ఆపన్నులపై కొవిడ్‌పన్ను
close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆపన్నులపై కొవిడ్‌పన్ను

ప్రభుత్వ విధానాలకు జనశ్రేయమే కేంద్రబిందువు కావాలన్నది ప్రధాని మోదీ నిర్దేశించుకొన్న పది సుపరిపాలన సూత్రాల్లో కీలకమైనది. శతాబ్ది సంక్షోభంగా పరిణమించి జాతి జవజీవాలను కృశింపజేస్తున్న కొవిడ్‌ కల్లోలంలో ఈ ఆదర్శమే కొడిగట్టిపోతోంది! కరోనాపై పోరులో కీలకమైన ఔషధాలమీద సుంకాల తొలగింపు జనహితానికి తోడ్పడదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు విస్మయపరుస్తున్నాయి. కొవిడ్‌ టీకాలు, ప్రాణాధార ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయించాలంటూ పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల ప్రధానిని అభ్యర్థించారు. ఆమెకు ఆగమేఘాలపై జవాబిస్తూ, పన్నులను మినహాయిస్తే ధరలు పెరుగుతాయే తప్ప తరగవని నిర్మల సెలవిచ్చారు! వాటిని జీఎస్టీ పరిధిలోంచి తప్పిస్తే ముడిపదార్థాల సమీకరణపై చెల్లించిన సుంకాలను రాబట్టుకోలేక, తయారీదారులు ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచే పిండుకోవడానికి ప్రయత్నిస్తారని, దానితో ప్రజలపై భారం ఇంతలంతలవుతుందని మంత్రి సూత్రీకరించారు. కరోనా కరాళనృత్యంతో కుటుంబాలకు కుటుంబాలే కకావికలమవుతున్న వేళ గండాన్ని గట్టెక్కించే వ్యాక్సిన్లు, మందులు తదితరాలపై పన్నుల రూపేణా ఆదాయాన్ని ఆశించడం సబబు కాదని పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ తదితర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా మొత్తుకుంటున్నాయి. జీఎస్టీ మండలిని సత్వరం కొలువుతీర్చి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సర్కారు చెవినిల్లు కట్టుకొని పోరుతున్నాయి. జీఎస్టీ మండలి సిఫార్సుల మేరకు ప్రజాప్రయోజనాల దృష్ట్యా వేటికైనా పన్ను మినహాయింపులు ఇవ్వగల వీలుందని వస్తుసేవల చట్టంలోని సెక్షన్‌ 11(1) విశదీకరిస్తోంది. మాయదారి మహమ్మారి కరకుదెబ్బలకు ఆసేతుహిమాచలం కంపించిపోతున్నప్పుడు ప్రజలకు కాస్త ఊరట కలిగించే ఈ నిబంధనను కేంద్రం విస్మరించడమేమిటి? తయారీదారులకు నష్టం కలిగించకుండానే సామాన్యులకు సాంత్వన చేకూర్చడానికి మార్గాలున్నా, వాటిని గుర్తించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం నివ్వెరపరుస్తోంది!
ప్రస్తుతం కొవిడ్‌ టీకాలపై అయిదు శాతం, ఔషధాలూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12శాతం జీఎస్టీని ప్రభుత్వం వడ్డిస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్లకు సంబంధించి తయారీదారుల హక్కును నిరాకరించకుండానే అంతిమ ఉత్పత్తులపై వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వవచ్చన్నది పన్ను నిపుణుల మేలిమి సూచన! జీఎస్టీ మండలి ఆమోదంతో ఓ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వం దీన్ని వెంటనే అమలులోకి తీసుకురాగల వీలుంది. తయారీదారులకు రావాల్సిన సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించేలా ప్రత్యేక పథకాన్నీ ప్రవేశపెట్టవచ్చు. పరిమిత కాలానికి వర్తించేలా ఈ రెండు పద్ధతుల్లో దేన్ని ఎంచుకున్నా తయారీదారులకు, సామాన్యులకు ఉభయతారకమవుతుంది. టీకాలు, ఔషధాల ముడిపదార్థాలపైనా సుంకాలను ఎత్తివేస్తే ఇన్‌పుట్‌ క్రెడిట్ల సమస్యే తలెత్తదన్న సలహానూ సర్కారు పెడచెవిన పెడుతోంది. ఆపత్కాలంలో ప్రజలను పన్నుపోట్లకు గురిచేసి కేంద్ర ఖజానాను నింపే ఉద్దేశమేదీ లేదని, జీఎస్టీ వసూళ్లలో 70శాతం రాష్ట్రాలకే వెళ్తాయని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. మొన్న ఫిబ్రవరి మొదటి వారం నాటికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా బకాయిలను బిగపట్టిన కేంద్రం ఇప్పుడు సుంకాలతో తాను బావుకొనేదేమీ లేదనడమే విడ్డూరం! కొవిడ్‌ కోరల్లో చిక్కిన ఆత్మీయులను రక్షించుకోవడానికి బాధిత కుటుంబాలు తల తాకట్టు పెట్టాల్సి వస్తోంది. జీఎస్టీ మండలి సమావేశాన్ని తక్షణం నిర్వహించి ప్రజాశ్రేయమే పరమావధిగా ‘కొవిడ్‌ పన్నుల’పై పునస్సమీక్షకు కేంద్రం ముందుకొస్తేనే ఈ విపత్కర పరిస్థితుల్లో సామాన్యులకు కాస్తయినా ఉపశమనం లభిస్తుంది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు