close

శుక్రవారం, జనవరి 18, 2019

తాజా వార్తలు

పడగవిప్పిన పాతకక్షలు

భయం గుప్పిట్లో అభంగాపూర్‌ గ్రామంలో పోలీస్‌ పికెట్‌

నారాయణపేట, న్యూస్‌టుడే :  ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో 20 ఏళ్ల కిందట 1999లో  దాయాదుల మధ్య రేగిన భూ వివాదం వర్గపోరుకు తెరలేపింది. ఆ రెండువర్గాల మధ్య పంచాయతీ ఎన్నికల సమయంలో పాత కక్షలు గ్రామ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నారాయణపేట మండలం అభంగాపూర్‌లో భూవివాదం సందర్భంగా ఏర్పడిన వర్గపోరు చివరకు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఒకరినొకరు విచక్షణా రహితంగా నరుక్కునే  వరకు వెళ్లాయి. గ్రామానికి చెందిన ఆశప్ప అలియాస్‌ అశోక్‌పై ప్రత్యర్థి వర్గం బుధవారం రాత్రి మరికల్‌లో వేట కొడవళ్లతో దాడి చేయడంతో పాతకక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ 20 ఏళ్ల వర్గపోరులో ఇప్పటి వరకు ఆశప్ప వర్గీయుల దాడిలో ప్రత్యర్థి వర్గమైన ఆ గ్రామ మాజీ సర్పంచి చెన్నప్ప వర్గీయులే నలుగురు బలయ్యారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. : అభంగాపూర్‌కు చెందిన ఆశప్ప వర్గీయులు కొనుగోలు చేయాలనుకున్న 14 ఎకరాల భూమిని చెన్నప్ప వేరే వారికి ఇప్పించారనే కోపంతో 1999లో ఆయన ఇంటిపై బాంబులతో దాడి జరిగింది. ఈ సంఘటనపై నారాయణపేట ఠాణాలో ఆశప్ప వర్గీయులపై కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణపేట కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఆశప్ప వర్గీయులను కోర్టు ఆవరణలో మట్టుబెట్ట్టేందుకు చెన్నప్ప వర్గీయులు కత్తులు దాచి, దాడికి చేసిన ప్రయత్నాన్ని అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు.
* 2001లో చెన్నప్ప వర్గానికి చెందిన వెంకటయ్య, గుండప్ప మహబూబ్‌నగర్‌ నుంచి బస్సులో అభంగాపూర్‌కు వస్తుండగా కోయిలకొండ మండలం వింజమూరు సమీపంలో బస్సును ఆపి ఆశప్ప వర్గీయులు  ఆ ఇద్దరిని నరికి చంపేశారు.
* 2004లో నారాయణపేట కోర్టుకు ఆటోలో వస్తున్న చెన్నప్ప వర్గానికి చెందిన నారాయణ, దస్తప్పను మరోసారి ఆశప్ప వర్గీయులు అప్పక్‌పల్లి వద్ద ఆటోను ఆపి చంపేశారు. ఈ రెండు కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో కోర్టు కేసును కొట్టివేసింది.  ఇదిలా ఉండగా మాజీ సర్పంచి చెన్నప్ప కుమారుడు విజయ్‌ ఆశప్ప వర్గాన్ని అంతమొందించేందుకు నేర ప్రవృత్తికి దగ్గరయ్యాడు. అనంతపురం జిల్లా పరిటాల రవి హత్యకేసులో నిందితులైన పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, మద్దెలచెరువు సూరి గ్యాంగ్‌లో చేరాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మారణాయుధాలతో ఆశప్పను హత్యచేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాడని గుర్తించిన అక్కడి పోలీసులు ఆ మధ్య విజయ్‌ను అరెస్టు చేశారు.

మళ్లీ మొదలైన ‘పంచాయతీ’.. : తాజాగా అభంగాపూర్‌ పంచాయతీకి విజయ్‌ తమ్ముడైన రవి తన తల్లి మాజీ సర్పంచి గోవిందమ్మతో, ఆశప్ప  తన అన్న కుమార్తెతో నామినేషన్‌ వేయించారు.  ప్రాణభయంతో గ్రామాన్ని వదిలి వెళ్లిన ఆశప్ప కుటుంబీకులు, విజయ్‌ కుటుంబీకుల మధ్య సర్పంచి పదవికి పోటీ ఏర్పడింది. హైదరాబాద్‌లో ఉంటున్న విజయ్‌ ఇదే అదనుగా ఆశప్ప కదలికలపై కన్నేశారు. ఈ తరుణంలో బుధవారం రాత్రి ఆశప్పపై వేటకొడవళ్లతో దాడి జరగడం సంచలనం రేపింది. దీంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రే సీఐ సంపత్‌ గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

కేసు నమోదు..:  ఆశప్ప అలియాస్‌ అశోక్‌పై వేట కొడవళ్లతో దాడిచేసిన సంఘటనపై ఆయన సోదరుడి కుమార్తె వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు మరికల్‌ సీఐ ఇఫ్తెకార్‌ అహ్మద్‌ గురువారం తెలిపారు. బుర్జుకాడి విజయ్‌కుమార్‌, ఆనంద్‌, ప్రవీణ్‌, రవి, లింగప్ప, సుభాశ్‌, ఆంజనేయులుతో పాటు మరో 12 మంది దాడికి పాల్పడ్డారని వర్ష ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ..

ధన్వాడ : ఆశప్పపై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారం పరిశీలించారు. పోలీసులతో వివరాలు తెలుసుకొన్నారు. ఆశప్ప కారు ఆపి పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆశప్పతో మాట్లాడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. మరికల్‌ ఎస్సై జానకీరాంరెడ్డి మాట్లాడుతూ.. నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని, విచారణ ముమ్మరంగా సాగుతోందన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.