close

సంపాదకీయం

సమాచారహక్కే ‘సుప్రీం’!

ఎవరు ఎంతటివారైనా రాజ్యాంగం, చట్టం వారికంటే సమున్నతమైనవని లోగడ పలుమార్లు సుప్రీంకోర్టే స్పష్టీకరించింది. స్వయంప్రవచిత ఆదర్శానికి న్యాయపాలిక కట్టుబడుతుందా, సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందా అన్న మీమాంసలకు రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పు తెరదించింది. సమాచార హక్కు చట్టంలోని ‘పబ్లిక్‌ అథారిటీ’ నిర్వచనం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమూ వస్తుందని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ఎంతో ఉత్కృష్టమైనది. సమాచార హక్కు, గోప్యత (ప్రైవసీ) హక్కు ఒకే నాణేనికి బొమ్మాబొరుసులంటూ సమాచారాన్ని బిగపట్టడం ద్వారా న్యాయపాలిక స్వాతంత్య్రం సాధించలేదని ధర్మాసనం సరిగ్గా విశ్లేషించింది. ‘న్యాయపాలిక స్వతంత్రత, జవాబుదారీతనం జోడెడ్లుగా సాగాలి... పారదర్శకత స్వాతంత్య్రాన్ని బలోపేతం చేస్తుంది’ అన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్య వెలకట్టలేనిది. న్యాయపాలిక స్వతంత్రత అంటే- జడ్జీలు చట్టానికి అతీతులని కాదంటూ, న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి పౌరవిధులు నిర్వహిస్తున్నందున పూర్తిగా ఏకాకిలా జ్యుడీషియరీ పనిచేయజాలదని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆర్టీఐ స్ఫూర్తికి గొడుగు పట్టారు. 2016 ఆగస్టులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనానికి సారథ్యం వహించిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అప్పటికి ఆరేళ్లుగా నలుగుతున్న వ్యాజ్యాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ‘కోరిన సమాచారం ఇవ్వకుండా నిషేధించడం- న్యాయపాలిక స్వతంత్రత రీత్యా అవసరమా? సమాచారం కోరడమే జ్యుడీషియరీ విధుల్లో జోక్యం చేసుకొన్నట్లవుతుందా?’ వంటి మరో మూడు కీలక ప్రశ్నల్నీ (వీటిని సుప్రీం ద్విసభ్య బెంచ్‌ ప్రస్తావించింది) ధర్మాసనం ముందు ఉంచారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 17న పదవీ విరమణ చెయ్యనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనమే ఎలాంటి శషభిషలకూ ఆస్కారం లేనివిధంగా వెలువరించిన ఈ తీర్పు- సమాచార హక్కును వజ్రాయుధంగా మార్చగలిగేటంత ప్రభావాన్వితమైనది!

అవినీతి అక్రమాల చీకట్లను చీల్చే ఉషాకిరణం లాంటిది సమాచార హక్కు చట్టం. తెల్లదొరల కాలంనాటి అధికార రహస్యాల చట్టాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలు అవినీతిని దాచిపెట్టాలనుకొనే ప్రభుత్వాలకు కీలెరిగి వాత పెట్టేలా ఆర్టీఐ స్ఫూర్తికి ఆయా సందర్భాల్లో పట్టం కట్టింది సుప్రీంకోర్టే కావడం గమనార్హం. అలాంటిది- జడ్జీల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమాచారం కోరుతూ సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ అనే వ్యక్తి ఆర్టీఐ కింద పెట్టుకొన్న అర్జీని సుప్రీంకోర్టు కార్యాలయం తిరస్కరించడమే ప్రస్తుత వివాదానికి నాంది! భారత ప్రధాన న్యాయమూర్తీ ఆర్టీఐ చట్టపరిధిలోకి వస్తారంటూ కోరిన సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) ఆదేశించడంతో విడ్డూర న్యాయపోరాటానికి తెరలేచింది. అతి పారదర్శకత జ్యుడీషియరీ స్వతంత్రతను దెబ్బతీస్తుందంటూ సుప్రీంకోర్టు సీఐసీ ఉత్తర్వులపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2009 సెప్టెంబరులో దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి పిమ్మట నాలుగు నెలలకు త్రిసభ్య బెంచ్‌ తీర్పులు సీఐసీ ఆదేశాల్నే సమర్థించాయి. న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడికి జతపడి, కొలీజియం నిర్ణయాలకు ప్రాతిపదికలేమిటన్న సమాచారం పైనా వివాదం రేగడంతో 2010లో సుప్రీంకోర్టు- దిల్లీ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయపాలికను ఆశ్రయించింది. అప్పీలు చేసిందీ సుప్రీంకోర్టే, తీర్పు చెప్పాల్సిందీ సుప్రీంకోర్టే అయిన ఈ వ్యాజ్యంలో అత్యంత కీలకమైన సమాచార పారదర్శకతకే న్యాయపాలిక ఓటేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో రాజీపడలేమంటూ జాతీయ న్యాయజవాబుదారీ కమిషన్‌ చట్టాన్ని గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. న్యాయపాలిక స్వాతంత్య్రం అంటే కార్యనిర్వాహక వర్గం జోక్యాల నుంచి స్వేచ్ఛగాని, సామాన్య పౌరుల నుంచి కానేకాదన్న న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనల్ని మన్నించిన ధర్మాసనం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది!

