close

సంపాదకీయం

ప్రజలు తలచుకొంటేనే...

ప్రజాస్వామ్యం అనే నాగరిక పాలన విధానానికి రాజ్యాంగం నారు పోయగా- సచ్ఛీల విలువలనే నీరుపోసి, నిజాయతీ నిబద్ధతలనే కంచె వేసి, ప్రజా సేవా పరాయణత్వమే ఎరువుగా మేలిమి ఫలసాయానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలది. ఏ దశలోనూ కంచే చేను మేయకుండా కాచుకోవాల్సిన విహిత కర్తవ్యం పరిణత పౌర సమాజానిది. దురదృష్టం ఏమిటంటే, ప్రజల చుట్టూ పరిభ్రమించాల్సిన రాజకీయం- అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఏకైక అజెండాగా దారి తప్పిన నాటినుంచే గల్లీనుంచి దిల్లీ దాకా నేరస్వామ్యం గజ్జె కట్టింది. రాజ్యాంగపరమైన లక్ష్మణ రేఖల్ని మీరలేమంటూనే నేరగ్రస్త రాజకీయాల నిర్మూలనకు సాక్షాత్తు సర్వోన్నత న్యాయపాలిక చేస్తున్న కృషీ ఒంటిచేతి చప్పట్లనే తలపిస్తోంది. నేర చరితులైన శాసనకర్తల్ని అనర్హుల్ని చేసినంత మాత్రానే నేర రాజకీయాల ఉరవడిని అరికట్టలేమని, అందుకోసం రాజకీయ పక్షాల ‘ప్రక్షాళనా’ మొదలు కావాలని తాజా ఆదేశాల్లో సుప్రీం కోర్టు సరిగ్గానే గుర్తించింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో పార్టీలు గుప్పిట విప్పడం లేదంటూ రాజ్యాంగంలోని 129, 142 ద్వారా దఖలు పడిన అధికారాల్ని వినియోగించి న్యాయపాలిక ఆరు ఉత్తర్వులు వెలువరించింది. నేర చరిత్ర లేనివారిని కాదని, క్రిమినల్‌ నేరారోపణలెదుర్కొంటున్న వారిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో, వారిపై అభియోగాలేమిటో, అవి ఏ దశలో ఉన్నాయో పార్టీలు వాటి వెబ్‌సైట్లో విస్పష్టంగా ప్రకటించాలంది. ఎన్నికల్లో ‘గెలవగలగడం’ మాత్రమే కాకుండా అభ్యర్థులకు సంబంధించి ఏయే అర్హతలు, ఘనతల్ని పరిగణించారో తెలపాలని ఆయా అంశాల్ని ప్రాంతీయ, జాతీయ వార్తా పత్రికల్లోను పార్టీపర సామాజిక మాధ్యమాల్లోనూ ప్రకటించాలనీ నిర్దేశించింది. ఆయా వివరాల్ని ఈసీకి సమర్పించాలనీ సూచించింది. ఈ ఉత్తర్వులకు కట్టుబడక పోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామనీ స్పష్టీకరించింది. నేరగ్రస్త రాజకీయ మదగజాన్ని అదిలించడానికి తాజా ఆదేశాల అంకుశం సరిపోతుందా అన్న సందేహమే పీడిస్తోంది!

