ప్రాణభిక్ష
close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రాణభిక్ష

నిరంతరం సుఖలాలసతలోనో ధనార్జన మైకంలోనో మునిగి తేలేవాడికి ‘ఇక చాలు’ అనిపించడం చాలా గొప్ప విషయం. అది జీవితానికి ఎంతో మేలు. పరిపక్వతకు అదే ఆనవాలు. ‘కాయల్‌ గాచె వధూనఖాగ్రములచే కాయంబు(దేహం), వక్షోజముల్‌ రాయన్‌ రాపడె రొమ్ము...’ బతుకంతా స్త్రీ సుఖాపేక్షతో వెంపర్లాడింది... చెప్పడానికే రోతగా ఉంది... చాలిక! ‘విరక్తు చేయగదవే’ అని పరమేశ్వరుణ్ని ప్రాధేయపడ్డాడు ధూర్జటి. అది భోగాల పట్ల విరక్తి. ‘చెల్లబోని నాణెములు ఇంట చేర్చి నే మహా ధనికుడనను తలంపుటరదము(ఆలోచనల రథం) ఎక్కి తిరిగినాను, నిజమెరింగి తెల్లబోతి... బయలుపడె పేదతనమెల్ల బ్రతుకు చిరిగె’ అంటూ అగ్నివృక్షంలో కవి అనుమాండ్ల భూమయ్య ప్రకటించింది- ధనార్జన పట్ల అసంతృప్తి, జ్ఞానం పట్ల అనురక్తి. క్షణికమైన వైరాగ్య చిహ్నాలు కావవి. ‘నీ పూజకోసం పూసిన కుసుమాన్ని నేను. ఆలసించక స్వీకరించు’ అని ప్రార్థించిన రవీంద్రుడి వివేక ‘గీతాంజలి’కి అనుపల్లవి స్వరాలవి. ‘ఎంత విభవము కలిగె, అంతయును ఆపద అని చింతించునదె కదా- చెడని జీవనము’ అన్న అన్నమయ్య పలుకులను జీర్ణించుకొన్నవారికి కలిగే అద్భుతమైన ఆలోచనలవి. ప్రాజ్ఞతకు సంకేతాలవి. ఎరుకతో మాత్రమే సిద్ధించే ఈ తరహా లోచూపు లోకంలో అందరికీ అలవడదు. ‘ప్రాయంబాయెను బట్టగట్టె తల’ అనే స్థితిలోనూ ‘ఈ వయసులో నాకెవరిస్తార్రా పిల్లనీ’ అంటూ సాగదీశాడంటే చింత చచ్చినా పులుపు చావనే లేదని అర్థం. నేతలలో పదవీకాంక్ష ఈ బాపతుదే. సాయం పడితే తప్ప సరిగ్గా కూర్చొని లేవలేని పండు ముసలితనం- అధికార కుర్చీని విడిచిపెట్టమంటే మాత్రం ససేమిరా అని గింజుకుంటుంది. ‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది’ అనే తత్వాన్ని గుర్తుచేస్తుంది.

పాతికేళ్లు కారాగారంలో మగ్గి, ఎట్టకేలకు దేశానికి స్వరాజ్యం సాధించిపెట్టి, దేశాధ్యక్ష పదవి చేపట్టిన  నెల్సన్‌ మండేలా- ‘అప్పుడేనా’ అని ప్రపంచం విస్తుపోయే సమయంలో ‘నా కర్తవ్యం ముగిసింది’ అంటూ పదవినుంచి తప్పుకొన్నారు. ఉదాత్త చరితులన్న మాటకు అర్థమది. ‘త్యాగేనైకే అమృతత్వ మానశుః’ అని బోధించింది అవధూతోపనిషత్తు. సమర్పణతో అమృతత్వం సిద్ధిస్తుందని ఆ మాటకు అర్థం. ‘శిబి ప్రముఖులుం ప్రీతిన్‌ యశఃకాములై ఈరే కోర్కులు వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌’ అని భాగవతం ప్రస్తావించింది- అలాంటి త్యాగమూర్తుల గురించే! శంఖచూడుడనే సర్పం ప్రాణాలకు బదులుగా గరుత్మంతుడికి తన ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన జీమూతవాహనుడి కథను నాగానందంలో శ్రీహర్షుడు వివరించాడు. దేవతలకోసం తాను యోగాగ్నిలో ఆహుతై, తన ఎముకలు బ్రహ్మచక్రం వజ్రాయుధాలుగా రూపొందేందుకు వీలుగా ప్రాణత్యాగం చేసిన కథ దధీచిది. ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాలు వారివి. ఈ కలియుగంలోనూ అంతటి త్యాగబుద్ధిని ప్రదర్శించిన నాగపూర్‌కు చెందిన 85 ఏళ్ల నారాయణరావు దభాద్కర్‌ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనాతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయే స్థితిలో దవాఖానాలో అతి కష్టమ్మీద ఆయనకో ఆక్సిజన్‌ పడక లభించింది. ‘బతుకు జీవుడా’ అనుకొంటూ బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. ఇంతలో ప్రాణాపాయంతో పడక దొరక్క విలపిస్తున్న యువకుడు ఆయన కంటపడ్డాడు. రాలిపోయే పూవులాంటి తన మనుగడకన్నా అప్పుడే మొగ్గ తొడిగిన ఆ లేత కుసుమం విలువైనదని భావించి నారాయణరావు నిశ్చింతగా అంగీకారపత్రం రాసిచ్చేసి ఇంటికి తిరిగొచ్చేశారు. మూడు రోజుల తరవాత ఆయన చనిపోయారు. కాదు కాదు... ఉపనిషత్తు చెప్పినట్లు- ప్రాణదానంతో కీర్తికాయుడై మిగిలిపోయారు!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు