ఆర్తుల్ని ఆదుకోలేరా?
close

సంపాదకీయం

ఆర్తుల్ని ఆదుకోలేరా?

దేళ్లకోమారు జరిగే భారతావని జనగణన చరిత్రలో ఒకే ఒక్కసారి 1921లో దేశ జనాభాలో నికర తరుగుదల నమోదైంది. వందేళ్లక్రితం విరుచుకుపడిన స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి మృత్యుఘోషకు నిదర్శనమది. పద్దెనిమిది నెలలుగా ప్రపంచ దేశాల్ని పట్టికుదుపుతున్న కొవిడ్‌ కల్లోలం ఇప్పటికే 38 లక్షల మందికిపైగా అభాగ్యుల్ని పొట్టన పెట్టుకొందని ‘అధికార గణాంకాలు’ చాటుతున్నా అసలు సంఖ్య అంతకు రెండు మూడింతలు ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవలే నిష్ఠుర సత్యం పలికింది. ఇండియా వ్యాప్తంగా కొవిడ్‌ మృతుల సంఖ్యను అతి తక్కువగా చూపుతున్నారన్న ఆరోపణలకు బిహార్‌, మహారాష్ట్ర వంటి చోట్ల చోటు చేసుకొంటున్న సవరణలు బలం చేకూరుస్తున్నాయి. అధికారిక ‘సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌’లో క్రమం తప్పక నమోదవుతున్న మరణాల్ని, కొవిడ్‌ మృతుల వివరాలతో సరిపోల్చి దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది కరోనా కాటుకు బలై ఉంటారంటున్న అధ్యయనాలు ఏమాత్రం తోసిపుచ్చలేనివి. కచ్చితంగా కొవిడ్‌ మృతుల గుర్తింపు, ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం (ఎన్‌డీఎంఏ) కింద నష్టపరిహారం చెల్లింపు కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా పది రోజుల క్రితం కేంద్రం స్పందన పూర్తి సానుకూలంగానే ఉంది. తాజా ప్రమాణ పత్రంలో మాత్రం- ఆర్థిక ఇబ్బందుల్ని ఏకరువు పెడుతూ అడ్డగోలు వాదనలకు శ్రుతి చేసిన తీరే నిర్ఘాంతపరుస్తోంది. కరోనా మరణాలన్నింటినీ ధ్రువీకరిస్తామన్న కేంద్రం- మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల వంతున చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాల నిధి మొత్తం దానికే సరిపోతుందని బేలగా స్పందించింది. చట్ట ప్రకారం కనీస ప్రామాణిక పరిహారం చెల్లించాల్సి ఉండగా- దాన్ని భిన్న రూపాల్లో అందిస్తూనే ఉన్నామని, తాత్కాలిక సాయం అన్నది చట్టబద్ధ హక్కేమీ కాదని, న్యాయపాలికా ఈ విషయంలో జోక్యం చేసుకోజాలదనీ వివరించింది. శతాబ్ది సంక్షోభంగా విరుచుకుపడి, లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన మహా విషాదంపై కేంద్రం వైఖరి వ్యాకులపరుస్తోంది!

సాధారణ పరిస్థితుల్లోనే వైద్య ఖర్చులు భరించలేక ఏటా 5.5 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్న దేశం మనది. ప్రపంచంలోనే అత్యధికంగా మూడింట రెండొంతుల వైద్య ఖర్చుల్ని సొంతంగానే భరించాల్సి వస్తున్న అభాగ్య జనావళిపై కొవిడ్‌ మృత్యుఘాతాలు పెను సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులతో దీన్ని పోల్చలేమన్నంత మేరకు కేంద్రం వాదన హేతుబద్ధమే. వాటిలా కొన్ని గంటల్లోనో, రోజుల్లోనో సమసిపోకుండా, ఏణ్నర్ధకాలంగా పచ్చని కుటుంబాల్ని కసిగా కబళిస్తున్న మహమ్మారి- పసిపిల్లలు మొదలు పండుటాకుల వరకూ ఎందరెందరినో అనాథల్ని చేసేసిందన్నదీ విస్మరించరాని వాస్తవమే! ఇంటిపెద్దను కాపాడుకొనే విఫలయత్నంలో ఉన్నదంతా ఊడ్చి, అప్పులూ దూసితెచ్చి, ఏ దిక్కూలేకుండా వీధుల పాలైన లక్షల మంది అభాగ్య జనావళికి ఆసరాగా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వాలకు లేదా? నష్టపరిహారం చెల్లింపులో సంపన్న శ్రేణిని మినహాయించి పూర్తిగా చితికిపోయిన బడుగు మధ్యతరగతికి ఆలంబనగా నిలవడమే కదా- రాజ్యాంగం ప్రవచించిన సంక్షేమ రాజ్య భావన? గత దశాబ్దిలో ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల పారుబాకీల్ని రద్దు చేసిన ఘన చరిత్ర మనది. నిజంగా కొవిడ్‌ రగిలించిన కన్నీటి కాష్ఠంలో సమిధలవుతున్న అభాగ్యుల్ని ఆదుకోవాల్సి వచ్చేసరికి చట్టాలకు వక్రభాష్యాలు చెబుతూ చేతులెత్తేయడం ఏమిటి? ఏ నిర్ణయం తీసుకోవాలన్న సందేహం కలిగితే- మీ దృష్టిపథంలోకి వచ్చిన నిరుపేదను గుర్తుతెచ్చుకొని, ఫలానా నిర్ణయం వల్ల   అతనికి ఏమైనా మేలు జరుగుతుందా అని ఆలోచించి ముందడుగేయాలని  జాతిపిత నిర్దేశించారు. మహాత్ముని 150వ జయంతిని ఘనంగా నిర్వహించిన కేంద్రం- జాతిపిత సూక్తిని, మానవతా స్ఫూర్తిని గుర్తించి అభాగ్యుల కన్నీళ్లు తుడవాల్సిన సమయం వచ్చిందిప్పుడు!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న