గత పదేళ్లలో దోషిగా తేలిన, నేరాభియోగాలకు గురైన, ఏ క్రిమినల్‌ కేసులోనైనా ఇరుక్కున్న వ్యక్తులకు, సంఘ వ్యతిరేక శక్తులకు ఎలాంటి ఎన్నికల్లోనూ టిక్కెట్లు ఇవ్వబోమని పార్టీలన్నీ లోగడ ముక్తకంఠంతో తీర్మానించాయంటే, నమ్మగలమా? దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా 1997లో పార్లమెంటు చేసిన ఆ తీర్మానం- నంగనాచి పార్టీల ద్వంద్వ పోకడలకే దాఖలా! దరిమిలా, ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల పూర్తి వివరాలు (ఆస్తి అప్పులు, విద్యార్హతలు, నేరమయ గతం) ఓటర్లకు తెలియాల్సిందేనంటూ దిల్లీ హైకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు- నేరగ్రస్త రాజకీయాలపై మొదలైన న్యాయ పోరాటానికి నాంది. తదాదిగా దాదాపు రెండు దశాబ్దాలకాలంలో న్యాయపాలిక డజనుకుపైగా ఘాటు తీర్పులు వెలువరించినా, వాటికి పార్టీలు, ప్రభుత్వాల కట్టుబాటు దేవతావస్త్రాన్నే తలపించింది. 2004లో 24శాతంగా ఉన్న నేరచరిత ఎంపీల సంఖ్య, 2009లో 30శాతానికి, 2014లో 34 శాతానికి, 2019లో ఎకాయెకి   43శాతానికి విస్తరించింది. ప్రస్తుత లోక్‌సభలో హత్యలు, అత్యాచారాల వంటి హేయ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 29శాతంగా నమోదు కావడం- భారత ప్రజాస్వామ్య బహుముఖ పతనానికి ప్రబల సంకేతం! ఎన్నికల్లో అభ్యర్థులకు ఎంత హేయ నేరచరిత ఉంటే, విజయావకాశాలు అంతగా పెరుగుతున్నాయన్న అధ్యయనాలు- భ్రష్టుపట్టింది పార్టీలు మాత్రమే కాదు, పౌర సమాజం కూడానన్న విషాదకర వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. మరోవంక నేరగాళ్లకు వింజామరలు వీస్తూ, శీలహీన రాజకీయాల్లో పరస్పరం పై చేయి చాటుకోవడానికి పోటీపడుతున్న పార్టీలు- నేర చరితులపై ఈగైనా వాలకుండా కాచుకోవడానికి మాత్రం అపూర్వ ఏకాభిప్రాయంతో ఒక్కతాటి మీదకొస్తున్నాయి!

‘వ్యవస్థీకృత రాజకీయ పక్షాలు నేరచరితుల్ని ఎన్నికల్లో నిలబెట్టకుండా ఉంటే, సమస్యను సమర్థంగా ఎదుర్కోవచ్చు’నని ఆశావహంగా స్పందించిన నాటి రాష్ట్రపతి నారాయణన్‌- ‘పార్టీలు ఆ మాత్రం చేయలేవా?’ అనీ సూటిగా ప్రశ్నించారు. నేరగాళ్లతోనే తమ మనుగడ అని తీర్మానించేసుకొన్న రాజకీయ పక్షాలు- ఆయా సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల స్ఫూర్తిని కాలరాసే చట్టసవరణలకూ తెగించడం నగుబాటు! ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62(5) మేరకు- కారాగారంలో లేదా పోలీసు కస్టడీలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం లేదని, ఓటు అర్హత లేనివారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హతా ఉండదని ఏడేళ్లనాడు సుప్రీంకోర్టు ప్రభావాన్విత తీర్పు ఇచ్చింది. దాన్ని కొరగాకుండా చేసేలా నాటి యూపీఏ సర్కారు సంబంధిత చట్టానికి అదనపు వివరణ జోడించడం ద్వారా పోలీసు నిర్బంధంలో ఉన్న నేరగాళ్లు ఎన్నికల్లో దర్జాగా పోటీ చెయ్యగల వీలు ప్రసాదించింది. ప్రజాస్వామ్యమనే అమృత ఫల వృక్షానికి నేరగ్రస్త రాజకీయమనే కాయ తొలుచు పురుగు ఆశించింది. ‘అభ్యర్థుల నేరమయ గతాన్ని బహిరంగ పరచడం’ అనే మందును పిచికారీ చేస్తే పరిస్థితి చక్కబడే అవకాశం లేనేలేదని బోధపడుతూనే ఉంది. నేరగ్రస్త భస్మాసుర హస్తంతో రాజకీయాలాడుతున్న పార్టీలు అక్షరాలా కొరివితో తలగోక్కుంటున్నాయి. మరోపక్క, తక్షణ ప్రయోజనాలపట్ల ఆశతోనో, కులమత ప్రాంతీయ భావాలపట్ల అనురక్తితోనో ఓటర్లూ నేరచరితులకు కొమ్ముకాస్తున్న తీరూ నిర్వేదం కలిగిస్తోంది. తమకోసం కష్టించే, నిజంగా మేలు చేసే లక్షణం, సేవాభావం అభ్యర్థుల్లో ఎంత కీలకమో ఓటర్లు గుర్తించడం లేదు. వ్యాపారమయమైపోయిన ఎన్నికల్లో స్వీయ లబ్ధి ప్రధానంగాని, పార్టీలకూ ఆ పట్టింపు లేదు! పార్టీలను దారిలో పెట్టగల చేతనత్వం ప్రజల్లో ప్రాదుర్భవిస్తే తప్ప నేరగ్రస్త రాజకీయాల పీడ విరగడ కాదు!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.