పౌరస్వేచ్ఛకు కొత్త ఊపిరి!
close

సంపాదకీయం

పౌరస్వేచ్ఛకు కొత్త ఊపిరి!

‘ఉగ్రవాదులంతా నేరగాళ్లే... కానీ, నేరగాళ్లందరూ ఉగ్రవాదులు కారు’ అని సుప్రీంకోర్టు 27 ఏళ్లనాడు స్పష్టీకరించింది. కేవలం శాంతిభద్రతలకు, ప్రజాజీవనానికి భంగం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించరాదన్న నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఆనంద్‌ తీర్పు- జనాగ్రహ నిరసనకు ఉగ్రవాద కుట్రకు మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసింది. అయినా ప్రయోజనం ఏముంది? ఏలినవారికి ఎదురాడటమే మహాపరాధమంటూ పాశవిక చట్టాల ప్రయోగంతో పౌరహక్కుల్ని రక్షక భటులే భక్షిస్తున్న అప్రజాస్వామిక ధోరణి గుర్రపు డెక్కలా విస్తరిస్తోంది. నిరుడు ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల ప్రతికూల వర్గాల నడుమ చెలరేగిన ఘర్షణలు ఈశాన్య దిల్లీలో 53 మందిని బలిగొని, 500 మందిని క్షతగాత్రుల్ని చేశాయి. ఆ దారుణానికి కారణమంటూ కొందరు యూనివర్సిటీ విద్యార్థుల మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ- ఉపా) కింద తీవ్రాభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన ముగ్గురు నిందితులకూ బెయిల్‌ మంజూరు చేస్తూ దిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్‌- మూడు వేర్వేరు తీర్పుల్లో చేసిన వ్యాఖ్యలు పోలీసులకు గుణపాఠాలు నేర్పుతున్నాయి. ‘ఉపా’లో ఉగ్రవాద చర్యకు ఇచ్చిన నిర్వచనం విస్తారంగా కొంత సందిగ్ధంగానే ఉందంటూ, సాధారణ కేసుల పరిధిలోకి వచ్చే దుశ్చర్యలకు ఆషామాషీగా టెర్రరిస్టు ముద్ర వేయరాదని ఉన్నత న్యాయపాలిక హితవు పలికింది. ప్రభుత్వ విధానాల పట్ల నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కు. నిరసనల్ని అణచివేయాలన్న ఆదుర్దా, పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్న ఆందోళనతో ప్రభుత్వం- పౌరహక్కుకు ఉగ్రవాద చర్యకు మధ్యగల రేఖను చెరిపేసిందన్న హైకోర్టు, అదే ఒరవడి కొనసాగితే ప్రజాస్వామ్యం పతనమవుతుందని నిష్ఠుర సత్యం పలికింది. ఈ తరహా తీర్పులే దేశంలో పౌరస్వేచ్ఛకు కొత్త ఊపిరి!
దేశీయంగా సెలవేస్తున్న ఉగ్రవాదం చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాలకు ఏమాత్రం తీసిపోనిదంటూ ఎనభయ్యో దశకంలో రాజీవ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘టాడా’ చట్టం తెచ్చింది. 1995లో అది రద్దు అయ్యాక, అవే లక్ష్యాలు నిబంధనలతో పురుడు పోసుకొన్న పోటాకు సైతం కాలగతిలో అదే గతి పట్టింది. మరో కొత్త చట్టం ప్రసక్తి లేకుండా 1967 నాటి ‘ఉపా’లోనే ఉగ్రవాద చట్టానికి చోటు పెట్టేసిన కేంద్రం 2008లో దానికి సవరణలూ చేసింది. ‘దేశ రక్షణ’పై తీవ్ర ప్రభావం కనబరిచే ఉగ్రనేరాల కోసమే ఆ చట్టాన్ని లక్షించారన్న హైకోర్టు- తీవ్రమైన శిక్షల్ని విధించగల ఆ చట్టాల్ని అక్రమంగా ప్రజలపై ప్రయోగిస్తే జాతి భద్రతకు ఎదురయ్యే ముప్పును తప్పించాలన్న మౌలిక లక్ష్యమే కదలబారి పోతుందని హెచ్చరించింది. సాధారణ నేరాల్లోనూ అత్యంత హేయమైన వాటికీ, ఉగ్రవాద దుశ్చర్యలకూ గల వ్యత్యాసాన్ని గుర్తించకుండా యథాలాపంగా కేసులు బనాయించడం పౌరస్వేచ్ఛకు ప్రమాదకరమన్నది హైకోర్టు వ్యాఖ్యల సారాంశం. ఉగ్రవాద చట్టమే కాదు, కాలంచెల్లిన రాజద్రోహ శాసనమూ ఎంతగానో దుర్వినియోగమవుతోందన్నది ముంజేతి కంకణం! ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై జి-7 వేదికగా ప్రధాని మోదీ చెప్పిన మాటలకు, దేశీయంగా పరిస్థితులకు పొంతన లేదని ఎడిటర్స్‌ గిల్డ్‌ వాపోయింది. నిరసనల్నే కాదు, మూకదాడుల్ని నిలువరించాలంటూ 49 మంది లబ్ధప్రతిష్ఠులు ప్రధానికి చేసిన అభ్యర్థననూ రాజద్రోహంగా పరిగణించిన వైపరీత్యం గుండెల్ని మెలిపెడుతోంది. కాబట్టే ప్రజాస్వామ్య సూచీలో ఇండియా 53వ స్థానానికి దిగజారింది. భారత శిక్షాస్మృతితో పోలిస్తే, ‘ఉపా’లో కఠినతర బెయిలు నిబంధనలు, నేరాభియోగాల దాఖలు వెసులుబాట్లు అధికార దండధరులకు మరింతగా అక్కరకొస్తున్నాయి. పౌరహక్కుల్ని తెగటార్చే పోకడలు పెచ్చరిల్లుతున్న వేళ- కోర్టు తీర్పులే కారుచీకట్లో కాంతిరేఖలవుతున్నాయి!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న