హృద్య కవితా తిలకం

సంపాదకీయం

హృద్య కవితా తిలకం

‘నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు... నా అక్షరాలు వెన్నెలలో అడుకొనే అందమైన ఆడపిల్లలు’- బాలగంగాధర తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’లోని ఈ రెండు పంక్తులకు సాహితీలోకంలో ఒకప్పుడు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఆ రోజుల్లో శ్రీశ్రీ తరవాత అత్యంత ప్రజాదరణ పొందిన వచన కవిగాను, ఎక్కువ మందిని చేరుకొన్న కవిగాను తిలక్‌ను చెబుతారు. కవికి రెండు ప్రపంచాలుంటాయి. బయట జనంతో కలిసి తిరిగేదొకటి; ఆ ప్రపంచం అందించిన అనుభవాలతో, ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ ఏకాంతంలో తనతో తాను జీవించేదొకటి. అంటే, అనేకత్వం నుంచి ఏకత్వానికి, తిరిగి ఏకత్వం నుంచి అనేకత్వానికి కవి సంచరిస్తుంటాడు. ఆ సంచారమే కావ్యరచనకు ప్రేరణగా నిలుస్తుంది. ‘బాహ్య ప్రపంచ దృశ్యాలు అంతరంగ ప్రపంచంలో దృశ్య రూపాన్ని కోల్పోయి అనుభూతిగా మిగులుతాయి’ అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఆ అనుభూతిని కవిత్వీకరించిన కవిగా తిలక్‌ సుప్రసిద్ధులు. ‘ప్రాచీనులు చెప్పిన రసవాదంతో దీనికి అవినాభావ సంబంధం ఉంది’ అన్నారు ప్రముఖ కవి సిధారెడ్డి. తిలక్‌ రసవాది. ఆయన చెప్పిన పై రెండు వాక్యాలలోను మొదటిది లోకానుభూతికి, రెండోది ఆత్మానుభూతికి ప్రతీకలుగా నిలుస్తాయి. తిరిగి ఆ రెండే అభ్యుదయ, భావ కవిత్వాలకు ప్రాతినిధ్యం వహించిన కారణంగా తిలక్‌ను ఆ రోజుల్లో ‘భావ అభ్యుదయ కవి’గా పేర్కొనేవారు. ‘తాను ప్రధానంగా అనుభూతివాదినని తిలక్‌ బల్లగుద్ది మరీ చెప్పారు’ అన్నారు ఆ పుస్తకానికి ముందు మాటలో కుందుర్తి. ‘కవిత్వం అంతరంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి... విస్తరించాలి చైతన్య పరిధి... అగ్నిజల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి’ అన్నది తిలక్‌ అంతరంగం. పదాల ఎంపికలో, పదబంధాల కూర్పులో, ప్రతీకల సృష్టిలో నేర్పును కాల్పనిక ప్రతిభను విశేషంగా ప్రదర్శించిన అగ్రశ్రేణి కవి తిలక్‌.

శ్రీశ్రీ మాదిరే పద్యంతో సాహితీ ప్రస్థానాన్ని ఆరంభించిన కవి తిలక్‌. శ్రీశ్రీ దారిలోనే ప్రాచీన వాఙ్మయంలోని ప్రౌఢమైన ప్రతీకలను ఆధునిక కవిత్వానికి అనుసంధానించి, అద్భుతమైన అనురణన సౌందర్యానుభూతిని సాధించిన కవి తిలక్‌. ‘నాకును నీకు మైత్రి ఒక నాటిది కాదు. కృతాంతమందు, వాల్మీకుల శోకమందు, మిథిలేశుని పట్టి (సీతమ్మ) విషాదమదాకృతి దాల్చెగాక’ పద్యం తిలక్‌ తొలినాళ్ల పోకడలను ప్రతిబింబిస్తుంది. ‘నా కవిత్వం’ ఖండికలోని చివరి పాదాలు, వసుధైక గీతంలో వాతావరణ ఆవిష్కరణ, ‘నీడలు’ కవిత ముగింపులోని ఎనలేని సొగసు... తిలక్‌ ప్రతిభకు, ప్రతీకలను ఎంచుకోవడంలో జాణతనానికి ఏతాము పట్టిన సందర్భాలు. ఆయన కవిత్వం రెండు వైపులా పదునైన కత్తి. రాత్రివేళ రాజమండ్రి గౌతమీ జలాల్లో ప్రతిఫలించిన వేల విద్యుద్దీప కాంతులను పరికించి ‘ఎవరీవిడ ధమ్మిల్లం(జడకొప్పు)లో ఇన్ని కాంతిలతాంతాల్ని తురిమారు!’ అని మురిసిపోతారు. మరోవైపు ‘ఆర్తగీతం’లో ‘ఒక్క నిరుపేద ఉన్నంతవరకు ఒక్క మలినాశ్రు బిందువొరిగినంతవరకు, ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’ అంటూ వేదనకు గురవుతారు. ‘మృదుమాధ్వీ పదలహరీ తరంగ మృదంగ విలసద్భంగీ మనోహరాలౌ కావ్యాలు’ అనే ప్రౌఢ సంస్కృత పదభూయిష్ఠ సమాసాల చెంతనే ‘చలి తుపాను వీచి వీచి అలరు తోట వాడిపోవు, పొలిమేరల మంటలేచి పూరి గుడిసె కాలిపోవు’ వంటి సరళ సుందర తేట పదసంపద చెంగలించడం తిలక్‌ భాషావైదుష్యానికి చిహ్నం. ‘సాహసి కానివాడు జీవన సమరానికే కాదు, స్వర్గానికీ పనికిరాడు’ వంటి అభివ్యక్తి తీవ్రతను సైతం కవిత్వంలో అందంగా పొదువుకోవడం సాధ్యమైన విలక్షణ కవి తిలక్‌. తెలుగు కవితాసతికి పట్టు కుచ్చుల తలపాగా అలంకరించిన దేవరకొండ బాల గంగాధర తిలక్‌ శతజయంతి వత్సరమిది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న