close

సంపాదకీయం

దిక్కులేనిదా ఓటుహక్కు?

దిహేడో సార్వత్రిక సమరానికి సన్నాహకాల్లో భాగంగా- ఓటర్ల జాబితాలు పక్కాగా ఉండేట్లు చూడాలని, సవరణలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భారత ప్రధాన ఎలెక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోడా, రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు రెండు నెలలక్రితం దిశానిర్దేశం చేశారు. వందశాతం కచ్చితత్వంతో ఓటరు జాబితాలు ఉండాలని తమవంతుగా రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులు- జిల్లా కలెక్టర్లకు గిరిగీస్తున్నారు. నిజానికి, చాలాచోట్ల అందుబాట్లో ఉన్నవి ఓటి జాబితాలేనని వెలుగుచూస్తున్న వివరాలు ఎలుగెత్తుతున్నాయి. ఉదాహరణకు, అధికారిక గణాంకాల ప్రకారం- హైదరాబాద్‌ జిల్లా జనాభా 41 లక్షల 50 వేలు, ఓటర్ల సంఖ్య సుమారు 41 లక్షల 62వేలు. కర్నూలులో అర్హులైన ఓటర్ల కన్నా నమోదైనవారి సంఖ్య రెండు లక్షల 40 వేల మేర అధికం! 1977నాటికి దేశంలో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 5.9 లక్షలున్న ఓటు హక్కుదారుల సంఖ్య ఇప్పుడు 16.5 లక్షలకు విస్తరించి మొత్తం ఓటర్లు 90 కోట్లకు పైబడటం- ప్రజాస్వామ్య మేరునగం విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది. దేశ ఓటర్ల జాబితాలో ఎనిమిదిన్నర కోట్ల పేర్లు బోగస్‌ లేదా నకిలీలేనని నాలుగేళ్లక్రితం సీఈసీగా హెచ్‌ఎస్‌ బ్రహ్మ స్పష్టీకరించారు. తాజా కథనాలు రాష్ట్రాలవారీగా జాబితాల కంతల్ని కళ్లకు కడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో 12-13 శాతం దాకా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయమయ్యాయని, అందులో 90 శాతం వాటా మహిళలు, ముస్లిములదేనన్న విశ్లేషణలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఈసీకి అరవై తొమ్మిదేళ్ల విశేష అనుభవం పోగుపడింది. పదహారు సార్వత్రిక ఎన్నికల తరవాతా ఓటర్ల జాబితాలను పకడ్బందీగా, ఎక్కడా ఎటువంటి విమర్శలకు ఆరోపణలకు తావివ్వకుండా రూపొందించడంలో ఎలెక్షన్‌ కమిషన్‌ ఘోరవైఫల్యం దిగ్భ్రాంతపరుస్తోంది. నిర్దుష్టంగా జాబితాల తయారీపై హామీలు, ప్రకటనలు మోతెక్కుతున్నా- ఫిర్యాదులు, అభ్యంతరాలు ఆగడంలేదు. తమ ఓటుహక్కుకు దిక్కులేకుండా పోయిందన్న అసంఖ్యాక వయోజనుల ఆక్రోశం, ప్రజాస్వామ్య భారతావనికే తలవంపులు!

