కోహ్లి తరవాత?

సంపాదకీయం

కోహ్లి తరవాత?

నాధన్‌ క్రికెట్‌(టీ20) సారథ్య బాధ్యతల నుంచి త్వరలో వైదొలగుతానంటూ విరాట్‌ కోహ్లి చేసిన ప్రకటన ఎందరినో విస్మయపరచింది. ఇది- జగమెరిగిన బ్యాటింగ్‌ దిగ్గజం వీరాభిమానులు, విశ్లేషకులపై విసిరిన బౌన్సరేనన్న కథనాలు వెలుగు చూశాయి. అక్టోబర్‌ 17న మొదలై నవంబర్‌ 14వరకు యూఏఈ-ఒమన్‌ల ఉమ్మడి ఆతిథ్యంలో సాగే పొట్టి క్రికెట్‌ హోరాహోరీ ముగియడంతోనే అమలులోకి వస్తుందన్న నిర్ణయానికి కోహ్లి చెబుతున్న కారణం- మితిమీరిన పని ఒత్తిడి. కొన్నేళ్లుగా తీరిక లేకుండా టీ20లు, పరిమిత ఓవర్ల ఒకరోజు పోటీలు(ఒన్‌ డేలు), టెస్టులు ఆడుతూ అన్నింటా సారథ్యం వహిస్తున్న కీలక ఆటగాడి నోట ఈ మాట రావడం వెనక వేరే కారణాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. టీ20లకు కోహ్లి పదవీ వారసుడిగా రోహిత్‌ శర్మ పేరుపై ఊహాగానాలు ముమ్మరిస్తుండగానే బహిర్గతమైన మరో ఉదంతం- తెరవెనక ఏదో జరిగిందన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) పోటీల్లో ముంబై జట్టు అదృష్ట సారథిగా పేరొందిన రోహిత్‌ నాయకత్వ సామర్థ్యం ఎవరూ శంకించలేనిది. అటువంటిది, వయసులో తనకన్నా పెద్దవాడైన అతణ్ని వైస్‌ కెప్టెన్‌గా తప్పించాలన్న ప్రతిపాదనతో కోహ్లి ఇటీవల బీసీసీఐ(భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) తలుపు తట్టాడన్న వార్తా కథనాలు అదనపు మసాలా జోడిస్తున్నాయి. ఒన్‌ డేలకు కేఎల్‌ రాహుల్‌ను, టీ20లకు రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్లుగా ప్రకటించాలని కోహ్లి ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ధోనీని జట్టు పథ నిర్దేశకుడి(మెంటార్‌)గా ప్రకటించాక, రేపటి ప్రపంచ కప్‌ పోటీల్లో నెగ్గుకురాకపోతే ఎటూ నిష్క్రమణ తప్పదన్న భీతితో వైదొలగాలని నిర్ణయించుకోవడం కోహ్లి ఇష్టం. కొత్త సారథిని, వైస్‌ కెప్టెన్‌ను ఎంపిక చేయడమన్నది జట్టు యాజమాన్యం పరిధిలోనిది. ఇదమిత్థంగా ఇలాగే జరగాలని నిర్దేశించే హక్కు, అధికారం, అవకాశం- కోహ్లి చేతులనుంచి జారిపోయాయి!

ఒకరోజు పరిమిత ఓవర్ల పోటీల్లో 43, టెస్టుల్లో 27- వెరసి, డెబ్భై శతకాలను తన ఖాతాలో జమ చేసుకున్న విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ సామర్థ్యం ఎవరూ వంకపెట్టలేనిది. మైదానంలో పాదరసంలా కదులుతూ దూకుడు ఆటకు పర్యాయపదం అనిపించుకునే విరాట్‌ నేతృత్వంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీ20 సిరీస్‌ విజయాల్ని భారత జట్టు ఒడిసి పట్టింది. స్వీయ సారథ్యంలో ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోవడం, ఐపీఎల్‌ టోర్నమెంట్లలోనూ ధాటిగా రాణించలేకపోవడాన్ని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. సుమారు ఇరవై నెలలుగా పరుగుల వరద పారించడంలో వైఫల్యం సైతం తలపై కొంత బరువు తగ్గించుకోవడానికి విరాట్‌ను ప్రేరేపించి ఉండాలి. మార్పు టీ20 సారథ్యానికే పరిమితమవుతుందా అన్నదే ప్రశ్న. కోహ్లి ధోరణికి భిన్నంగా సహచరుల్ని ప్రోత్సహిస్తూ మెరుగైన ప్రదర్శనల్ని రాబట్టగలగడం రోహిత్‌ బలం. అందువల్ల, నవంబర్‌ రెండోవారం ముగిసేలోగా పొట్టి క్రికెట్‌ నూతన సారథిగా అతడి మెడలో వరమాల పడే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. అదే జరిగితే 2007లో టెస్టులకు అనిల్‌ కుంబ్లే, సంక్షిప్త పోటీలకు ఎంఎస్‌ ధోనీ సారథ్యం వహించిన విధంగా- భిన్న కెప్టెన్ల ప్రయోగం పట్టాలకు ఎక్కుతుంది! గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌ ప్రభృత దిగ్గజ ఆటగాళ్లు భావి అవసరాల్నీ దృష్టిలో ఉంచుకోవాలంటూ చేసిన సూచనలు విలువైనవి. మున్ముందు సారథ్య బాధ్యతల్ని నిభాయించేలా కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా ప్రభృతుల్ని సన్నద్ధపరచాలన్న సిఫార్సుల సహేతుకతను బీసీసీఐ పెద్దలు ఆకళించుకోవాలి. క్రికెట్‌ ఆడుతున్న పది అగ్రశ్రేణి దేశాల్లో ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లే ఏకైక కెప్టెన్‌ విధానం పాటిస్తున్నాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టుల్లో ఒకరిని, ఒన్‌డేలూ టీ20లకు మరొకర్ని సారథులుగా ఎంపిక చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ముగ్గురు కెప్టెన్లను బరిలోకి దించుతోంది. ఏ తరహా పోటీల్లోనైనా అత్యుత్తమ సారథ్యాన బలీయ జట్టు కూర్పే లక్ష్యంగా బీసీసీఐ వ్యూహాలూ ఇక పదును తేలాలి!

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న