close

సంపాదకీయం

విద్యకు ఉపాధితో అనుసంధానం

నేటి పోటీ ప్రపంచంలో సాంకేతికతను, నైపుణ్యాలను ఒడుపుగా అందిపుచ్చుకోగలవారే ఉపాధి వేటలో విజేతలవుతారు. ప్రస్తుత, భావి అవసరాలకు అనుగుణంగా యువతరాన్ని అలా నిపుణ మానవ వనరుల సమూహంగా తీర్చిదిద్దడమన్నది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఎదుట ఉన్న గడ్డు సవాలు. దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువతలో 90శాతం మేర ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్‌ మెలకువలు కొరవడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దురవస్థను దునుమాడటమే లక్ష్యంగా ఉన్నత విద్యారంగాన నైపుణ్యాలు అలవరచే పాఠ్యప్రణాళికలు ప్రవేశపెట్టే నిమిత్తం కేంద్రం రూ.20వేల కోట్ల ప్రత్యేక పథకం సిద్ధం చేసిందన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వాస్తవానికి ‘పేదరికం మీద ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధంలో నైపుణ్య భారత్‌ కార్యక్రమమే ప్రధానాస్త్ర’మని నాలుగేళ్ల క్రితమే ప్రధాని మోదీ ప్రకటించారు. అప్పట్లోనే, 2009నాటి జాతీయ నైపుణ్యాభివృద్ధి వ్యూహం స్థానే- 2022 నాటికి 40 కోట్ల మందిని నిపుణశక్తులుగా మలచాలన్న నూతన విధానం రూపుదిద్దుకుంది. 2016 అక్టోబరులో ప్రతిష్ఠాత్మక పథకం ఆరంభమైంది లగాయతు 2019 జూన్‌ వరకు సుమారు 52లక్షల మంది శిక్షణ పొందగా, వారిలో ఉద్యోగం దక్కించుకున్నవారి సంఖ్య 12.60 లక్షలని(24శాతం) ప్రభుత్వమే రాజ్యసభాముఖంగా వెల్లడించింది. వేర్వేరు మంత్రిత్వ శాఖలు అమలుపరుస్తున్న నైపుణ్య కార్యక్రమాలన్నింటినీ సమన్వయీకరించి, రాష్ట్రాలకు ఇతోధిక భాగస్వామ్యం కల్పించాలన్న ఇటీవలి యోచనను వెన్నంటి ఇప్పుడు ఉన్నత విద్యారంగ క్షాళన ప్రతిపాదన వెలువడింది. తలపెట్టిన బృహత్‌ లక్ష్యం సజావుగా సాకారమయ్యేలా చైనా తరహాలో సమర్థ కార్యాచరణకు ప్రభుత్వాలు నిబద్ధమైతేనే నైపుణ్య శిక్షణ గాడిన పడుతుంది!

పొరుగున జన చైనాలో మూడు దశాబ్దాలకుపైగా, ‘తొమ్మిదేళ్ల నిర్బంధ విద్యావిధానం’ అమలవుతోంది. అందులో ఆఖరి మూడు సంవత్సరాలూ వృత్తి విద్యా బోధన సాగుతోంది. ఆ పునాదిపై సీనియర్‌ సెకండరీ విద్య కొనసాగిస్తున్నవారిలో ఇంచుమించు సగంమంది వృత్తినిపుణులుగా రాణిస్తున్నారు. దక్షిణ కొరియా 96శాతం దాకా, జర్మనీ 75శాతం, యూకే 68 శాతం మేర యువతను నిపుణ శ్రామికులుగా తీర్చిదిద్దుతున్నాయి. దేశీయంగా ఆ సంఖ్య అయిదు శాతంలోపే! 2030 సంవత్సరం నాటికి భారత్‌లో పనిచేసే వయస్కుల జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా 96 కోట్లకు పైబడుతుందని అంచనా. వారిలో పట్టభద్రుల సంఖ్య 31 కోట్ల వరకు ఉంటుందని, ఉద్యోగం సంపాదించిపెట్టే నైపుణ్యాలు ఒనగూడేవారు సగం మందేనని ‘యునిసెఫ్‌’ నివేదిక ఇటీవలే మదింపు వేసింది. వృత్తి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న అర్హులైన నిపుణుల ప్రాతిపదికన 63 దేశాల జాబితాలో భారత్‌ ఇప్పటికే 53వ స్థానాన అలమటిస్తోంది. ‘స్కిల్‌ ఇండియా’పై ప్రచారం ఎంత మోతెక్కుతున్నా, క్షేత్రస్థాయి స్థితిగతులు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్న సంగతి 70శాతం యువజనులకు తెలియనే తెలియదని నిరుడొక అధ్యయనం స్పష్టీకరించింది. నిపుణ యోజనలపట్ల విస్తృత జన చేతన కలిగించడంతోపాటు- రకరకాల కారణాలతో ఏ దశలో చదువు మానేసినవారైనా అప్పటిదాకా ఒంటపట్టిన మెలకువలతో సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా వ్యవస్థాగతంగా విధివిధానాల పరిపుష్టీకరణ ప్రభుత్వాల మౌలిక బాధ్యత. ప్రతిపాదిత పాఠ్య ప్రణాళికల ప్రక్షాళనను కేవలం ఉన్నత విద్యారంగానికే పరిమితం చేయకూడదు. పాఠశాల స్థాయినుంచే పనికొచ్చే చదువులకు, బతికించే విద్యకు సరైన ఒరవడి దిద్ది- పరిశ్రమల్ని విద్యాలయాలతో అనుసంధానించాలి!

