కేజీ 24 లక్షల రూపాయలు!
ప్రధాన సమస్య ఈ మాంసం ఉత్పత్తికయ్యే ఖర్చే! 2008లో పావుకేజీ మాంసానికి అరవైలక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనావేశారు. అంటే కేజీ 2.4 కోట్ల రూపాయలు! అది కాస్త ఇప్పుడు 24 లక్షలరూపాయల వరకూ తగ్గింది. అంటే ఎనిమిదేళ్లలో కోటి నుంచి లక్షలకి వచ్చిందన్నమాట! ఆ లెక్కన మరో ఐదేళ్లలో మన పళ్లేల్లోకి ఈ మాంసం వచ్చేస్తుందని చెబుతున్నారు!
|
ఇలా చేస్తారు
అలా తీసుకున్న కండరం నుంచి కణం వేరు చేసి అచ్చం శరీరంలాంటి వాతావరణాన్ని కల్పించే ఓ పెట్టెలో పెడతారు. దీన్ని ‘బయోరియాక్టర్’ అంటారు. అది ఈ కణం పెరగడానికి కావాల్సిన వాతావరణం కల్పిస్తుంది. ఓ కణం శరీరంలో ఉంటే దానికి రక్తం ద్వారా ఆక్సిజన్, విటమిన్లూ, ప్రొటీన్లు అందుతాయి. మరి శరీరం బయట పెరిగే ‘అనాథ’ కణానికి ఎవరు దిక్కు? ఇంకెవరు శాస్త్రవేత్తలే! వాళ్లు అదే జీవి నుంచి రక్తం తీసుకుని అందులోని ‘సీరమ్’ని వేరుచేసి ప్రొటీన్, విటమిన్, అమినోయాసిడ్లని ఆ కణానికి అందించి.. వాటి సంఖ్యని పెంచుతారు! లండన్‌లో అహింసా బర్గర్ వెనకున్న డచ్ శాస్త్రవేత్త మార్క్ పోస్ట్ ఇలాగే చేశారు. ఓ పది ముక్కలతో.. రెండునెలల్లో 50 వేల టన్నుల మాంసం తయారుచేయొచ్చని చెబుతున్నారాయన!
|
టిష్యూ ఇంజినీరింగ్ నుంచి పుట్టిందే
పరీక్షా నాళికల్లో స్త్రీ అండాన్ని, పురుష శుక్రకణాన్నీ కలిపి ఫలదీకరించే ‘టెస్ట్ ట్యూబ్ బేబీ’ విధానం గురించి మనకు తెలుసు. ఇది కూడా అలాంటిదే.. ‘టెస్ట్ ట్యూబ్ మాంసం’ అన్నమాట. పిండం ఏర్పాడటానికి అండం, వీర్యకణం రెండూ కావాలి. ఈ మాంసం తయారీకి ఒకే ఒక్క కణం ఉంటే చాలు! కాకపోతే అండం, వీర్యకణాన్ని కలిపేశాక.. పిండానికి ప్రాణం వచ్చి అది ఏ అవాంతరాలూ లేకుండా జోరుగా ఎదుగుతుంది. కానీ మన దేహంలోని మరే కణం కూడా.. శరీరం నుంచి బయటికొచ్చాక సులభంగా ఎదగదు! శాస్త్రవేత్తలకి ఇదే అసలైన సవాలు. గత వందేళ్లలో ఆ సవాలుపై ఎన్నో ప్రయోగాలు చేసి ‘టిష్యూ ఇంజినీరింగ్’ సాంకేతికతని రూపొందించారు శాస్త్రవేత్తలు. ఈ సాంకేతికతతో ప్రస్తుతం కాలిపోయిన, తెగిపోయిన కండరాలని మళ్లీ తయారుచేసేస్తున్నారు. పునర్నిర్మాణ చికిత్స(రీజనరేటివ్ మెడిసిన్) అంటున్నారు దీన్ని! ‘అహింసా మాంసం’ అందులో నుంచి పుట్టిందే.
|
స్టార్టప్‌లూ వచ్చేశాయి
ఈ ప్రయోగాలని ప్రజల ముందుకు తీసుకువచ్చి.. లాభాలు కళ్లచూసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి అమెరికాలోని కొన్ని స్టార్టప్‌లు. ఇప్పటికే మెంఫిస్ మీట్స్ అనే సంస్థ ఈ తరహా కోడి మాంసాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఇందుకోసం ‘డక్ ఏ లారెంజ్’ అనే పెద్ద పౌల్ట్రీని రూపొందించింది. సూపర్ మీట్ అనే ఇజ్రాయిల్ సంస్థ, మోసా మీట్ అనే మరో స్టార్టప్ మరింత దూకుడుగా వీటి ఉత్పత్తి చేస్తున్నాయి.
|
ఎందుకీ మాంసం?
జీవహింసపై మాంసాహారుల అపరాధభావం పొగొట్టడం ఒక్కటే దీని లక్ష్యం కాదు. నేటి పౌల్ట్రీ, కబేళా పరిశ్రమల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించడమే ఈ పరిశోధనల అసలు ప్రయోజనం! ప్రపంచంలో అత్యధిక కాలుష్యానికి కారణం ఈ పరిశ్రమలే. అన్నిదేశాల్లోని రవాణా, పొగ కాలుష్యానికంటే ఇది మించిపోతోందన్నది పర్యావరణవేత్తలు ఆందోళన. కాలుష్య ఉద్గారాల విడుదలలో 18 శాతం దీనిదేనట! పైగా.. మన ప్రపంచంలో ఉత్పత్తయ్యే 50 శాతం యాంటీబయోటిక్స్ మందులు ఈ మాంసం ఉత్పత్తిరంగానికే పోతోందట. దీనివల్ల.. మందులని తట్టుకునే బ్యాక్టీరియాలూ పెరుగుతున్నాయి. పైగా.. 20 హెక్టార్ల స్థలం కేటాయించి పెంచే పశువులూ, కోళ్లతో వచ్చే మాంసాన్ని కేవలం ఒకే హెక్టార్ స్థలంతో తయారుచేయొచ్చట. వీటన్నింటివల్లే పర్యావరణవేత్తలు ఈ అహింసా మాంసంవైపు మొగ్గుతున్నారు. పైగా మనం కోరుకున్న పోషకాలతో, కాలుష్యరహితంగా అతిస్వచ్ఛంగా ఈ మాంసాన్ని తయారుచేయొచ్చు. అందుకే ‘పెటా’ వంటి స్వచ్ఛంద సంస్థల నుంచి అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా దాకా దీని ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి.
|