close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

ఈ నిర్లక్ష్యానికి తప్పదు..భారీ మూల్యం!

మ్యాన్‌హోళ్ల నిర్వహణలో మారని వైఖరి
రూ.కోట్లు వెచ్చిస్తున్నా సరే.. గోతుల మయం
మరమ్మతుల  సమయంలో కనీస జాగ్రత్తలు కరవు
తాజాగా ఓ పసిపాప ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా మ్యాన్‌హోళ్ల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో చాలాచోట్ల నోళ్లు తెరిచి మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. తాజాగా గుడిమల్కాపూర్‌ మహావీర్‌ యాదవ్‌ నగర్‌కు చెందిన తిరుపతి కుమారుడు దీక్షిత్‌(1) ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. బాలుడిని పైకి తీసి నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని స్పష్టమవుతోంది. రెండు రోజుల కిందట మహావీర్‌యాదవ్‌ నగర్‌లో మ్యాన్‌హోల్‌ మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో పాటు మ్యాన్‌హోల్‌లో నీటి నిల్వ ఉంది. దీంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. గ్రేటర్‌ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే తీరు. ప్రధాన నగరంలో వరద, మురుగు వీటిని జలమండలి నిర్వహిస్తోంది. శివారు మున్సిపల్‌ సర్కిళ్లల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటున్నాయి. రెండు విభాగాలు కలిపి దాదాపు 3 లక్షల మ్యాన్‌హోళ్లు నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలి. చాలా ప్రాంతాల్లో మురుగు పొంగడం.. ప్రమాదకరంగా మారి మృత్యువును ఆహ్వానిస్తున్నాయని జనం వాపోతున్నారు. గతంలో మాదాపూర్‌ ప్రాంతంలో ముగ్గురు, సైదాబాద్‌లో ఇద్దరు మ్యాన్‌హోళ్లను శుభ్రం చేస్తుండగా.. అందులోని మీథేన్‌ వాయువు కారణంగా మృతి చెందారు.

ప్రధాన లోపాలు ఇవే..
* జలమండలి పరిధిలో ఏటా కొత్త మ్యాన్‌హోళ్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.10-15 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అంతటా అక్రమాలు, నాసిరకం పనులతో సరిపెడుతున్నారు.
* మరమ్మతుల పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. అత్యవసర పనుల కింద ఈ పనులు చేపడుతున్నారు. ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు కూడా తీసుకుంటున్నారు. సకాలంలో మరమ్మతులు చేపట్టక పోవడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. గోతులుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
* మరమ్మతు పనులు చేపట్టే సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి. గతంలో నిధుల వెచ్చించి వీటి కోసం ప్రత్యేకంగా బారికేడ్లు తయారు చేశారు. ఇవి ఆయా కార్యాలయాలకే పరిమితమవుతున్నాయి. ప్రధాన మార్గాల్లో తప్ప.. గల్లీలు, వీధుల్లో పనుల సందర్భంగా సరైన జాగ్రత్తలు పాటించడం లేదు.
* రోడ్డు ఉపరితలానికి మ్యాన్‌హోళ్లు సమాంతరంగా ఉండాలి. రోడ్డుకు ఎత్తుగా.. లేదంటే రోడ్డుకు దిగువగా ఇవి ఉంటున్నాయి. సికింద్రాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌.. చాలా ప్రాంతాల్లో ఇదే తీరు ఉంది.
* గ్రేటర్‌ వ్యాప్తంగా 2 వేల కిలోమీటర్ల మేర మ్యాన్‌హోళ్ల మరమ్మతులకు జలమండలి పూనుకుంది. రోడ్డుకు సమాంతరంగా లేని వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు కూడా కొన్ని రహదారులకే పరిమితమవుతున్నాయి. గల్లీలు, కాలనీల్లో షరా మమూలే.
* జలమండలి, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయం కొరవడుతోంది. మురుగు పొంగినప్పుడు, మ్యాన్‌హోళ్లు కుంగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. ఇలా రెండు విభాగాలకు కేటాయించడం కంటే మురుగు నీటి వ్యవస్థ మొత్తం ఒకే విభాగం కిందకు తీసుకురావడం అత్యవసరం. జల మండలి వద్ద నిధులు, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు.
* గ్రేటర్‌ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వరద నీటి, మురుగు నీటి పైపులు కలిసిపోయాయి. దీంతో భారీ వర్షం పడినప్పుడు పరిమితికి మించి వరద గొట్టాల నుంచి పారుతోంది. చాలా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల నుంచి పైకి తన్ని మూతలు ఎగిరిపోతున్నాయి. చుట్టూ రోడ్డు కొట్టుకుపోతోంది. కొన్నిరోజుల వరకు వాటిని మరమ్మతులు చేసే నాథుడే లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.