ఐక్యరాజ్య సమితి అయిదేళ్లక్రితం తీర్మానించినట్లు- ‘యువత సాధికారతను, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంలో నైపుణ్యాభివృద్ధి పాత్ర ఎనలేనిది’! దురదృష్టవశాత్తు- చదువుకు, ఉపాధికి లంకె ఏనాడో తెగిపోయిన భారత్‌లో నైపుణ్యాభివృద్ధి అంశం ఏళ్ల తరబడి దారుణ నిర్లక్ష్యానికి గురైంది. ఒకపక్క, సరైన అర్హతలు కలిగిన నిపుణ శ్రామికులు లభ్యం కావడంలేదని 70శాతం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు- 58శాతం పట్టభద్రులు, 62శాతం దాకా స్నాతకోత్తర పట్టభద్రులు నిరుద్యోగ రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. విద్యావంతుల్లో నిరుద్యోగం పెచ్చుమీరుతూ- ఇంటర్‌, పదో తరగతి విద్యార్హతలు సరిపోయే కొలువులకూ పీహెచ్‌డీలు, స్నాతకోత్తర పట్టభద్రులు సైతం బారులు తీరుతున్న దుస్థితి నిశ్చేష్టపరుస్తోంది. బహుళజాతి సమాచార సాంకేతిక దిగ్గజ సంస్థ అధినేత్రి గినీ రొమేటీ చెప్పినట్లు- ‘ఇప్పుడు డిగ్రీల కన్నా నైపుణ్యాలు ముఖ్యం’. సమాచార సాంకేతిక పరిజ్ఞానం పరిధి విస్తరిస్తున్న కొద్దీ కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌ చెయిన్‌, డేటా ఎనలిటిక్స్‌, సైబర్‌ భద్రత, రొబోటిక్‌ ప్రాసెస్‌ ఆటొమేషన్‌ (ఆర్‌పీఏ) తదితర విభాగాల్లో పోనుపోను అపార అవకాశాలు విప్పారతాయంటున్నారు. వాటిని అందిపుచ్చుకోగల శక్తి సామర్థ్యాలు రేపటి తరానికి    పుష్కలంగా సమకూరేలా పాఠ్య ప్రణాళికల కూర్పు, దీటుగా బోధన సిబ్బందికి శిక్షణ- కొత్త పుంతలు తొక్కాలి. విద్యార్థులు మున్ముందు ఉద్యోగ జీవితంలో నిర్వహించబోయే వృత్తిపరమైన బాధ్యతలకు తగ్గట్లు ఎదిగేలా జర్మనీ, నార్వే, ఫిన్లాండ్‌ వంటివి తరగతి గదుల్ని సృజన కేంద్రాలుగా మలచడంలో ముందున్నాయి. ఇక్కడా యావత్‌ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలకు చోటుపెడితేనే, నిపుణ వనరుల విశ్వ రాజధానిగా భారత్‌ ఆవిర్భావానికి బంగరు బాటలు పడతాయి!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.