close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్వావలంబనతోనే దేశానికి రక్షణ

ఇండియాకు కావాల్సిన ఆయుధాలు సైనిక సామగ్రిని తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి సమకూర్చుకొన్నా, మునుముందు సొంతంగానే రూపొందించుకోవాలని తొలి ప్రధాని పండిత నెహ్రూ దిశానిర్దేశం చేశారు. తాత్కాలికమంటే అర్థంకాని, దిగుమతులే దిక్కు అయితే వాటిల్లే అనర్థంగాని, సొంతంగా రూపొందించుకోవాలనడంలోని పరమార్థంగాని తెలియని పాలకుల హ్రస్వదృష్టి కారణంగా కీలక రక్షణ రంగంలో పరాధీనత దశాబ్దాలుగా కొనసాగుతోంది. గత రెండు దశాబ్దాల్లో దేశీయంగా రక్షణ ఉపకరణాల ఉత్పత్తి, స్వావలంబన సహా దేశ రక్షణ రంగంపై ఎనిమిది కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌లు నివేదికలు అందించినా దీటైన కార్యాచరణే కొరవడి ఎక్కడి గొంగడి అక్కడే ఉంది! ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారతావని) పేరిట కేంద్ర విత్తమంత్రి వెలువరించిన వ్యూహపత్రం- రక్షణ రంగంలోనూ ఇండియా స్వశక్తిని కూడగట్టుకొనే విధాన ప్రకటనలకు చోటుపెట్టింది. దాని వెన్నంటి వెలువడిన రక్షణ ఉత్పతులు ఎగుమతుల అభివృద్ధి విధాన ముసాయిదా- 2025నాటికి దేశీయంగా రూ.లక్షా 75 వేలకోట్ల టర్నోవరు, రూ.35వేలకోట్ల ఎగుమతుల్ని లక్షించింది. దేశీయంగా నేడు రక్షణ ఉత్పత్తుల టర్నోవర్‌ రూ.80 వేలకోట్లు; అందులో ప్రభుత్వరంగ సంస్థలు, ఆయుధ కర్మాగారాల వాటా రూ.63వేలకోట్లు! 2001 నుంచి ప్రైవేటు సంస్థలకు లైసెన్సులు ఇచ్చి రక్షణ ఉత్పత్తులకు ఊతమిస్తున్నామంటున్నా- వాటి టర్నోవర్‌ రూ.17 వేలకోట్లకే పరిమితమైన తీరు కేంద్ర ప్రభుత్వ విధానపర వైఫల్యాలకు నిలువుటద్దం. ఆ దురవస్థను చెదరగొట్టి దేశీయ రక్షణ పరిశ్రమలకు కొత్త ఊపిరులూదేలా ఈ ఏడాదే రూ.52 వేలకోట్ల మొత్తాన్ని స్వదేశీ కొనుగోళ్లకు మళ్లిస్తున్నట్లు రక్షణమంత్రి ప్రకటించారు. 101 రక్షణ ఉత్పాదనల దిగుమతులపై నిషేధం విధించి, వచ్చే ఆరేడు సంవత్సరాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్డర్లను దేశీయ పరిశ్రమలకే ఇవ్వనున్నారు. ఆత్మనిర్భర్‌ లక్ష్యసాధనకు ఆ తరహా ప్రోత్సాహమే కావాలిప్పుడు!

సైనిక బలగంరీత్యా ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న ఇండియా, రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగానూ రికార్డులకెక్కింది. రక్షణ విడిభాగాల కోసం దశాబ్దాల తరబడి రష్యామీద ఆధారపడిన దుస్థితి ఆయా సందర్భాల్లో ఇండియాను ఎంతగానో దురవస్థల పాలుచేసింది. కొత్త సహస్రాబ్ది సమరవ్యూహాల్లో పదాతిదళానికి ప్రాముఖ్యం కోసుకుపోయి, వాయు నౌకాదళాలతోపాటు అంతరిక్షం సైబర్‌ రంగాల్లోనూ రక్షణ పాటవం పెంచుకొంటేనే ఏ దేశానికైనా మనుగడ అనేలా శాస్త్రపరిశోధనలు కొత్తపుంతలు తొక్కుతున్నవేళ ఇది. ఎప్పటిమాదిరిగానే ప్రైవేటు రంగాన్ని పస్తులుపెట్టి తొమ్మిది ప్రభుత్వరంగ సంస్థలు, 41 ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలపై ఆధారపడితే రక్షణ రంగ స్వావలంబన మరీచికగా మిగులుతుంది. విభిన్న రక్షణ ఉత్పాదనల కొనుగోలుకు లక్షా 30 వేలకోట్లు వెచ్చిస్తున్న ఇండియా అందులో రూ.77 వేలకోట్లను ప్రభుత్వ రంగానికి మళ్ళిస్తుంటే, మూడున్నర వేల సూక్ష్మ చిన్నస్థాయి పరిశ్రమల దన్నుగల ప్రైవేటు రంగానికి దక్కుతున్నది రూ.14 వేలకోట్లే! రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 74శాతానికి పెంచిన కేంద్రం- స్వావలంబన లక్ష్యాల్ని సాధించగలిగేది- ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటున్న ప్రైవేటు రంగానికి చేయూత అందించినప్పుడే! ప్రపంచంలోనే పేరెన్నికగన్న తొలి వంద రక్షణ రంగ పరిశ్రమల జాబితాలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ 35వ స్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, పరిశోధనల ద్వారా శత్రుదుర్భేద్య ఆయుధాలకు సానపట్టుకొంటూ భారతీయ రక్షణ రంగమూ దీటుగా పురోగమించేలా కేంద్రం సకల జాగ్రత్తలూ తీసుకోవాలి. ‘భారత్‌లో తయారీ’ని సరళతరం చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సాంకేతికత దేశీయ పరిశ్రమలకు ఊతమయ్యేలా శ్రద్ధవహిస్తేనే- రక్షణ రంగంలో స్వావలంబన సాకారమవుతుంది.

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.