close

సంపాదకీయం

మాంద్యానికి మందేదీ?

ట్టుమని రెండు రోజుల్లోనే మరో లక్ష పైచిలుకు కేసుల విస్తృతితో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు, ఒక చెంప ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీదకు నెడుతూ, మరోవంక ప్రపంచార్థికాన్ని కుదేలుచేస్తూ కరోనా వైరస్‌ కోరసాచిన తీరుకు అగ్రదేశాలూ బావురుమనే దుస్థితి సంప్రాప్తించిందిప్పుడు! కరోనా విషకోరల్లో చిక్కి చైనా విలవిల్లాడుతున్నప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం విస్తరించే అవకాశంపై ఆందోళనలు చెవినపడుతున్నాయి. ఇప్పుడిక అలాంటి ఊహాపోహలకు తావేలేదని, ప్రపంచార్థికం మాంద్యంలోకి ప్రవేశించిందనీ ఐఎమ్‌ఎఫ్‌ తాజాగా స్పష్టీకరించింది. ఈ దశ 2009నాటి ఆర్థిక సంక్షోభం అంత తీవ్రంగానో, అంతకంటే అధ్వానంగానో ఉండబోతోందంటూ, కరోనా కట్టడిలో అంతర్జాతీయ సమాజం సఫలమై ఆర్థిక నష్టాల్ని పరిమితం చెయ్యగలిగినప్పుడే వచ్చే ఏడాదికైనా ప్రపంచం కోలుకోగలుగుతుందనీ హెచ్చరిస్తోంది. 1930లనాటి మహామాంద్యం తరవాత అంతటి ఆర్థిక సంక్షోభం పడగెత్తింది 2007-’09 నడిమికాలంలోనే! దానివల్ల ఒక్క అమెరికాకు వాటిల్లిన ఆర్థిక నష్టమే    22 లక్షలకోట్ల డాలర్లన్నది అక్కడి సర్కారీ అధ్యయనం నిగ్గుతేల్చిన లెక్కే! ప్రపంచ వస్తూత్పత్తుల కర్మాగారంగా వాసికెక్కిన చైనా కరోనా తాకిడి నేపథ్యంలో ఉత్పత్తి కార్యకలాపాల్ని దాదాపుగా స్తంభింపజేయడం, ఊహాతీత వేగంతో విస్తరించిన వైరస్‌ దేశదేశాల్లో ప్రకటిత, అప్రకటిత దిగ్బంధాలకు కారణం కావడంతో అభివృద్ధి అంచనాలన్నీ తలకిందులైపోయాయి. చైనా 4.5 శాతం, ఇండియా రెండున్నర శాతం వృద్ధిరేట్లకు పరిమితమవుతాయంటున్న అధ్యయనాలు- అన్ని దేశాల ప్రగతి సూచీలూ నేలచూపులు చూస్తున్నాయని నిర్ధారించాయి. తల్లడిల్లుతున్న ప్రపంచార్థికాన్ని తెప్పరిల్ల చేసేందుకంటూ జి-20 దేశాలు నిర్వహించిన అసాధారణ భేటీ- కరోనా వల్ల దాపురిస్తున్న సామాజిక ఆర్థిక నష్టాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించింది. అయిదు లక్షల కోట్ల డాలర్ల నిధుల ప్రవాహంతో ప్రపంచార్థికానికి కొత్త సత్తువ కల్పిస్తామని జి-20 వాగ్దానం చేస్తున్నా- కార్యాచరణ ప్రణాళిక ఇంకా రూపకల్పన దశలోనే ఉంది!

