close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశ్వనగరానికి తలమానికం!

గటున రోజుకు 30 కిలోమీటర్ల జాతీయ రహదార్ల నిర్మాణంతో ప్రగతికి బాటలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, భాగ్యనగరానికి మణిహారం కాగల ప్రాంతీయ రింగు రోడ్డు ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. సుమారు రూ.17వేల కోట్ల వ్యయంతో 344 కి.మీ. పొడవున నిర్మించతలపెట్టిన ఈ ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌)ని రెండు భాగాలుగా పట్టాలకెక్కించాల్సి ఉంది. ఉత్తర విభాగం కింద వచ్చే 158 కి.మీ. మార్గాన్ని ఇప్పటికే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించింది. దాని నిర్మాణానికి రూ.7561 కోట్లు, భూసేకరణకు రూ.1961 కోట్లు వ్యయ అంచనా వేసి నిధులు మంజూరు చేసిన కేంద్రం- దక్షిణ విభాగమైన చౌటుప్పల్‌- సంగారెడ్డికి సంబంధించీ అంచనాలు సిద్ధం చేసినా జాతీయ రహదారిగా దాన్నింకా గుర్తించాల్సి ఉంది! ఈ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణంతో నాగపూర్‌-హైదరాబాద్‌-బెంగళూర్‌ కారిడార్‌, పుణె-హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌ల మధ్య అనుసంధానం పెరగడమేకాదు, తెలంగాణలోని ప్రజల్లో 40శాతం దానిలోపలే ఉండే విశిష్టమైన ప్రాజెక్టు ఇది. కేసీఆర్‌ మానస పుత్రికగా హైదరాబాద్‌ సరిహద్దు జిల్లాలను అనుసంధానించే ఈ రహదారి ప్రతిపాదన 2016లోనే వెలుగు చూసినా- దాన్ని ఏ విధంగా చేపట్టాలన్న దానిమీద దీర్ఘకాలంగా మంతనాలు సాగుతున్నాయి. ఆర్థికంగా ఏ మేరకు గిట్టుబాటు అవుతుందన్న దాన్ని పక్కనపెట్టి భవిష్యత్‌ అవసరాల రీత్యా ప్రాజెక్టును చేపట్టాలని ఈనెల తొలివారంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కనీసం 500 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి రహదారి నిర్మాణం పోను తక్కిన దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే ఆర్థికంగా ప్రాజెక్టు నిలదొక్కుకొంటుందని కేంద్రం నిరుడు సూచించింది.  అలా చేస్తే 50వేల ఎకరాల్ని సేకరించాల్సి వస్తుందంటూ అది సాధ్యం కాదన్న కేసీఆర్‌ సర్కారు 12-13 వేల ఎకరాల సేకరణతో ప్రతిష్ఠాత్మక  ప్రాజెక్టు సాకారం కావాలంటోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు తలమానికమయ్యేలా ఆర్‌ఆర్‌ఆర్‌పై నిర్మాణాత్మక వ్యూహం రూపొందాలి!
వలసలు పోటెత్తి నగరాల్లో నానాటికీ దుర్భరమవుతున్న ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారంగా వలయ రహదారు (రింగ్‌ రోడ్డు)లు కనిపిస్తున్నా- వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తే అవే అద్భుత ప్రగతికి చోదక శక్తులవుతాయి. ఆరు రింగ్‌రోడ్లతో బీజింగును పరిపుష్టం చేసిన చైనా అపార ప్రయోజనాల్ని ఒడిసిపడుతోంది. వచ్చే ఏడాదికల్లా రూ.6.92 లక్షల కోట్లతో 84వేల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ లక్ష్యాల్ని భారత్‌ మాల ప్రాజెక్టు కింద సాధించాలనుకొంటున్న కేంద్రం- 28 ప్రధాన నగరాల్లో రూ.36,290 కోట్లతో రింగు రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు అల్లింది. దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నా- ప్రాంతీయ వలయ రహదారే అన్నింటికన్నా పెద్దది. భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరించేలా ప్రతిపాదిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ను వేగవంతమైన ప్రయాణ, రవాణా మార్గంగానే కాదు, దాని వెంబడి ఉన్న అన్ని పరగణాల సమగ్రాభివృద్ధి సాధకంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమలు, టౌన్‌షిప్పుల నిర్మాణ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వస్తున్న ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్‌ మేర గ్రోత్‌ కారిడార్‌గా ప్రకటిస్తూ 2008లోనే ఉత్తర్వులు జారీ అయినా- పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కీలకమైన గ్రిడ్‌ రోడ్ల నిర్మాణం ద్వారా సమగ్రాభివృద్ధి సాధనకు 2016లో సంకల్పించినా, ఇంకా బండి గాడినపడనే లేదు. ఔటర్‌ రింగు రోడ్డుకు, ప్రాంతీయ వలయ రహదారికి వ్యూహాత్మక అనుసంధానాలు ఏర్పాటుచేసి వాటి నడుమ శాటిలైట్‌ టౌన్‌ షిప్పుల నిర్మాణం వేగవంతమయ్యేలా చూడాలి. ఎవరినుంచి భూమి సేకరించారో వారే ప్రాజెక్టు తొలి లబ్ధిదారులయ్యేలా పటిష్ఠ విధివిధానాలు కూర్చి, కేంద్రం తోడ్పాటుతో విశ్వనగరానికి కొత్త నగిషీలు అద్దాలి!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు