close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చురుగ్గా... అందరికీ టీకా!

కరోనా వైరస్‌ మలి దశ విజృంభణతో కొవిడ్‌ కొత్త కేసులు ఒక్క రోజులోనే లక్షాపాతిక వేలకు మించిపోయిన తరుణంలో, పటుతర నియంత్రణ వ్యూహానికి కేంద్రం ఓటేస్తోంది. విస్తృత పరీక్షలు, వైరస్‌ వ్యాప్తి ఆనుపానుల కూపీ, తగిన చికిత్స, తు.చ. తప్పకుండా కొవిడ్‌ విధివిధానాల పాటింపు, విరివిగా వ్యాక్సినేషన్‌ ద్వారా మహమ్మారిని అదుపు చేయగలమన్న విశ్వాసం ప్రధాని మోదీ మాటల్లో ప్రస్ఫుటమవుతోంది. విస్తరణ వ్యూహంలో భాగంగా ఏప్రిల్‌ 11-14 మధ్య ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహణకు, 11వ తేదీనుంచి వందమందికి పైబడి సిబ్బంది కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కేంద్రం అనుమతించడం స్వాగతించదగింది. క్రమంగా వేగం పుంజుకొంటూ రోజూ సుమారు 40 లక్షల మోతాదుల దాకా టీకాలు వేసే స్థాయికి యంత్రాంగం చేరిన దరిమిలా, తాజా భూరి విస్తరణ యోచనను సమర్థంగా పట్టాలకు ఎక్కించడం గడ్డుసవాలే. నేరుగా కార్యాలయాలకు వెళ్ళి అక్కడే టీకాలు వేసేందుకు అవసరమైన మానవ వనరులతోపాటు, అదనంగా వ్యాక్సిన్‌ మోతాదులూ అందుబాటులో ఉండాలి. ఇప్పటికే టీకాల కొరత అంశంపై రాజకీయ కాక రేగుతోంది. కేసుల కట్టడిలో స్వీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొరత నెలకొందంటూ అంశాన్ని రాజకీయం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తగినన్ని టీకా మోతాదులు సరఫరా కావడం లేదని గళమెత్తింది మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు ఒక్కటే కాదు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ ప్రభృత రాష్ట్రాలూ కొన్నాళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌ ఉత్పాదక సంస్థల గరిష్ఠ సామర్థ్యం ఎంతో, ఉత్పత్తి జరుగుతున్నదెంతో, ఏ మేరకు పంపిణీ అవుతోందోనన్న యథార్థాలకు ఎవరూ మసిపూసి మారేడు చేయలేరు. జాతి యావత్తు ఏకోన్ముఖ కృషితో కొవిడ్‌ కట్టడికి నిబద్ధం కావాల్సిన వేళ, ఈ తరహా రాజకీయ కోలాటాల్ని ఆలోచనాపరులెవరూ హర్షించరు!
కొవిడ్‌ వ్యతిరేక పోరులో తొలి శ్రేణి యోధులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యల కారణంగా వైరస్‌నుంచి అధిక ముప్పు పొంచి ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ మొదట 30 కోట్లమందికి టీకాలు వేసే బృహత్‌ కార్యక్రమం దేశంలో జనవరి 16న ఆరంభమైంది. ఇప్పటికీ అందులో మూడోవంతుకైనా వ్యాక్సినేషన్‌ పూర్తికాని దశలో టీకాల కొరత సమస్య తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఆగస్ట్‌నాటికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 47 కోట్లు, భారత్‌ బయోటెక్‌ 12 కోట్ల మోతాదుల వ్యాక్సిన్లు సిద్ధం చేయగలవన్నది- పక్షం రోజుల క్రితం నీతి ఆయోగ్‌ సభ్యులు ఆచార్య వీకే పౌల్‌ వేసిన అంచనా. వాస్తవంలో టీకా తయారీకి ముడి పదార్థాల కొరత నెలకొందని, అమెరికా రక్షణ చట్టంవల్ల దిగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీరమ్‌ సంస్థ కేంద్రానికి నెల్లాళ్ల క్రితమే విన్నవించింది. టీకాల ఉత్పత్తిని పెంపొందించేందుకు అత్యవసర ప్రాతిపదికన ఆర్థిక తోడ్పాటు సమకూర్చాల్సిందిగా సీరమ్‌, బయోటెక్‌ సంస్థలు రెండూ ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. రెండు వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారు కావడం ప్రతి పౌరుడికీ గర్వకారణమని గత జనవరిలో ప్రస్తుతించిన ప్రధాని మోదీ- వాటికి ముడి పదార్థాల కొరత లేకుండా కాచుకోవడంతోపాటు తక్షణ ఆర్థిక సాయంపైనా ఉదారంగా స్పందించాలి. ఏప్రిల్‌ 19వ తేదీనుంచి అమెరికాలో పద్దెనిమిదేళ్ల వయసుకు పైబడిన అందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తేనున్నట్లు అధ్యక్షులు జో బైడెన్‌ ప్రకటించారు. దేశీయంగా వయోజనులందరికీ టీకాలు వేయడానికి అనుమతించాలని భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య ‘ఫిక్కీ’ ఇటీవలే సూచించింది. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను చురుగ్గా పట్టాలకు ఎక్కించాల్సిన దశలో టీకాల విస్తృత ఉత్పత్తి, సత్వర వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకం. అందులో అర్థవంతమైన సమన్వయంతో ప్రభుత్వాలు నెగ్గితేనే- కొవిడ్‌పై జాతికి ఘనవిజయం!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు