close

సంపాదకీయం

ప్రాణాంతక ఖనిజ దోపిడీ
మాఫియా శక్తుల పడగనీడన అవినీతి గనులు, అక్రమ తవ్వకాలకు వత్తాసుగా ఆ వైపు ఏమాత్రం చూపు సారించని సర్కారీ ఘనులు- ఉమ్మడిగా రచించిన విషాదాధ్యాయం ఇది. దాదాపు ఆరువారాల నాడు మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకొన్న 15మంది శ్రామికులను రక్షించే యత్నాలు ఒకవంక సాగుతున్నా అదంతా దింపుడు కళ్ళెం ఆశనే తలపిస్తోంది. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తీకరించినా- లైౖటిన్‌ నదీ ప్రవాహం ముంచెత్తిన ఆ గనిలో 160-210 అడుగుల లోతున ఓ మృత దేహాన్ని కనుగొన్నట్లు నౌకాదళం ప్రకటించింది. కనీసం కర్మకాండలైనా జరిపేందుకు మృతదేహాల్ని వెలికితీయాలన్న బాధిత కుటుంబాల వేడికోళ్లు ఒకవైపు, అది అసాధ్యమంటున్న నిపుణుల సూచనలు మరోవైపు- ఎలుక బొరియల్లాంటి అక్రమ బొగ్గు గనులు శ్రామికుల సజీవ సమాధి వేదికలవుతున్న ఘోర విషాదాన్ని కళ్లకు కడుతున్నాయి. 15మంది అభాగ్యులు 320 అడుగుల లోతున ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాస్తవం వెలికి వచ్చిన 13 రోజుల తరవాత, వాళ్లను రక్షించేందుకు తగిన సాధన సంపత్తి కావాలంటూ మేఘాలయ ప్రభుత్వం ‘కోల్‌ ఇండియా’ సంస్థకు విజ్ఞప్తి చేసింది. నీటిని తోడే భారీ పంపులు ప్రమాద స్థలికి చేరేసరికి మరో పదిరోజులు పట్టింది! బహిరంగ రహస్యంగా సాగుతున్న అక్రమ బొగ్గు గనుల తవ్వకాల్లో 2011 లగాయతు ఇప్పటికి 70కిపైగా ప్రమాదాలు 90మంది దాకా అభాగ్యుల్ని కబళించాయని తెలిసినా, ప్రభుత్వ యంత్రాంగంలో అంతెత్తున మేటవేసిన ఉదాసీనత- మరణ మృదంగ ధ్వనుల ఉద్ధృతికే ఊతమిస్తోంది. అక్రమ బొగ్గు తవ్వకాల్ని 2014లోనే నిషేధించినా, తన ఆదేశాల్ని అమలు చెయ్యడంలో మేఘాలయ ప్రభుత్వం విఫలమైందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వందకోట్ల రూపాయల జరిమానా వడ్డించిన నేపథ్యంలోనే- మరో రెండు విషాదాలు చోటుచేసుకొన్నాయి. ఒక గని ప్రమాదంలో ఇద్దరు శ్రామికులు మృతి చెందగా, మరో గనిలో ముగ్గురు చిక్కుబడిన దుర్ఘటన- అవినీతి గనులు మృత్యు కుహరాలవుతున్నాయని ఎలుగెత్తుతున్నాయి!

