close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సామరస్యానికి శ్రీరామరక్ష!

అయోధ్యపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏదైనా దానికి త్రికరణశుద్ధిగా కట్టుబడతామంటూ ‘ఇది మా పవిత్ర హామీ... విశ్వసించండి’ అని భారత ప్రధానిగా వాజ్‌పేయీ లోక్‌సభలో ప్రకటన రూపేణా జాతికి వాగ్దానం చేసి రెండు దశాబ్దాలైంది. ఆ పవిత్ర హామీని మన్నిస్తూ, నిరుడు నవంబరు నాటి రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును ఔదలదాలుస్తూ- అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సుముహూర్త రోజు ఇది! సహస్రాబ్దాల మత విశ్వాసం, శతాబ్దాల క్రితం జరిగిందంటున్న విధ్వంసం, దశాబ్దాలుగా భూమిహక్కుల కోసం సాగిన న్యాయపోరాటం- వీటన్నింటి విరాట్‌ రూపమైన రామాలయ అంశం, దేశ రాజకీయ సామాజిక రంగాల్ని ఎంతగానో ప్రభావితం చేసిందన్నది నిర్ద్వంద్వం. చేదు గతాన్ని చరిత్ర గర్భంలో కలిపేసి, ‘సుప్రీం’లో సాగిన వ్యాజ్యంలో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ నేటి వేడుకకు ఆహ్వానితుడిగా హాజరు కానుండటం- మతపర సౌహార్దం గుండెల నిండుగా వెల్లివిరుస్తోందనడానికి తార్కాణం. వివాదాస్పద ఆస్తిపై గల హక్కును హిందు కక్షిదారులే సమధికంగా రుజువు చేసుకొన్నారని, ఆలయ నిర్మాణానికి అనువుగా మూడు నెలల్లో ట్రస్టును ఏర్పరచాలనీ ‘సుప్రీం’ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఇదివరకే 15మంది సభ్యులతో ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ను కొలువుతీర్చిన ప్రభుత్వం- అయోధ్య చట్టం కింద సమీకరించిన 67 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణం కోసం ఇటీవలే ట్రస్టుకు బదలాయించింది. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన ఆలయం అత్యద్భుత కళాకౌశలానికి, నాణ్యతా ప్రమాణాలకు నెలవుగా ఉంటుందని, ఒకేసారి పదివేల మంది భక్తులు సందర్శించుకొనేలా డిజైన్‌ చేశారనీ అంటున్నారు. రిక్టర్‌ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకొని వెయ్యేళ్లు నిలబడగల విధంగా రూపొందనున్న రామమందిరం- ప్రపంచ పర్యాటక కేంద్రంగా అయోధ్యను తీర్చిదిద్దగలదంటున్నారు. మతసహిష్ణుతే మంత్రంగా సాగనున్న మహాక్రతువు- జాతి ప్రగతిపథంలో ముందడుగు!

సమస్యను రాజకీయాల నుంచి విముక్తం చేసినప్పుడు, అసలు దాన్ని రాజకీయ దృక్కోణం నుంచి చూడనప్పుడు మాత్రమే దానికో పరిష్కారం లభించగలదన్న వాజ్‌పేయీ మాటల్లోని రాజనీతిజ్ఞత- అయోధ్య భూవివాద కేసులు ఫైసలా అయిన తీరులో ప్రస్ఫుటమవుతుంది. అయోధ్యను రాజకీయ వివాదాలు కమ్మేసినప్పుడల్లా వైషమ్యాల కార్చిచ్చు ఎగసిపడటం తెలిసిందే. బాబ్రీ కట్టడం కూల్చివేత తరవాత తన చేతికి మట్టి అంటకుండా రాష్ట్రపతి నివేదన ద్వారా అయోధ్య సంకట పరిష్కారానికి ప్రధానిగా పీవీ చేసిన ప్రయత్నాన్ని నిష్కర్షగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ‘నిగ్రహభావం వెల్లివిరిసి మతపరమైన సహోదరత్వం అయోధ్య వివాదాన్ని కోర్టులకన్నా ఎంతో ముందుగా పరిష్కరిస్తుందన్నది మా ఆశ’ అని 1994 అక్టోబరులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి నివేదనను కాదన్నా, కక్షిదారుల వేదనగా తన తలుపు తట్టిన వ్యాజ్యాలపై నిరుడు 40 రోజులు ఏకబిగిన విచారణ, మధ్యవర్తిత్వ యత్నాలతో సుప్రీం వెలువరించిన తీర్పు- చారిత్రక గాయానికి సరైన మందులా పనిచేసింది. అయోధ్యలో కీలక స్థిరాస్తికి సంబంధించిన వ్యాజ్య విచారణలో- విశ్వాసం నమ్మకాల ప్రాతిపదికన కాకుండా సాక్ష్యాల ఆధారంగానే తుదితీర్పు లిఖించామన్న రాజ్యాంగ ధర్మాసనం మాటలకు రెండు మతవర్గాల కక్షిదారులే కాదు, సంయమన శీలం చాటుకొంటూ కోట్లాది ప్రజలూ ఒద్దికగా తలొగ్గడం అక్షరాలా అనుపమానం. చట్టాన్ని అతిక్రమించి కట్టడాన్ని కూలగొట్టడం ద్వారా ముస్లిముల హక్కులకు భంగం వాటిల్లజేసిన అంశాన్ని విస్మరిస్తే న్యాయంచేసినట్లు కాదంటూ- తన విశేషాధికారాలతో ధర్మాసనం కొత్త మసీదు నిర్మాణానికీ బాటలు పరవడం విశేషం. భిన్న మతావలంబకుల కదంబమైన భారతావనికి- ఎన్నడూ చెదరని సోదరభావమే రక్షాకవచం!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.