ఫేస్బుక్

ఎకౌంట్‌ని కొంతకాలం పాటు పని చేయకుండా డియాక్టివేట్ చేయాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. వచ్చిన పేజీలో ‘మేనేజ్ ఎకౌంట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో ‘డియాక్టివేట్ ఎకౌంట్’ బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఎకౌంట్‌ని యాక్సెస్ కాకుండా చేయొచ్చు. అయితే, ఇది శాశ్వతంగా డిలీట్ చేసినట్టు కాదు. మరి, ఎఫ్బీలో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఎకౌంట్‌ని తీసేయాలంటే? అందుకు సెట్టింగ్స్‌లోని ‘యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ని క్లిక్ చేయండి. వచ్చిన దాంట్లో ‘డిలీట్ యువర్ ఎకౌంట్ అండ్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయొచ్చు. ఎఫ్బీతో పాటు మెసెంజర్ కూడా తొలగిపోతుంది. అయితే, మొత్తం డేటాని డౌన్లోడ్ చేసుకున్నాకే తొలగించండి.
|
ట్విటర్

చిట్టిపొట్టి షేరింగ్లతో చేసిన ట్వీట్స్ సందడికి తెర దించాలనుకుంటే? సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. మెనూలోని ‘ఎకౌంట్’ని సెలెక్ట్ చేస్తే డియాక్టివేట్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఎకౌంట్కి మంగళం పాడొచ్చు. అయితే, ‘గ్రేస్ పిరియడ్’లా 30 రోజుల పాటు ఎకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. తర్వాతే శాశ్వతంగా తొలగిపోతుంది. 30 రోజుల్లోపు ఎప్పుడైనా ఎకౌంట్‌ని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయడానికి ముందు ట్విటర్ డేటాని డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. ‘యువర్ ట్విటర్ డేటా’ ఆప్షన్ని సెలెక్ట్ చేసి పొందొచ్చు.
|
ఇన్స్టాగ్రామ్

ఫొటోలు, సంక్షిప్త సమాచారంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మిలీనియల్స్ చేస్తున్న సందడి అంతా.. ఇంతా కాదు. కారణం ఏదైనా ఇన్స్టాకి గుడ్‌బై చెప్పాలంటే.. యాప్ నుంచి చేయలేం. వెబ్ బ్రౌజర్లో లాగిన్ అయితేనే కుదురుతుంది. బ్రౌజర్లో లాగిన్ అయ్యాక సెట్టింగ్స్‌లోకి వెళ్తే ‘ఎడిట్ ఫ్రొఫైల్’ కనిపిస్తుంది. దాంట్లో ఉన్న ఆప్షన్‌తో టెంపరరీగా ఎకౌంట్‌ని డిసేబుల్ చేయొచ్చు. శాశ్వతంగా తొలగించాలంటే.. ‘హెల్ప్’ సెంటర్’లోకి వెళ్లాలి. దాంట్లో కనిపించే ‘డిలీట్ ఎకౌంట్’ ఆప్షన్‌తో శాశ్వతంగా తొలగించొచ్చు. ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో కారణం తెలిపి పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేస్తే తొలగిపోతుంది. ముందే డేటాని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
|
స్నాప్‌ఛాట్

ఫోన్ కెమెరా కంటికి అదనపు హంగుల్ని జోడించే స్నాప్ఛాట్ని తొలగించే అవసరం వస్తే యాప్ నుంచి చేయలేరు. బ్రౌజర్లో లాగిన్ అయితేనే ఎకౌంట్‌ని తొలగించడం సాధ్యం. సైట్‌ని ఓపెన్ చేశాక హోం పేజీలోని ‘సపోర్టు’లోకి వెళ్లండి. వచ్చిన వెబ్ పేజీలో ‘మై ఎకౌంట్ అండ్ సెక్యూరిటీ’లోకి వెళ్లి ‘ఎకౌంట్ ఇన్ఫర్మేషన్’ని సెలెక్ట్ చేస్తే దాంట్లో ‘డిలీట్ మై ఎకౌంట్’ ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి ఎకౌంట్‌ని తొలగించొచ్చు. 30 రోజుల వరకూ డిసేబుల్ మోడ్‌లోనే ఉంటుంది. ఈ లోపు మళ్లీ ఎకౌంట్ కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. గడువు దాటాక ఎకౌంట్ తొలగిపోతుంది.
|
వాట్సాప్

యాప్ నుంచే తీసేయొచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్తే సరి. ‘ఎకౌంట్’ని సెలెక్ట్ చేసి ‘డిలీట్ మై ఎకౌంట్’తో తొలగించొచ్చు. అయితే, మీ వాట్సాప్ ప్రొఫైల్‌కి సంబంధించిన సమాచారం (ఫ్రొఫైల్ ఫొటో, గ్రూపు పేర్లు..), ఇతర సెట్టింగ్స్‌ని రిపోర్టు రూపంలో పొందొచ్చు. అందుకు మూడు రోజులు సమయం తీసుకుని వాట్సాప్ జిఫ్ ఫార్మెట్లో డేటాని అందిస్తుంది. ఫైల్ని పొందిన తర్వాత ఎకౌంట్‌ని తొలగించాలి.
|
గూగుల్

రోజూ వాడే జీమెయిల్ ఎకౌంట్‌ని ఎప్పుడైనా డిలీట్ చేయాలన్న ఆలోచన వచ్చిందా? ఒకవేళ వస్తే గూగుల్ ‘ఎకౌంట్ ప్రిఫరెన్సెస్’ విభాగంలో చూస్తే ‘డిలీట్ యువర్ ఎకౌంట్, సర్వీసెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. మెయిల్ ఎకౌంట్‌తో వాడుతున్న ఇతర గూగుల్ సర్వీసుల్ని వెతికి తొలగించొచ్చు. డిలీట్ చేయడానికి ముందు డేటాని డౌన్లోడ్ చేసుకోండి.
|
|