ఆర్థికంగా శక్తిసంపన్నమైన 20 దేశాలు ప్రపంచార్థికంలో 79శాతం వాటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంటే తక్కిన 173 దేశాల వాటా కేవలం 21శాతమే. ఈ తరహా చిన్నాపెద్దా లెక్కలకు కాలంచెల్లేలా దాదాపు అన్ని దేశాల్నీ చుట్టుముట్టిన కరోనా ధాటికి- ‘ఎంత చెట్టుకు అంత గాలి’ చందంగా పెద్ద దేశాలు దారుణంగా దెబ్బతినిపోతున్నాయి. 2008నాటి సంక్షోభం ప్రపంచవ్యాప్తం కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టింది. కేవలం మూడు నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టిన కరోనా వైరస్‌- బడా బహుళజాతి సంస్థల నుంచి స్వయంఉపాధి పొందేవారి దాకా అందరి పొట్టా కొట్టి కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగానికి ఆవాహన పలికింది. 33కోట్ల అమెరికా జనాభాలో సగంమందికిపైగా ఇళ్లకే పరిమితమైపోగా, ప్రయాణ పర్యాటక పరిశ్రమలవంటివి పూర్తిగా పడకేయడంతో 30 లక్షలమంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. కాబట్టే రెండు లక్షల కోట్ల డాలర్ల భూరి సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్‌ సర్కారు- బోయింగ్‌ లాంటి కార్పొరేట్ల నుంచి చిరుద్యోగుల దాకా భిన్న వర్గాల్ని ఆదుకొనే కార్యాచరణ అమలుకు ఉపక్రమించింది. పరిశ్రమల మూత కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న ఐక్యరాజ్య సమితి- కార్మికులు మూడున్నర లక్షలకోట్ల డాలర్ల మేర ఆదాయం కోల్పోయే ప్రమాదంపైనా ముందస్తు హెచ్చరికలు చేసింది. ఇండియాలోనే పర్యాటకరంగంలో అయిదులక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారంపై కరోనా దుష్ప్రభావం ప్రసరించిందని పార్లమెంటరీ స్థాయీసంఘానికి పదిరోజుల నాడు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖే నివేదించింది. పరిస్థితి తీవ్రత ఇంత స్పష్టంగా కళ్లకు కనబడుతున్నందున- క్షీణిస్తున్న పారిశ్రామిక ఆరోగ్యాన్ని కుదుటపరచేందుకు, మాంద్యాన్ని చెదరగొట్టేందుకు సరైన ఔషధ సాంత్వన సత్వరం అందుబాటులోకి రావాలి!

‘ప్రపంచ యుద్ధాల సమయం నాటి పరిస్థితులకు మించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. వ్యవస్థపై నమ్మకంపోకుండా చూడాలి. పర్యాటక, నిర్మాణ, ఆతిథ్య రంగాలతోపాటు అసంఘటిత రంగంపై ప్రభావం తీవ్రంగా ఉంది’- వారం రోజులనాడు పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య అది. 21 రోజులపాటు దేశవ్యాప్త ‘లాక్‌డౌన్‌’ కారణంగా దేశార్థిక వ్యవస్థపై ఎకాయెకి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల భారం పడనుందన్న నిపుణుల అంచనా ఏ మాత్రం తోసిపుచ్చలేనిది. కేంద్ర విత్తమంత్రి ఇటీవల ప్రకటించిన      లక్షా 70వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రధానంగా అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని లక్షించిందే. ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలతో బ్యాంకింగ్‌ రంగంలోకి రూ.3.74లక్షల కోట్లు అ‘ధనం’గా అందుబాటులోకి వస్తుందంటున్నా- కరోనా పరచిన అనిశ్చితి క్రీనీడలు చెల్లాచెదురు కానంతకాలం, ఆ చొరవ ఏ మేరకు ప్రయోజనకరమన్నది ప్రశ్నార్థకమే! ఉత్పత్తికి అవకాశం లేని పరిస్థితుల్లో పరిశ్రమల్ని మూసివేసినా, ఉద్యోగులు ఎవర్నీ తీసివేయరాదని, జీతాల కోత సరికాదనీ ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో- వాటికీ సత్వరం ప్రాణవాయువు అంది తీరాలి. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు సగానికిపైగా పతనం కావడం- 80శాతం పైగా దిగుమతులపై ఆధారపడే ఇండియాకు అనుకోకుండా దక్కిన వరం. ఆ వెసులుబాటును వినియోగించి దేశీయ పరిశ్రమల్ని కాచుకొంటేనే కరోనా దుష్ప్రభావాన్ని అధిగమించి అభివృద్ధి లక్ష్యాలు చేరగలం!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.