‘ఎక్కడెక్కడ అక్రమంగా గనుల తవ్వకం జరుగుతున్నదో పరిశీలించి కఠిన చర్యలు చేపట్టారా?’- మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సంధించిన సూటి ప్రశ్న అది. ఫిబ్రవరి ఒకటినుంచి బొగ్గు రవాణాను రాష్ట్రంలో నిషేధించిన సుప్రీంకోర్టు, సక్రమంగా వ్యవహరించలేదంటూ కన్రాడ్‌ సంగ్మా ప్రభుత్వంపై కన్నెర్ర చేసినా- రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలపై ఎన్‌జీటీ విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తేయాలని అది గట్టిగా కోరుతోంది. రాష్ట్రంలో 57 కోట్ల 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, దాదాపు పదిశాతం కుటుంబాలు బొగ్గు వెలికితీత, రవాణానే నమ్ముకొని బతుకుతున్నాయని, బొగ్గు తవ్వకాల నిషేధంతో రాష్ట్రం రూ.600 కోట్ల రాబడి నష్టపోయిందని ప్రభుత్వం చెబుతోంది. అక్రమ బొగ్గు తవ్వకాల కేంద్ర స్థలిగా ఉన్న జయంతియా హిల్స్‌ పరగణాలోనే ఎలుక బొరియల్ని పోలిన బొగ్గు క్షేత్రాల్లో 70వేలమంది దాకా బాల శ్రామికులు పని చేస్తున్నారని అధ్యయనాలు చాటుతున్నాయి. అంతకుమించి అక్రమ గనుల తవ్వకాల్లో రాటుతేలినవారు రాజకీయంగానూ బలపడటంతో హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు పసలేనివైపోయాయి. బొగ్గు తవ్వకాల్ని పునః ప్రారంభిస్తామన్న వాగ్దానంతో నిరుడు అధికార పగ్గాలు చేపట్టిన భాజపా- నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ కూటమి ప్రభుత్వం, ఆ మేరకు కేంద్రంపై గట్టిగానే ఒత్తిడి తెస్తోంది. అక్రమ మైనింగ్‌ కారణంగా తలెత్తే భయానక ఉత్పాతాలు బహుముఖంగా ఎంతటి చెరుపు చేస్తాయో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ఎన్నెన్నో రుజువులు పోగుపడ్డ దేశం మనది. అక్రమ తవ్వకాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ- 14,500 చోట్ల ఖనిజ దోపిడీ జరుగుతోందని, దానివల్ల సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టం సంభవిస్తోందని నిష్ఠురసత్యం పలికి పుష్కరకాలం దాటింది. ఇప్పటికీ ఆగక సాగుతున్న ఖనిజ దోపిడీని అరికట్టే చొరవ ఏదీ?

‘అత్యంత విలువైన ఖనిజ సంపదను తక్కువ ఖర్చుతో గరిష్ఠ ప్రయోజనదాయకంగా మలచుకోవడం జాతీయ ప్రాధాన్యంగల అంశం’ అన్న జాతీయ ఖనిజ విధాన లక్ష్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మన్నిస్తే- ఎక్కడికక్కడ మాఫియా శక్తులు కుబుసం విడిచే ఆస్కారం ఎక్కడిది? అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో ఉన్నా, నల్లబంగారం దిగుమతిలో రెండో స్థానంలో నిలవడం- గిరాకీ సరఫరాల మధ్య అగాధాన్నే కాదు, అమూల్య వనరులను జాగ్రత్తగా వినియోగించుకోలేని వ్యూహ వైఫల్యాల్నీ కళ్లకుకడుతోంది. లోగడ లక్షా 86వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం దేశాన్ని దిగ్భ్రాంతపరిస్తే, ఖనిజ సంపదపై పరచుకొంటున్న మాఫియా పడగనీడ మరింత ఆందోళన కలిగిస్తోంది. బొగ్గు గనుల తవ్వకాలే తమకు మనుగడ అంటున్న మేఘాలయ లాంటి రాష్ట్రాల సామాజిక, ఆర్థిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని, మాఫియా మూలాల్ని ఛేదించేలా, శాస్త్రీయ పంథాలో సకల భద్రతా ప్రమాణాలతో పర్యావరణ హితకరంగా మైనింగ్‌ కార్యకలాపాలు సాగేందుకు తగు ప్రాతిపదికలు సిద్ధం కావాల్సిన తరుణమిది. దేశ విదేశీ ప్రైవేటు సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు క్షేత్రాల్ని వేలంలో పాడుకొని, అవసరం ఉన్నవారికి స్వేచ్ఛగా విక్రయించుకొనే విధానానికి కేంద్ర ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. భారీ కర్మాగారాలకు ఇంధన భద్రత, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి సృష్టితో యువతకు జీవన భద్రత కల్పించే ఈ చొరవ- మేఘాలయలాంటి రాష్ట్రాలకు ఈసరికే వెలుగు దివ్వె కావాల్సింది. పారదర్శకత జవాబుదారీతనాలతో పట్టాలకెక్కే ఖనిజ విధానం- మాఫియా మూకల కోరలు పెరికే కఠిన నిబంధనలతో అమలైనప్పుడే, శ్రామికుల భద్రతకూ భరోసా దక్కేది!
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.