close

బుధవారం, మే 22, 2019

తాజా వార్తలు

సభ నిర్వహణలో..ఇందూరు పెద్దలు 

సభాపతిగా పోచారం, సభా వ్యవహారాల మంత్రిగా వేముల 
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 
ఈనాడు, నిజామాబాద్‌

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు కీలక పాత్ర పోషించనున్నారు. మూడు రోజుల కిందట మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి రవాణా, రహదారులు - భవనాలు, గృహ నిర్మాణ శాఖలతో పాటు ప్రాధాన్యం ఉన్న శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన సభలో కీలకంగా వ్యవహరించనున్నారు. నియమావళి మేరకు సభ నిర్వహణ, తీర్మానాలు ప్రవేశపెట్టే అధికారాలు కలిగి ఉంటారు. ఇక ఏ తీర్మానాన్ని  అయినా అనుమతించే అధికారం, సభ సజావుగా సాగేలా చూడటం.. సభ్యుల హక్కులు కాపాడే బాధ్యతాయుతమైన పదవి సభాపతిది. ఆయన మన ప్రాంత వాసే. అధికార పార్టీ నుంచి శాసససభ్యుడిగా ఎన్నికైన పోచారం శ్రీనివాస రెడ్డి, ఇతర రాజకీయ పక్షాల సహకారంతో ఏకగ్రీవంగా సభాపతి పదవికి ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఇందూరు వాసులే శాసనసభను నడిపించే పదవుల్లో ఉన్న సందర్భమిది. యాదృచ్ఛికంగా జరిగిన పరిణామమే అయినా..ఇది ఆసక్తి కలిగించే అంశం. 
ఆసక్తిగా చూస్తున్న జిల్లావాసులు 
గత మంత్రి మండలిలో చోటు దక్కి సేవలందించిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ దఫా అనుభవం, ఇతర సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాపతిగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినా..కొత్త స్పీకర్‌తో తమ అనుబంధాన్ని సభ్యులు పంచుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంలో తెరాస కొన్ని హామీలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా పథకాల అమలు జరిపే విధంగా కేటాయింపులు ఉంటాయనే ఆశతో వివిధ వర్గాల వారున్నారు. మరోపక్క కేటాయింపులు లేకుంటే విమర్శల దాడి చేసేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ పద్దు అంటున్నా.. ఎన్నికల సందర్భం కావటంతో ఊరటనిచ్చే అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలు ఎలా జరగనున్నాయి అనే ఆసక్తి ప్రజల్లో ఉంది. ఇటు సభ్యులను సమన్వయం చేసి సభ నడిపే స్పీకర్‌.. నియమావళి ఉల్లంఘనలు జరిగితే ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టి సదరు సభ్యుడిపై చర్యను కోరే అవకాశం ఉన్న శాసనసభ వ్యవహారాల మంత్రులు మన జిల్లా నుంచే ఉన్నారు. ఈ పదవులకు ఇద్దరు కొత్తవారే అయినా సభ నిర్వహణ జరిగే తీరును తిలకించేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.