close

సంపాదకీయం

కమ్మేస్తున్న విషధూమం

విశ్వవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం ఇంతలంతలవుతూ వాటిల్లుతున్న దుష్పరిణామాల తీవ్రతకు, గ్రీన్‌పీస్‌ ఆగ్నేయాసియా తాజా నివేదికాంశాలు అద్దం పడుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెచ్చరిల్లుతున్న వాయుకాలుష్యానికి అంతర్జాతీయంగా ఏటా చెల్లిస్తున్న మూల్యం ఎకాయెకి 2.9లక్షల కోట్ల డాలర్లుగా(రూపాయల్లో 200 లక్షల కోట్లకు పైగా) ఆ అధ్యయనం లెక్కకట్టింది. అది ప్రపంచ జీడీపీలో 3.3శాతానికి సమానం. భారత్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరమన్న గ్రీన్‌పీస్‌ సంస్థ- ఇక్కడ ఏటా 10లక్షల మంది ప్రాణాల్ని శిలాజ ఇంధన కాలుష్యం కబళిస్తున్నదని, నెలలు నిండకుండానే 9.80లక్షల శిశువులు జన్మిస్తున్నట్లు మదింపు వేసింది. ఆ రూపేణా దేశం భరించాల్సి వస్తున్న వార్షిక ఆర్థిక నష్టం ఇక్కడి జీడీపీలో 5.4శాతానికి సమానమంటే- కాలుష్యం ఎంతగా విజృంభిస్తున్నదో స్పష్టమవుతుంది. శిలాజ ఇంధనాలు వెదజల్లుతున్న విష ధూళికణాల కారణంగా పెద్దయెత్తున నష్టపోతున్న దేశాల జాబితాలో అమెరికా(900 బిలియన్‌ డాలర్లు), చైనా(600 బిలియన్‌ డాలర్లు)ల తరవాత మూడో స్థానం భారత్‌(150బిలియన్‌ డాలర్లు)దే. మరణాల పద్దులో చైనా(18లక్షలు), ఇండియా(10లక్షలు) ముందున్నాయంటున్నా- ఇది సమగ్ర చిత్రాన్ని కళ్లకు కట్టడంలేదు. దేశాలవారీగా అర్ధాంతర మరణాల్ని గణించి, అందులో 40శాతం వాహన పారిశ్రామిక కాలుష్యాల పుణ్యమేనని ఇటీవలే నిగ్గుతేల్చిన జీఏహెచ్‌పీ(ఆరోగ్యం, కాలుష్యాలపై అంతర్జాతీయ భాగస్వామ్య వ్యవస్థ)- ఇండియా వాటా 23 లక్షలుగా లెక్కకట్టింది. భారత్‌లో నమోదైన 22కోట్ల మోటారు వాహనాల నుంచి రోజూ విడుదలవుతున్న వందలాది టన్నుల బొగ్గుపులుసు వాయువు, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, అంతకు మించి కర్బన ఉద్గారాలు గాలిని విషధూమంగా మార్చేస్తున్నాయి. బొగ్గు, చమురు, వాహన సంస్థలు కాలదోషం పట్టిన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న గ్రీన్‌పీస్‌ హెచ్చరిక నేపథ్యంలో- సత్వర దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి!

దేశీయంగా ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం వల్ల సంభవిస్తున్నదేనని భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌) నివేదిక ఏడాది క్రితం ధ్రువీకరించింది. ప్రధానంగా వాహన, పారిశ్రామిక కాలుష్యం మూలాన దేశంలో ఏటా మూడున్నర లక్షల వరకు శిశువుల్లో ఉబ్బసం (ఆస్త్మా) కేసులు వెలుగు చూస్తున్నాయని, పెద్దల్లో పక్షవాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు జోరెత్తుతున్నాయంటూ ‘గ్రీన్‌పీస్‌’ అధ్యయనం భిన్నకోణాన్ని ఆవిష్కరిస్తోంది. భూమ్మీద తిరుగాడుతున్నవారి ఆరోగ్యాన్నే కాదు- వివిధ దేశాల్లో ఏటా 30 లక్షల గర్భస్థ పిండాల్నీ వాయుకాలుష్యం కాటేస్తున్నదని ఆ మధ్య వెల్లడించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తనవంతుగా దిద్దుబాటను నిర్దేశించింది. 2040 సంవత్సరం నాటికి శుద్ధ ఇంధన పెట్టుబడులు ఇతోధికమైతే లక్షల సంఖ్యలో ప్రాణనష్టాన్ని నివారించగలమన్నది ఐఈఏ సిఫార్సు. 2022నాటికి శిలాజేతర ఇంధనం వాటాను 175 గిగావాట్లకు (ఒక గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్లు) పెంచుతామని ప్రతిన పూనిన భారత్‌ ఆ లక్ష్యాన్ని 450 గిగావాట్లుగా మార్చనున్నట్లు గత సెప్టెంబరునాటి ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ సత్సంకల్ప స్ఫూర్తి వాస్తవిక కార్యాచరణలో ప్రతిబింబించాల్సి ఉంది. నేటికీ గాలి నాణ్యతపరంగా 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగు వరసన ఉసూరుమంటోంది. దేశంలోని మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్‌ఛాంబర్లుగా పరువు మాస్తున్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 15కు నెలవైన దేశంలో దాదాపు 70కోట్ల మంది భారతీయులు విషపూరిత వాతావరణంలోనే మగ్గిపోతున్నారు. ఇప్పటికీ కాలుష్య నియంత్రణ మండళ్లను పునరుత్తేజపరచే జాతీయస్థాయి సమగ్ర కార్యాచరణకు ప్రభుత్వం పూనిక వహించకపోవడం విస్మయపరుస్తోంది.

‘మాటలు కాదు... ఇక చేతలే’నన్న ప్రధాని బాణీకి వత్తాసు పలుకుతూ, ఆయువు కబళిస్తున్న వాయువుపై సమరభేరి మోగించడానికి- అత్యవసర కార్యాచరణ ప్రణాళికల్ని ‘నీతి ఆయోగ్‌’ రూపొందించింది. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, కెనడా, సింగపూర్‌ తరహాలో కాలుష్య కారక వాహనాలపై భారీ జరిమానాల విధింపు; అగ్నికి ఆహుతి కాకుండా అటవీ ప్రాంతాల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ అవతరణ; నిర్మాణ రంగంలో కశ్మల కారకాల నియంత్రణ వంటివి దస్త్రాలకే పరిమితమయ్యాయి! విద్యుత్‌ వాహనాలకు పెద్ద ఊతం ఇవ్వగలదనుకున్న మొన్నటి కేంద్రబడ్జెట్‌ కీలకాంశాన్ని గాలికొదిలేసింది. రేపు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశంలో భారత్‌-6 ఉద్గార నిబంధనలు అమలుకానున్నాయి. అంతటితోనే సరిపుచ్చకుండా కేంద్రం ఇదమిత్థ వ్యూహంతో ముందడుగేయాలి! ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, ఎస్తోనియా ప్రభృత దేశాలు పౌరుల భాగస్వామ్యంతో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పి మన్ననలందుకుంటున్నాయి. కోపెన్‌హేగన్‌ వంటివి సైకిళ్ల విస్తృత వినియోగ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. బెర్లిన్‌, షాంఘై, లండన్‌, మాడ్రిడ్‌, ప్యారిస్‌, సియోల్‌ తదితరాలు అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థలు కలిగిన నగరాలుగా నిపుణుల ప్రశంసలు చూరగొంటున్నాయి. శిలాజ ఇంధన కాలుష్యంతో అసంఖ్యాక జీవితాలు పొగచూరిపోకుండా బాధిత దేశాలన్నీ సమర్థ ప్రజారవాణా వ్యవస్థను ప్రజానీకానికి సమకూర్చి- క్రమంగా డీజిల్‌ పెట్రోల్‌ వాహనాల సంఖ్యను తగ్గిస్తూపోవాలని ‘గ్రీన్‌పీస్‌’ నివేదిక పిలుపిస్తోంది. జనచేతన పెంపొందించి ఇటుక బట్టీల అదుపులో బంగ్లాదేశ్‌, నిష్కర్షగా వ్యవహరించి కశ్మల కారక పరిశ్రమలు, సంస్థలను దారికి తేవడంలో చైనా అనుభవాలు- కాలుష్య బాధిత దేశాలన్నింటికీ విలువైన గుణపాఠాలు కావాలి. పని ప్రదేశాలకు చేరువలో సకల వసతులతో జనావాసాలు, మరెక్కడికి వెళ్లాలన్నా సమర్థ ప్రజారవాణా వ్యవస్థ- నగరాల నిర్మాణం, విస్తరణల్లో అంతర్భాగమైనప్పుడే... భారత్‌కు కాలుష్య బలిపీఠమన్న అప్రతిష్ఠ రూపుమాసేది!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.