close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవ్యవస్థను చక్కదిద్దలేరా?

చ్చే అయిదేళ్లలో ఇండియా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుందని రంగరాజన్‌ లాంటి ఆర్థిక వేత్తలు నిర్దేశిస్తున్నారు. తయారీ రంగం బలహీనపడి, వస్తు గిరాకీ పడిపోయి, ప్రైవేటు పెట్టుబడులు మందగించి, అంతర్జాతీయ మాంద్యంతో ఎగుమతులు కుదేలైన వాతావరణంలో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పతనమైన దురవస్థ భారతావనిని వేధిస్తోందిప్పుడు! ప్రగతి మందగించిందేగాని, మాంద్యం గురించి భయపడాల్సిన పనేమీ లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. రంగాలవారీగా ఉద్దీపన చర్యల్ని కేంద్రం ప్రకటిస్తున్నా, కార్పొరేట్‌ పన్ను, మ్యాట్‌ల హేతుబద్ధీకరణతో విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థలిగా ఇండియాను తీర్చిదిద్దే చొరవ చూపినా- ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. వ్యాపార అనుకూలత సూచీలో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి ఇండియా గొప్ప ముందంజ వేసిందని; భారత్‌ వంటి అత్యంత భారీ దేశం, అనేక సంక్లిష్టతల్ని అధిగమించి 63వ స్థానానికి చేరడం అసామాన్యమని ప్రపంచ బ్యాంకే ఇటీవల శ్లాఘించింది. అమెరికా చైనాల మధ్య ఎడతెగని వాణిజ్య స్పర్ధ కారణంగా బీజింగు నుంచి బిచాణా ఎత్తేయాలనుకొంటున్న బహుళ జాతి సంస్థల్ని సూదంటు రాయిలా ఆకట్టుకొనే లక్ష్యంతో ప్రత్యేక కమిటీని కొలువు తీర్చి మరీ మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగేస్తోంది. ఈ విషయంలో వియత్నాం ఇండియాకంటే నాలుగడుగులు ముందే ఉన్న వాస్తవాన్ని, దానికి కూడా ఉన్న పరిమితుల్నీ గుర్తించి ‘భారత్‌లో తయారీ’కి ఊతమిచ్చేలా బహుళ జాతి దిగ్గజాల్ని ఆకట్టుకొనే కార్యాచరణకు కేంద్రం సిద్ధపడుతోంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా...’ సామెత చందంగా, ఆర్థిక సంస్కరణల శకం ఆరంభమైన 28ఏళ్ల తరవాతా ప్రత్యక్ష పెట్టుబడులకోసం చకోరాలై ఎదురు చూడాల్సిన దుస్థితి- సంస్థాగత అవ్యవస్థనే వేలెత్తి చూపుతోంది! భూ రికార్డుల డిజిటలీకరణ, ఒప్పందాల సక్రమ అమలులో వెనకబాటే ఇండియా ప్రగతిని దిగలాగుతోంది!