‘భారత ప్రజలమైన మేము’ అంటూ రాజ్యాంగాన్ని రాసుకొని తమకు తాము సమర్పించుకొన్న పౌరులే ప్రజాస్వామ్యంలో ‘సుప్రీం’ అనడంలో సందేహం లేదు. రాజ్యాంగంలోని 19వ అధికరణ పౌరులకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ పరిధిలోకే వస్తుంది- వారికి చట్టబద్ధంగా దఖలుపడిన ‘తెలుసుకొనే హక్కు’! దేశ ప్రజాస్వామ్యాన్ని పట్టిపల్లారుస్తున్న అనేక జాడ్యాలకు విరుగుడుగా- ఎన్నికల్లో పోటీపడేవారి కీలక సమాచారం అంతా ఓటర్లకు తెలిసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టే లక్ష్మణ రేఖలు గీసింది. సమాచారాన్ని వెల్లడించినప్పటికంటే దాన్ని మూసిపెడితేనే ఎక్కువ హాని జరిగే సందర్భాల్లో జాతీయ భద్రత సాకుతో ఆర్టీఐ కింద కీలక పత్రాల్ని ప్రభుత్వం బిగపట్టజాలదని మొన్న ఏప్రిల్‌లో సుప్రీంకోర్టే ప్రకటించింది. 2005నాటి విజయదశమి పర్వదినం నుంచి అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టానికి రాజకీయ గ్రహణం పట్టించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడల్లా సాధ్యమైనంతవరకు చక్రం అడ్డువేస్తూ వచ్చిన సుప్రీంకోర్టు తన తాజా తీర్పు ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని ధ్రువీకరించింది. ఇక్కడి సమాచార హక్కు చట్టం ప్రపంచంలోనే మేలిమి అయిదింటిలో ఒకటిగా వాసికెక్కినా, పాలన యంత్రాంగం ఉదాసీనత కారణంగా అమలుతీరు నిరాశాజనకమై ఇండియా నిరుడు ఆరో ర్యాంకుకు దిగజారింది. సమాచార సంఘాల స్వయంప్రతిపత్తిని, మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే ధోరణులు కలవరపరుస్తున్న వేళ సుప్రీం ధర్మాసనం తీర్పు సమాచారోద్యమానికి వెలుగు దివ్వెగా నిలుస్తుందనడంలో మరోమాట లేదు. ఆర్టీఐ చట్రం పరిధిలోకి తాము రామంటూ, ఆయా నిబంధనలు తమకు వర్తించేవి కావంటూ ఠలాయిస్తున్న రాజకీయ పార్టీలూ- పారదర్శకత, జవాబుదారీతనాలకు కట్టుబడి పౌరులకు గల సమాచార హక్కును మన్నించినప్పుడే ప్రజాస్వామ్య భారతికి మంచిరోజులు!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.