close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఒక వజ్రం... ముగ్గురు ముఖ్యుల కథ!

ఇదొక వజ్రం కథ. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మన కోహినూర్‌ కంటే కూడా దాదాపు రెట్టింపు సైజున్న ఖరీదైన వజ్రం కథ.
ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మన దేశంలోనే ఉన్నా.. దాని కమామిషు ఏమిటో మనకు అంతగా తెలీని వజ్రం కథ!!!

ఈ వజ్రం.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన హైదరాబాదు నిజాంలకు చెందింది. కానీ అదెక్కడి నుంచి వచ్చింది? తర్వాత ఇది ఒక పాత బూటులో ఎలా దొరికింది? అనంతరం నిజాం బల్ల మీద పేపర్‌వెయిట్‌ అవతారం ఎందుకు ఎత్తింది? అసలు దీనికి ‘జాకబ్‌’ అనే పేరు ఎలా వచ్చింది? ఇదంతా తెలియాలంటే ఎంతో ఆసక్తికరమైన పెద్ద వ్యథలాంటి ఈ వజ్రం కథ వినాల్సిందే!

ఈ కథలో ప్రధానంగా మూడు చిత్రవిచిత్రమైన పాత్రలు! వీటిలో మొదటి పాత్ర 6వ నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌ది. రెండో పాత్ర ఆర్మీనియా నుంచి వచ్చి నిజాం ఆస్థానంలో ఎవరికీ లేనంతటి ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఆయన డ్రస్‌ డిజైనర్‌ అబిద్‌. మూడో పాత్ర.. పేరుమోసిన అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి అలెగ్జాండర్‌ జాకబ్‌. ఈ మూడు పాత్రల మధ్యా.. చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ 1890లలో ఆ వజ్రం సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు! తాజాగా దిల్లీలో నిర్వహించిన నిజాం నగల ప్రదర్శనలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, వజ్రాభరణాల పట్ల నిజాంలకు ఉన్న మక్కువకు చారిత్రక ఆధారంగా ధగధగలాడిన ఈ వజ్రం వ్యవహారమేంటో చూద్దాం...

మొదటి పాత్ర 
మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌..

సుసంపన్నమైన, శక్తిమంతమైన నిజాం పీఠాన్ని 1869లో చేపట్టిన    ఆరో నిజాం! ప్రజా సంక్షేమాన్ని ఒక బాధ్యతగా తీసుకున్న పాలకుడిగా ఈయనకు మంచి పేరుంది. రాత్రిపూట మారువేషాల్లో నగర సంచారం చేస్తూ.. ఆపన్నులకు గుప్తదానాలు కూడా చేసేవాడని ప్రతీతి. సహాయార్థం ఆయన దగ్గరకు వచ్చిన వాళ్లెవరూ రిక్తహస్తాలతో తిరిగి వెళ్లిన దాఖలాల్లేవు.  ప్రజలకు దానధర్మాలు చేయటమే కాదు.. ప్రపంచంలోని చిత్రవిచిత్రమైన, అత్యంత అరుదైన వస్తువులు, ఆభరణాలు, వజ్రాల వంటివి సేకరించటం కూడా మహబూబ్‌ అలీఖాన్‌కు పెద్ద అలవాటు.

రెండో పాత్ర 
ఆల్బర్ట్‌ అబిద్‌

మహబూబ్‌ అలీ ఖాన్‌కు కుడిభుజం లాంటివాడు ఆయన వ్యక్తిగత డిజైనర్‌, అమెరికా నుంచి వచ్చిన ఆర్మీనియా దేశస్తుడు ఆల్బర్ట్‌ అబిద్‌. ఈయన నిజాంకు ఎంత సన్నిహితుడంటే.. మహబూబ్‌ అలీ ఖాన్‌ కొలువుకు వెళ్లేందుకు తయారవుతున్న ప్రతిసారీ అక్కడ అబిద్‌ ఉండాల్సిందే. నిజాం తొడుక్కునే అంగీలు, షేర్వాణీల నుంచి బూట్లు, చేతివాచీలు, ఆభరణాల వరకూ.. ప్రతి వస్తువూ అబిద్‌ ఎంపిక చెయ్యాల్సిందే. ఆయన ఇక్కడితో ఆగలేదు.. కొత్తకొత్త  వస్తువుల పట్ల నిజాంకు ఉన్న ఆసక్తిని గమనించి.. నిజాం కోసం తనే దుస్తులు, ఆభరణాలు, రకరకాల ఫ్యాషన్‌ వస్తువులు తయారు చేయించేవాడు. కొన్నింటిని తానే తయారు చేసి నిజాంకు అమ్మేవాడు కూడా.

నిజాంకు ఓ చిత్రమైన అలవాటుంది. ఆయన ఒకసారి వేసుకున్న సూటు మళ్లీ వేసే వాడు కాదు. దీన్ని అదనుగా తీసుకుని అబిద్‌ తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిపేవాడు. ఒకసారి నిజాంకు అమ్మిన వాటినే కొన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్తవాటిలా అమ్మేసేవాడు. రోజూ కొత్త బట్టల మోజులో నిజాం ఆ విషయాన్ని గుర్తించేవాడు కూడా కాదు. ఇలా నిజాంను బురిడీ కొట్టిస్తూ అబిద్‌ భారీగా సంపాదించటమే కాదు, ఆ డబ్బుతో హైదరాబాద్‌లో ఆ రోజుల్లోనే ‘అబిద్స్‌ అండ్‌ కో’ పేరుతో అత్యంత విలాసవంతమైన దుకాణం ఒకటి తెరిచాడు. ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో అబిడ్స్‌గా ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతం.. ఇదిగో ఈ అబిద్స్‌ దుకాణం చుట్టుపక్కల ప్రాంతమే!

నిజాం దగ్గర మంచి చనువు, పలుకుబడి ఉండటంతో వ్యాపారులు, వాణిజ్యవేత్తలంతా కూడా ముందు అబిద్‌ను కలిసి.. కమీషన్లు గట్రా ఇచ్చి ప్రసన్నం చేసుకునేవాళ్లు. తర్వాత నిజాం దగ్గరకు వెళ్లి తాము తెచ్చిన వస్తువులు, ఆభరణాల వంటివన్నీ నిజాం ముందు పెట్టేవాళ్లు. నిజాం వాటిని చూసి.. నచ్చితే ‘పసంద్‌’ అనేవారు. నచ్చకపోతే ‘న పసంద్‌’ అనేవారు. ఒకసారి నిజాం ‘పసంద్‌’ అన్నారంటే.. ఇక ఆ వస్తువును ఎంతైనా సరే కొనాల్సిందే! ‘న పసంద్‌’ అంటే మాత్రం దాని ముఖం మళ్లీ చూడరు.

మూడో పాత్ర 
అలెగ్జాండర్‌ జాకబ్‌..

వజ్రాల వ్యాపారి జాకబ్‌.. మహా మాటకారి. దేశమంతా ఆ రోజుల్లోనే ఈయన గురించి కథలుకథలుగా చెప్పుకొనేవాళ్లు. కొందరు ఆయనను రష్యా గూఢచారి అనేవాళ్లు. మరికొందరు మాంత్రికుడనీ, ఆయనకు రహస్య శక్తులు కూడా ఉన్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఎక్కడో టర్కీ దగ్గరి టైగ్రిస్‌ నదీతీరంలో పుట్టి.. బొంబాయి మురికివాడల మీదుగా సిమ్లా ఎలా చేరాడన్నది పెద్ద మిస్టరీ. ఈయన గురించి తర్వాత కాలంలో పుస్తకాలు కూడా రాశారు. మొత్తానికి ఆభరణాలంటే నిజాంకు ఉన్న మోజు గురించి తెలుసుకున్న జాకబ్‌.. ఎలా చనువు సంపాదించాడోగానీ.. అబిద్‌ ద్వారా నిజాం ఆస్థానంలో అడుగుపెట్టాడు. మహబూబ్‌ ఆలీ ఖాన్‌కు భారీఎత్తున ఎన్నో ఆభరణాలు అమ్మాడు. చివరికి ఇలా చిన్నాచితకా కాదు.. నిజాంకు ఎలాగైనా ఓ భారీ వస్తువు అమ్మాలని పథకం వేశాడు. అబిద్‌ను వెంటబెట్టుకుని.. నిజాం దగ్గరకు వచ్చి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అద్భుతంగా సానబట్టిన వజ్రం ఒకటి అమ్మకానికి సిద్ధంగా ఉందని వైనవైనాలుగా చెప్పాడు. అప్పుడే ఆఫ్రికాలో తవ్వి తీసిన ఆ 184 క్యారట్ల వజ్రం రూ.1 కోటికి పైగా పలుకుతుందని ఊరించాడు. లండన్‌లో దాన్ని ఓ రూ.20 లక్షలకు కొని, నిజాంకు రూ.50 లక్షలకైనా అమ్మాలన్నది పథకం. ఈ లావాదేవీ అంతా సజావుగా జరిగేలా సహకరిస్తే రూ.5 లక్షల కమిషన్‌ కూడా ఇస్తానని అబిద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికి వజ్రం లండన్‌లో ఉంది. జాకబ్‌ రూ.1 కోటి చెబితే.. నిజాం దాన్ని గీసిగీసి రూ.46 లక్షలకు బేరమాడాడు. అప్పటికి ఆ వజ్రం లండన్‌లో ఉంది. అయితే వజ్రాన్ని తన కళ్లతో చూడందే నిజాం కొనరు. కాబట్టి ముందు దాన్ని లండన్‌ నుంచి తెప్పించాలి. తర్వాత కొనాలా? వద్దా? అన్నది నిర్ణయించుకునే అధికారం నిజాంకే ఉండేట్లు ఒప్పందం కుదిరింది. ముందు వజ్రాన్ని తెప్పించాలి కాబట్టి నిజాం సంస్థానం జాకబ్‌కు రూ.23 లక్షలు ఇచ్చింది. కథ ఇంత వరకూ బాగానే నడిచిందిగానీ ఇలా నిజాం భారీ ఎత్తున ఖర్చుపెట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాన్ని కొనబోతున్నారన్న వార్త బ్రిటీషు ప్రభుత్వం చెవినబడింది. నిజాంకు అదెక్కడో ఇబ్బందిగా అనిపించింది.