అయిదేళ్ల క్రితం వ్యాపార అనుకూలత సూచీలో 142వ స్థానంలో ఉన్న ఇండియా, ఇప్పుడు 63కు చేరడం గర్వకారణమే అయినా, అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో ఈ ఏడాది పది స్థానాలు దిగజారి 68వ స్థానానికి పడిపోయింది. ఏటికేడు పోటీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కార్మిక సంస్కరణల ఆవశ్యకతను దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు ప్రస్తావిస్తుంటే- ఆస్తుల రిజిస్ట్రేషన్‌, రుణాలు పొందడం, మైనారిటీ పెట్టుబడిదారుల పరిరక్షణ, పన్నుల చెల్లింపులు, ఒప్పందాల అమలు వంటి వాటిలో సహేతుక మార్పులకోసం ప్రపంచ బ్యాంకే ఎలుగెత్తింది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే విషయంలో ఇండియా రికార్డు ఎంత పేలవమో దానికి దక్కిన 136వ స్థానమే చెబుతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎంత అధ్వానంగా ఉందో వెల్లడిస్తూ స్టాంపు డ్యూటీ రేట్లు తక్కిన దేశాలతో పోలిస్తే అధికంగా ఉండటం, లావాదేవీల్లో వాస్తవ విలువల్ని తక్కువ చేసి చూపడం; గృహ, స్థిరాస్తి రంగాల్లో పునాది స్థాయి సంస్కరణల్ని ఇప్పటికీ చేపట్టకపోవడం వంటి రుగ్మతల్ని అంతర్జాతీయ సమాజం ప్రస్తావిస్తోంది. కాబట్టే ఆ రంగంలో మొత్తం 190 దేశాల్లో ఇండియా 154వ ర్యాంకుతో ఈసురోమంటోంది. భూముల వివరాల్ని డిజిటలీకరించి, ఆ సమాచారాన్ని దేశవ్యాప్తంగా క్రయ విక్రయాలకు వీలుగా అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని ప్రపంచబ్యాంక్‌ అధిపతి డేవిడ్‌ మల్‌పాస్‌ రెండు నెలలక్రితం ప్రధాని మోదీ దృష్టికే తీసుకెళ్ళారు. చైనానుంచి తరలిపోయే కార్పొరేట్లను వియత్నాం, ఫిలిప్పీన్స్‌ ఆకట్టుకోగలగడానికి వ్యాపార అనుకూల వాతావరణం- దేశవ్యాప్తంగా ఒక్క తీరుగా పరిఢవిల్లేలా చూసుకోవడమే కారణం. ఒప్పందాల్ని ఔదల దాల్చడంలో, వివాదాలు తలెత్తితే సత్వరం పరిష్కరించడంలో ఇండియా భ్రష్ట రికార్డు- పెట్టుబడిదారులకు పీడకలగా మారిందన్నది నిర్ద్వంద్వం!

పీవీ జమానాలో ప్రపంచీకరణకు తలుపులు తెరిచినప్పుడు- చైనా కన్నా మిన్నగా భారత్‌కు పెట్టుబడులు ప్రవహిస్తాయని, ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అందుకు ఎంతగానో దోహదపడతాయని విశ్లేషణలు జోరెత్తాయి. అందుకు పూర్తి భిన్నంగా అగ్రరాజ్యంతో డీ అంటే డీ అనేలా బీజింగ్‌ 12 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాణిస్తుంటే, చైనాను దాటి వచ్చే పెట్టుబడులకోసం ఇండియా అంగలారుస్తోంది! ఒప్పందాల అమలులో ఇండియా ఎక్కడో 163వ స్థానంలో  కునారిల్లుతోంది. అందుకు ప్రధానంగా తప్పు పట్టాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాల్నే అని ఆర్థిక మంత్రి సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ స్పష్టీకరిస్తున్నారు. ఒప్పందానుసారం చెల్లింపులు జరపడంలో, ఇతరేతర ఒడంబడికలకు కట్టుబడటంలో ప్రభుత్వాల దివాలాకోరుతనాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌సింగ్‌ జమానాలోనే వొడాఫోన్‌ సంస్థకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా- అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.20 వేల కోట్లు దాన్నుంచి రాబట్టడానికి ఏళ్ల తరబడి సాగిన అనుచిత పోరాటం దేశ ప్రతిష్ఠనే దిగలాగింది. మొన్నటికి మొన్న సౌర, పవన విద్యుత్‌ సరఫరా ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం కాలదన్నిన వైనం, జపాన్‌తో కలిసి నిర్మిస్తున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు ఎర్ర జెండా చూపిన తీరు- ఒప్పందాల ఔచిత్యాన్నే దెబ్బతీస్తున్నాయి. అలాంటివాటిపై తలెత్తే న్యాయ వివాదాల పరిష్కారం ఎప్పటికి తెములుతుందో తెలియని దురవస్థా దినదిన ప్రవర్ధమానమవుతోంది. వాణిజ్య స్పర్ధ సునామీలా తాకుతున్నా చైనాకు ప్రవహిస్తున్న పెట్టుబడుల్లో మూడుశాతం వృద్ధి- దుర్భేద్య వ్యవస్థకు సోదాహరణ నమూనా! దేశార్థికాన్ని అలా చక్కదిద్దుకోగలమా?

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.