, ఆత్మకూరు

కొంత మంది తల్లిదండ్రులు తాము పనులు చేయటం చేతకాక పిల్లలతో పనులు చేయిస్తున్నారని ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా బయటపడింది. మరికొందరు తమ పిల్లలను భిక్షాటనకు పంపుతున్నారు. చదువుకునే వయసులో పనులు చేయించటం చట్టరీత్యా నేరం. చిన్న పిల్లలను బాలకార్మికులుగా మార్చి యజమానులు పనులు చేయిస్తున్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారి తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగు నిర్వహించి, అర్థమయ్యేలా నచ్చజెబుతున్నాం. అయినా పిల్లలను పనులకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

 

అనాథ పిల్లాడితో బృందం సభ్యులు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.