జనస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క ఓటూ కీలకమే. పౌరుల్నే ప్రభువులుగా సంభావించే ప్రజాతంత్రానికి తల్లివేరు, స్వేచ్ఛగా వ్యక్తమయ్యే జనాభిప్రాయమే. ప్రతి ఎన్నికలప్పుడూ పెద్దయెత్తున ఓట్ల గల్లంతు, జాబితాల్లో తప్పాతాలూ- ఆ మౌలిక స్ఫూర్తికే గండి కొడుతున్నాయి. బరిలోని అభ్యర్థుల జయాపజయాలు నిర్ధారించడానికి ఒక్క ఓటు తేడా చాలు. దొంగ ఓట్లు చేర్పించినా, ఫలానా పక్షానికి సానుభూతిపరులన్న అంచనాతో పేర్లు తీసేయించినా గెలుపోటములు తారుమారవుతాయి. అందుకే జాబితాల నుంచి అర్హులైన ఓటర్లెవరూ జారిపోకుండా, అయోగ్యుల పేర్లు చొరబడకుండా విధ్యుక్త ధర్మాన్ని ఎన్నికల సంఘం కర్తవ్యనిష్ఠతో నిర్వహించాలి. దురదృష్టవశాత్తు, అందుకు విరుద్ధ దృశ్యాలు ప్రతిసారీ ఆనవాయితీగా సాక్షాత్కరిస్తున్నాయి. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో 22 లక్షలకు పైగా ఓటర్ల నామధేయాలు జాబితాల నుంచి అదృశ్యం కావడంపై రాష్ట్ర ప్రధాన ఎలెక్షన్‌ కమిషనర్‌ ‘సారీ’ చెప్పడం తెలిసిందే. కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభృత రాష్ట్రాల్లోనూ ఓట్లు గల్లంతు కావడంపై గగ్గోలు పుట్టింది. అయిదేళ్ల క్రితం ముంబయిలో రెండు లక్షల ఓట్లు స్వీయ కార్యనిర్వాహక తప్పిదాల వల్లే మాయమైనట్లు ఎన్నికల సంఘం బహిరంగంగా అంగీకరించింది. ఎప్పటికప్పుడు తప్పయిందని ఈసీ లెంపలేసుకుంటే, పాపపరిహారమైపోతుందా? ప్రతిసారీ సకల విధ జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కొత్తగా పేర్ల నమోదుకు, జాబితాల్లో మార్పులూ చేర్పులకు నిర్దిష్ట గడువిచ్చి ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాలు- నూరుశాతం కచ్చితత్వానికి దోహదపడలేకపోతున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దనంతవరకు, ఓటుహక్కుకు తూట్లు పడుతూనే ఉంటాయి!

ఎన్నికల్ని ‘స్వేచ్ఛగా, సక్రమంగా’ నిర్వహించడం ఎలెక్షన్‌ కమిషన్‌ రాజ్యాంగబద్ధ విధి. అర్హులైన ఓటర్లందరి పేర్లతో జాబితాలను ఎన్నికల సంఘమే పటిష్ఠంగా రూపొందించాలి. వాస్తవంలో, జరుగుతున్నదేమిటి? జాబితాల్లో పేరుందో లేదో చూసుకోవాల్సింది పౌరులేనంటూ ఈసీ అలవాటుగా బాధ్యతను దులపరించేసుకుంటోంది. అడిగిన మేరకు రుజువులు ధ్రువపత్రాలు సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేయించుకున్నా, అనేక సంవత్సరాలుగా హక్కును వినియోగించుకుంటున్నా- మళ్ళీ ఎన్నికల నాటికి ఓటు వేసే అవకాశం దక్కుతుందో లేదోనని చింతాక్రాంతులయ్యే దుస్థితి పౌరుల్ని పీడిస్తోంది. ఏళ్ల తరబడి నివాసం మారనివారి పేర్లూ గల్లంతైపోతుండగా, కీర్తిశేషుల నామధేయాలు నిక్షేపంగా కొనసాగుతున్న బాగోతాలకు కొదవలేదు. తప్పుడు వివరాలతో దరఖాస్తులు సమర్పించినవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్న హెచ్చరికలు అక్రమార్కుల పాలిట ప్రభావశూన్యమవుతున్నాయి. వివరాలన్నీ సరిచూశాకనే ఓట్లు తొలగిస్తున్నామంటూ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. తమ పేర్లను జాబితాల నుంచి ఎవరు ఎందుకు తప్పించారని నిలదీస్తూ మొన్నీమధ్య ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. జాతి సార్వభౌమాధికారానికి వ్యక్తిస్థాయి ప్రతీకగా భాసిల్లేది ఓటు. రాజ్యాంగదత్తమైన తమ హక్కును కొల్లబోకుండా పరిరక్షించుకోవాలన్న చేతన ఓటర్లలో ప్రదర్శితమవుతున్న వేళ, ఓటు ప్రాముఖ్యాన్ని ఈసీ ఇన్నేళ్లయినా ఆకళించుకొనకపోవడమేమిటి? ఎన్నికలన్నవి మెజారిటీ ప్రజాభిప్రాయానికి అద్దంపట్టి తీరాలి. అందుకు ఎలెక్షన్‌ కమిషన్‌ త్రికరణశుద్ధిగా నిబద్ధం కానంతవరకు, ప్రజాతంత్ర క్రతువు పరిహాసభాజనమయ్యే దుర్గతి తప్పించుకోలేనిది!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.