భావిభారతానికి బంగరుబాట

సంపాదకీయం

భావిభారతానికి బంగరుబాట

జాతి అస్తిత్వానికి ఆయువుపట్టు అమ్మభాషేనని యునెస్కో ఏనాడో విశదీకరించింది. జ్ఞానార్జన, సృజనాత్మక వ్యక్తీకరణ, నూతన ఆవిష్కరణలకు అదే మూలాధారమని స్పష్టీకరించింది. మాతృభాషల్లో విద్యాబోధన ద్వారా భావితరం సర్వతోముఖాభివృద్ధికి బంగరు బాటలు నిర్మించవచ్చని సూచించింది. ఈ మేలిమి మాటలకు మన్నన దక్కని భారతావనిలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని చోట్లా ఆంగ్లమే రాజ్యమేలుతోంది! బోధనా మాధ్యమాలుగా భారతీయ భాషలను నిలబెట్టాలని సంకల్పించిన నూతన జాతీయ విద్యావిధానం- ఉన్నత, సాంకేతిక విద్య సైతం స్థానిక భాషల్లో అందుబాటులోకి రావాలని ఆశిస్తోంది. అందుకనుగుణంగా తేనెపలుకుల తెలుగుతో సహా 11 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల నిర్వహణకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఈసీటీఈ) అనుమతులిచ్చింది. ‘సరైన దిశలో ఒక ముందడుగు’గా దీన్ని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు- సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగాన్ని విస్తృతపరచాలని పిలుపిచ్చారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 కళాశాలలు తెలుగు, తమిళం, బంగ్లా, మరాఠీ, హిందీ భాషల్లో ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు సమాయత్తమైనట్లు ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రకటించారు. స్థానిక భాషల్లో సాంకేతిక కోర్సుల నిర్వహణకు అక్కరకొచ్చేలా ఒక సమాచార నిధిని ఏఈసీటీఈ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. అమ్మభాషలో విద్యాభ్యాసం విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది. చిరపరిచిత వాతావరణంలో సహజ మేధకు సానపట్టి నైపుణ్యవంతుడిగా తీర్చిదిద్దుతుంది. ఐరోపా దేశాలతో పాటు చైనా, జపాన్‌ వంటివి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధనా మాధ్యమాలుగా అమ్మభాషలనే అందలమెక్కిస్తున్నాయి. ఆ మేరకు అభివృద్ధి ఫలాలనూ అందిపుచ్చుకొంటున్నాయి. ఉన్నత, సాంకేతిక విద్యావ్యాప్తి విస్తృతమై, వైజ్ఞానిక రంగంలో మనదైన ముద్ర ప్రస్ఫుటం కావాలంటే - భారతీయ భాషల్లో విద్యాబోధన ఊపందుకోవాల్సిందే!

నవతరంలో ‘సైన్స్‌ సృజనాత్మకత’ ద్విగుణీకృతం కావాలంటే అమ్మభాషలో చదువుతోనే సాధ్యమని ‘భారతరత్న’ అబ్దుల్‌ కలాం ఎప్పుడూ చెబుతుండేవారు. ‘ఆంగ్ల మాతృభాషీయులు మినహా మిగిలిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలందరూ విజ్ఞానశాస్త్రం గురించి వాళ్ల మాతృభాషల్లోనే మాట్లాడతారు. రాస్తారు. అధ్యయనాలు కొనసాగిస్తారు. వైజ్ఞానిక, సాంకేతిక చదువులకు ఆంగ్లమే శరణ్యమనుకొనే అభిప్రాయాన్ని చెరిపేసుకోవాలి’ అని విఖ్యాత శాస్త్రవేత్త, ‘మూన్‌మాన్‌’ మేల్‌స్వామి అన్నాదురై అనుభవపూర్వకంగా వెల్లడించారు. పరిశోధనా రంగంలో ఉద్ధండులైన ఈ ఉభయుల స్వరాష్ట్రమైన తమిళనాడులో పదేళ్ల క్రితమే అమ్మభాషలో ఇంజినీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. అభ్యసన సామగ్రిని విరివిగా అందుబాటులోకి తెస్తే స్థానిక భాషల్లో సాంకేతిక విద్యను అందించడం అసాధ్యమేమీ కాదు. కృత్రిమ మేధ సహాయంతో ఆంగ్ల పొత్తాలను క్షణాల్లో 12 భారతీయ భాషల్లోకి తీసుకొచ్చేలా ఏఈసీటీఈ అభివృద్ధి పరచిన అనువాద ఉపకరణం వంటివి ఈ లక్ష్యసాధనలో కీలకపాత్ర వహిస్తాయి. యంత్రానువాదంలో కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తూనే వృత్తివిద్యా పదకోశాల నిర్మాణాన్నీ ముమ్మరం చేస్తే మాతృభాషలన్నీ మేలిమి బోధనా మాధ్యమాలుగా భాసిస్తాయి. తమిళంలో ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు సంబంధించిన దశాబ్ది అనుభవాలు- అమ్మభాషల్లో సాంకేతిక పట్టాలు పుచ్చుకొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పెద్దపీట వేయడం అత్యవసరమని స్పష్పీకరిస్తున్నాయి. వైజ్ఞానిక రంగంలో  ఉన్నతికి ఆలంబనయ్యే స్వతంత్ర ఆలోచన అమ్మభాషతోనే వికసిస్తుంది. మాతృభాషలో పాఠ్యాంశాలను మధిస్తూనే కొలువుల సాధనలో కీలకమైన భావప్రకటనా నైపుణ్యాలనూ ఒడిసిపట్టేలా సమాంతర శిక్షణ సాగితే మన విద్యార్థుల ఎదుగుదలకు ఆకాశమే హద్దవుతుంది. ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించినట్లు పరిపాలన, న్యాయవ్యవస్థల్లోనూ అమ్మభాషలకు పట్టంకడితేనే సామాన్యులకు పౌరసేవలు సులభగ్రాహ్యాలవుతాయి. ప్రజాజీవితంలోని సమస్త రంగాల్లో మాతృభాషల వినియోగం- భారతీయ సంస్కృతితో భావితరానికి బొడ్డుపేగు అనుబంధాన్ని పట్టి నిలుపుతుంది. సామాజిక సమతులాభివృద్ధికి అదే చుక్కానీ అవుతుంది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న