మదుపరుల కంట్లో సహ‘కారం’
close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మదుపరుల కంట్లో సహ‘కారం’

భారతావనిలో ‘బ్యాంక్‌’ అంటే ఒక నమ్మకం. దాన్ని నిలబెట్టేలా పటిష్ఠ వ్యవస్థల నిర్మాణంలో దశాబ్దాల తరబడి ఘోర వైఫల్యాలు- స్కాముల పాములై కోరచాస్తున్నాయన్నది నిష్ఠుర సత్యం! నిరుడు ఫిబ్రవరిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.14 వేల కోట్లకు టోపీ పెట్టిన నేరగాళ్ల బాగోతం బయటపడి గగ్గోలు పుట్టింది. దరిమిలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌),  దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల డొల్లదనం వెల్లడై భయ సందేహాలు ముమ్మరించాయి. తాజాగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌ (పీఎంసీ) గుట్టుమట్లు రచ్చకెక్కి మరో భారీ కుంభకోణాన్ని కళ్లకు కడుతున్నాయి. ఏ సహకార బ్యాంకునూ కుప్పకూలనిచ్చేది లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ భరోసా ఇస్తున్నా- పీఎంసీ బ్యాంకు మాజీ ఎండీ గత నెల మూడోవారంలో బ్యాంకు వాస్తవ స్థితిగతుల్ని ఏకరువు పెడుతూ లేఖ రాశాకే రిజర్వ్‌ బ్యాంకు రంగంలోకి దిగింది. హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) సంస్థకు పీఎంసీ బ్యాంకు సాక్షాత్తు కామధేనువుగా మారిందని, ఆ రెండింటి మధ్య బిగిసిన బాదరాయణ బంధం ఎంత బలమైనదంటే, దివాలా తీసిన హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు నిధులే కల్పతరువుగా మారాయని మాజీ ఎండీ థామస్‌ నిజాలు కక్కేశారు. బ్యాంకు ఆస్తుల్లో 70శాతానికిపైగా అంటే రూ.6500 కోట్లు హెచ్‌డీఐఎల్‌కే దోచి పెట్టిన వైనం, 21,049 నకిలీ ఖాతాలు తెరిచి దివాలా తీసిన సంస్థకు నిధుల ప్రవాహానికి దారులు పరచిన ఘోరం- దేశ సహకార బ్యాంకుల చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. రూ.11,617 కోట్ల డిపాజిట్లతో చూపులకు ఏపుగా కనిపిస్తున్న పీఎంసీ బ్యాంకు ఏడెనిమిదేళ్లుగా దారితప్పినా, దొంగఖాతాలతో ఆడిటర్లు, ఆర్‌బీఐ కళ్లు కప్పినా, ఎవరూ ఏ దశలోనూ పసిగట్టలేకపోవడం- నిఘా యంత్రాంగాలు నీరోడుతున్నాయనడానికే నిదర్శనం. ఇప్పటికే ఆర్‌బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న బ్యాంకుల జాబితాలో ఇరవై నాలుగోదిగా పీఎంసీ చేరడం- సహకారంలోనూ అక్రమాల ఉరవడికి నిలువుటద్దం!

వాణిజ్య బ్యాంకుల కంటే రెండు శాతం అధిక వడ్డీ ఇస్తూ, పట్టణాలు నగరాల్లోని మధ్యతరగతి మదుపరుల ఆశల పల్లకీని మోస్తూ విస్తరించే పట్టణ సహకార బ్యాంకుల నిర్వహణలో క్రమశిక్షణ కొరవడిన ప్రతిచోటా సంక్షోభమే రగులుతోంది. తెలుగు గడ్డ మీదే భాగ్యనగర్‌, కృషి, వాసవి, శ్రావ్య, ఛార్మినార్‌, మెగాసిటీ వంటి సహకార బ్యాంకులు అర్ధాంతరంగా మూతపడటంతో పదిహేనేళ్ల క్రితం మదుపరుల హాహాకారాలు మిన్నంటాయి. సహకార బ్యాంకులు కుప్పకూలడానికి ఏయే జాడ్యాలు కారణమవుతున్నాయో తెలిసినా, వాటిని ఎలా పరిహరించాలన్న దానిపై పలు  కమిటీలు విపుల సూచనలు అందించినా దిద్దుబాటు చర్యలు సమగ్రంగా పట్టాలకెక్కక పోవడమే ఎక్కడికక్కడ అభాగ్య మదుపరుల ఉసురు పోసుకొంటోంది. రాష్ట్రాల పనుపున సహకార రిజిస్ట్రార్‌, కేంద్రం పక్షాన ఆర్‌బీఐ ఈ బ్యాంకులపై చలాయించే ఉమ్మడి నియంత్రణే- పలు రకాల రుగ్మతలకు మూల కారణమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2003లోనే గుర్తించింది. కేతన్‌ పరేఖ్‌ శ్రద్ధగా అంటుకట్టిన సెక్యూరిటీల మహా కుంభకోణానికి గుజరాత్‌లోని మాధేపురా మర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ భ్రష్ట నిర్వాకాలే పుణ్యం కట్టుకున్నాయి. దానినుంచి నేర్చిన గుణపాఠాలేమిటన్న ప్రశ్నకు ఈనాటికీ సమాధానం లేదు, రాదు! దాదాపు 130 చిన్న బ్యాంకులకు పీఎంసీ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయంటున్నారు. చెల్లింపుల్లో ఏమాత్రం తేడాపాడాలు వచ్చినా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఊహకందదు. హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రూ.6500 కోట్లు కాకుండానే దాదాపు రూ.8400 కోట్ల రుణాలందించిన పీఎంసీ బ్యాంకు- దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటిగా పేరెన్నికగన్నది. మదుపుదారులెవరూ నష్టపోని విధంగా ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు, మరిన్ని కొలుములు అంటుకోకుండా కాచుకోవడమే ఆర్‌బీఐ దక్షతకు పరీక్ష కానుంది!

ఆర్‌బీఐ గణాంకాల మేరకు- 2005లో 1926గా ఉన్న పట్టణ సహకార బ్యాంకుల సంఖ్య నిరుటికి 1550కి దిగివచ్చింది. ఒకే జిల్లాకు పరిమితమై వందకోట్ల రూపాయల లోపు డిపాజిట్లుగలవాటిని టైర్‌-1గా, పలు జిల్లాలకు విస్తరించి భారీ డిపాజిట్లుగల వాటిని టైర్‌-2గా గుర్తించిన ఆర్‌బీఐ లెక్కల ప్రకారం- తొలి అంచెలో 69శాతం, రెండో అంచెలో 31శాతం బ్యాంకులున్నాయి. పట్టణ సహకార బ్యాంకుల మొత్తం ఆస్తులు రూ.5.6 లక్షల కోట్లు, డిపాజిట్లు రూ.4.6 లక్షల కోట్లు, రుణ వితరణ రూ.2.8 లక్షల కోట్లు! మొత్తం వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల డిపాజిట్లు కేవలం నాలుగు శాతమే అయినా- వాటి ఉనికి, మనికి బ్యాంకింగ్‌ సేవలపట్ల ప్రజావిశ్వాసానికి సూచికనడంలో సందేహం లేదు. వరస వైఫల్యాలతో ఏపీలో పలు సహకార బ్యాంకులు కుదేలైన నేపథ్యంలో ఏర్పాటైన నరసింహమూర్తి కమిటీ ఎన్నదగిన సిఫార్సులెన్నో చేసింది. ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌, ఆడిట్‌ రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులతో బ్యాంక్‌ నిర్వహణ పరిపుష్టం కావాలని, రుణ వితరణ మొత్తంలో డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు తీసుకొనేవి రెండు శాతానికి మించకుండా చూడాలనీ సూచించింది. ఆర్‌బీఐ తనవంతుగా కొన్ని సంస్కరణల్ని పట్టాలకెక్కించినా, పర్యవేక్షక యంత్రాంగాల కళ్లుగప్పే దుస్తంత్రాలు యథాపూర్వం సాగుతూనే ఉన్నాయని పీఎంసీ బాగోతం చాటుతోంది. ఈ పరిస్థితుల్లో సహకార స్ఫూర్తి సడలకుండానే ఎక్కడికక్కడ పటిష్ఠ బిగింపుల్ని చట్టబద్ధం చేసి, పర్యవేక్షక యంత్రాంగాల్ని పరిపుష్టీకరించాలి. అవినీతి మహిషాసుర మర్దనం సమర్థంగా జరిగినప్పుడే బ్యాంకులపట్ల ప్రజావిశ్వాసం ఇనుమడించేది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు