close

సంపాదకీయం

కష్టనష్టాలే రైలు పట్టాలు

భారతీయ రైల్వే ఆర్థిక ఆరోగ్యం పోనుపోను క్షీణిస్తోంది. కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ తాజాగా పార్లమెంటుకు నివేదించిన గణాంక వివరాలు నిగ్గు తేలుస్తున్న యథార్థమిది. వంద రూపాయలు ఆర్జించడానికి రైల్వేలు సగటున ఎంత ఖర్చుపెడుతున్నదీ లెక్కించి, దాన్ని నిర్వాహక నిష్పత్తి(ఆపరేటింగ్‌ రేషియో-ఓఆర్‌)గా పరిగణిస్తుంటారు. అది ఎంత ఎక్కువగా ఉంటే అంతగా రైల్వేల లాభదాయకత అడుగంటినట్లు. 2016-17లో 96.5 శాతానికి చేరిన ఆ నిష్పత్తి మరుసటి ఏడాది 98.44 శాతానికి విస్తరించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. వాస్తవానికి సరకు రవాణా పద్దుకింద ప్రభుత్వరంగ సంస్థలు ఎన్‌టీపీసీ, ఇర్కాన్‌ కలిసి ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా చేసిన ముందస్తు చెల్లింపులు రైల్వేలు రెవిన్యూ లోటు చూపించే దుస్థితి రాకుండా చక్రం అడ్డువేశాయి. లేనట్లయితే నిర్వాహక నిష్పత్తి 102.66గా దిగ్భ్రమ గొలిపేదని అంచనా! దశాబ్ద కాలంలో గరిష్ఠ స్థాయికి చేరి ఓఆర్‌ ఉరుముతున్న నేపథ్యంలో- అంతర్గతంగా ఆదాయ మార్గాల పెంపుదలపై రైల్వేలు దృష్టి పెట్టాల్సిందేనని ‘కాగ్‌’ హితవు పలుకుతోంది. అనివార్యమైతేనే తప్ప కొత్తగా ఉదార చర్యల జోలికి పోవద్దంటోన్న ‘కాగ్‌’, కొన్ని రాయితీల దుర్వినియోగాన్ని సోదాహరణంగా తప్పుపట్టింది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో కనీసం మూడు వేల సందర్భాల్లో నియమోల్లంఘన జరిగిందన్న ‘కాగ్‌’ నివేదిక- పదేళ్ల బాలుడికీ ఆ ప్రత్యేక రాయితీ వర్తింపజేయడమేమిటని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ సామాజిక సంక్షేమ బాధ్యత దృష్ట్యా వయోవృద్ధులతోపాటు ఇతరత్రా కొన్ని వర్గాలకు రాయితీలు ఇవ్వాల్సిందే. ఆ ఔదార్యం దుర్వినియోగమై అక్రమార్కులకు అయాచిత వరంగా భ్రష్టుపట్టి రైల్వేల పుట్టి ముంచకుండా కంతలన్నీ సత్వరం పూడ్చేయాల్సిందే!

సుమారు 22వేల రైళ్లలో రోజూ రెండు కోట్ల 22 లక్షలమందికిపైగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే వ్యవస్థ జాతి ప్రగతికి జీవనాడి వంటిది. 1950-2016 మధ్య ప్రయాణికుల సంఖ్య 1344 శాతం, సరకు రవాణా 1642శాతం పెరిగినా రైల్వే నెట్‌వర్క్‌ విస్తృతి కేవలం 23 శాతానికే పరిమితమైందని లోగడ సుదీప్‌ బందోపాధ్యాయ కమిటీ వెల్లడించింది. అరకొర సదుపాయాలపై తగని ఒత్తిడి ఒకవంక, ప్రాథమ్యాల పట్టాలు తప్పిన పథక రచన మరోవైపు- భారతీయ రైల్వేను అవస్థల్లోకి నెట్టేశాయి. రైలు పట్టాల బాగోగుల్ని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన ట్రాక్‌మెన్‌ (గ్యాంగ్‌మెన్‌) విధుల్లో ఉన్న 30వేల మందిని ఉన్నతాధికారుల గృహాల్లో ఊడిగం చేయించేందుకు మళ్ళించే సంస్కృతి, అధికార గణాల మెహర్బానీలు రెండేళ్ల క్రితం దాకా యథేచ్ఛగా పెచ్చరిల్లాయి. భారతావని అనుసంధానంలో కీలక భూమిక పోషించే రైల్వే వ్యవస్థలో పరివర్తన తెస్తామన్న ప్రధాని మోదీ సంకల్ప దీక్షతో కొన్ని మార్పులు మొదలయ్యాయి. వ్యయభారాన్ని నియంత్రించడంలో భాగంగా రైల్వే బోర్డును 25శాతం మేర కుదించారు. పదకొండు రైళ్లలో ‘హాగ్‌’ సాంకేతికత ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే ఇంధన బిల్లును రూ.35 కోట్లనుంచి రమారమి ఆరు కోట్ల రూపాయలకు తగ్గించగలిగింది. ప్రస్తుతమున్న ట్యూబ్‌లైట్ల స్థానే ఎల్‌ఈడీ బల్బులు వినియోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భారతీయ రైల్వే ప్రణాళికలు అల్లుతోంది. ఈ తరహా పొదుపు చర్యలు స్వాగతించదగినవేగాని, ‘కాగ్‌’ సూచించినట్లు అంతర్గత రెవిన్యూ పెంపు యత్నాలూ చురుగ్గా ఊపందుకోవాలి. వృథావ్యయాన్ని తగ్గించుకుని నిర్వాహక నిష్పత్తిలో మెరుగుదల సాధించడం ఎంత ముఖ్యమో- సేవల వాసి, ప్రయాణ భద్రత, వేగం, ఆధునిక హంగులపరంగానూ భేషనిపించుకోవడం అంతే అత్యావశ్యకం.

నిర్వహణ వ్యయాలు పోను ప్రతిపాదిత పెట్టుబడిపై 14శాతం నికర రాబడి సాధ్యమయ్యే ప్రాజెక్టులనే చేపట్టాలన్న భారతీయ రైల్వే విత్త స్మృతిలోని నిబంధనే ప్రామాణికమైతే- 70శాతం దాకా గిట్టుబాటు కానివేనని గతంలో ‘కాగ్‌’ విశ్లేషించింది. రేపటి అవసరాలకు తగ్గట్లు రైల్వేలను తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పం, రాబడి-ఖర్చుల మధ్య అర్థవంతమైన సమతూకం సాధించగల పరిణత యాజమాన్య పద్ధతి కొరవడి దశాబ్దాలుగా జనాకర్షక విధానాలే పాలక గణాలకు ముద్దొచ్చాయి. రైల్వేల ఆర్థిక సత్తువకు తూట్లు పడటానికి; ఆయువు తీరిన పట్టాలు, ఏ క్షణాన కూలిపోతాయో అంతు చిక్కని వంతెనలు, పనికిమాలిన సంకేత(సిగ్నలింగ్‌) వ్యవస్థలు వర్ధిల్లడానికి ప్రధాన కారణమదే! మానవ వినియోగానికి ఏమాత్రం సరిపడని ఆహార పదార్థాలు, గడువు ముగిసిన ఉత్పాదనలు, అనుమతులు పొందని నీటి సీసాలను ప్రయాణికులకు అంటగట్టడాన్ని ‘కాగ్‌’ తూర్పారపట్టిన రెండేళ్ల తరవాతా- అనుచిత విక్రయాలు పూర్తిగా అదుపులోకి రానేలేదు. అమెరికా, చైనా, రష్యాల తరవాత అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఇండియాదే అయినా- ఆధునికీకరణలో అక్కడికి ఇక్కడికి హస్తిమశకాంతరం చెక్కుచెదరడంలేదు. సమయపాలన, అత్యధునాతన సదుపాయాల పరికల్పనలో అవి తమదైన ముద్ర వేస్తుండగా- భారతీయ రైల్వే ఆపసోపాలు పడుతోంది. వాటితో పోలిస్తే మేలిమి డిజైన్లు, సమర్థ కంట్రోల్‌ కమాండ్‌ వ్యవస్థల ఆవిష్కరణలో దశాబ్దాల మందభాగ్యం దేశాన్ని నేటికీ వెక్కిరిస్తోంది. ‘నీతి ఆయోగ్‌’ సభ్యులుగా బిబేక్‌ దేబ్రాయ్‌ సూచించిన ప్రకారం ‘భారతీయ రైల్వేలో రాజకీయ జోక్యం నివారించడానికి, వృత్తిపరమైన సామర్థ్యంతో వ్యవస్థను పునరుత్తేజితం చేయడానికి’ ఆరంభమైన మార్పులు ప్రయాణికుల ప్రశంసలు చూరగొనేలా వేగం పుంజుకోవాలి. రైల్వేల ప్రతిష్ఠను, ఆర్థిక సౌష్ఠవాన్ని పెంపొందించే పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికే ‘శ్రేష్ఠభారత్‌’ అవతరణకు దోహదపడుతుంది!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.