ఇక జాకబ్‌... 1891లో ఆ వజ్రాన్ని తీసుకుని..

నిజాం ఆస్థానానికి వచ్చాడు. దాన్ని మహబూబ్‌ అలీ ఖాన్‌ ముందుంచారు. ఈ బేరం కుదిరితే జాకబ్‌ జీవితం మారిపోవటం ఖాయం. నిజాం దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అటూఇటూ తిప్పి రకరకాలుగా చూశాడు. వాతావరణం ఉత్కంఠభరితంగా తయారైంది. నిజాంకు నచ్చుతుందా? లేదా? అని జాకబ్‌కు చెమటలు పడుతున్నాయి. చాలాసేపు తిప్పితిప్పి చూసిన తర్వాత నిజాం చిటుక్కున ‘న పసంద్‌’ అనేశాడు! అంతే!! జాకబ్‌కు లోకం ఒక్కసారిగా తల్లకిందులైనట్లయింది. తన జీవితం మారిపోతుందనుకుంటే పెద్ద వివాదం మెడకు చుట్టుకుంది. బ్రిటీషు వారికి తెలియకుండా వజ్రాన్ని కొనాలన్న ఉద్దేశంతోనే నిజాం ‘న పసంద్‌’ అన్నారుగానీ వాస్తవానికి ఆ వజ్రం కొనటం ఆయనకు ఇష్టమేనని అబిద్‌ చెప్పాడంటారు. వాస్తవమేమిటో, వాళ్ల మధ్య ఏం జరిగిందో బయటకు తెలియదుగానీ నిజాం తన డబ్బులు తనకు ఇచ్చేయమని జాకబ్‌ మీద ఒత్తిడి పెట్టాడు. కానీ ఒప్పందం కుదిరింది కాబట్టి డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదని జాకబ్‌ భీష్మించుకున్నాడు. దీంతో జాకబ్‌ తనను మోసం చేశాడంటూ నిజాం ధ్వజమెత్తాడు. వ్యవహారం మొత్తం కలకత్తా హైకోర్టుకు చేరింది. జాకబ్‌ ఆ రోజుల్లోనే మంచి ఖరీదైన లాయర్లను పెట్టుకుని, నిజాంకు కోర్టులో చుక్కలు చూపించాడు. సుదీర్ఘంగా సాగిన ఈ న్యాయ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజాం వాదనను నమోదు చేసేందుకు హైదరాబాద్‌కు ప్రత్యేక కమిషన్‌ కూడా వచ్చి వెళ్లింది. బ్రిటీషు కోర్టు ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావటాన్ని నిజాం చిన్నతనంగా భావించాడు గానీ.. తప్పలేదు! అప్పటికే ‘జాకబ్‌ డైమండ్‌’గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వజ్రాన్ని జనమంతా దుశ్శకునంగా భావించటం మొదలుపెట్టారు. చివరికి కలకత్తా హైకోర్టు వజ్రాన్ని నిజాంకే ఇచ్చింది, జాకబ్‌ను మోసం ఆరోపణల నుంచి విముక్తి చేసింది. కానీ అతనికి దక్కాల్సిన మిగతా డబ్బు మాత్రం దక్కలేదు. కేసు ముగిసి వజ్రం తనకు దక్కినా.. ఈ వ్యవహారం తనకు తలవంపులు తెచ్చిందని భావించిన నిజాం.. ఆ వజ్రం ముఖం కూడా చూడాలని అనుకోలేదు. దాన్నో పాతగుడ్డలో చుట్టి, పాత బూటులో పెట్టి.. ఒక టేబుల్‌ డ్రాలో తోసేసి, దాన్ని గురించి పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేశాడు!

ఈ వజ్రం దెబ్బకు ఎవరేమయ్యారో చూద్దాం...

* జాకబ్‌ తన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. కోర్టు కేసుల్లో చిక్కుకుని భారీగా నష్టపోయాడు. అన్నింటినీ మించి నమ్మకమే ప్రాణమైన వజ్రాల వ్యాపారంలో పేరు పోగొట్టుకున్నాడు. రాజకుటుంబాలు దగ్గరకు రానీయటం మానేశాయి. దీంతో వజ్రాలు కొనేవాళ్లెవరూ లేక వ్యాపారం ముగిసిపోయింది. చివరికి సర్వం కోల్పోయి జీవితాన్ని చాలా అనామకంగా ముగించాడు.
*  ఆల్బర్ట్‌ అబిద్‌.. నిజాంకు ప్రతిరోజూ ధగధగలు చూపిస్తూ.. అమ్మినవే అమ్ముతూ.. భారీగా డబ్బు కూడబెట్టుకున్నారు. ఆ డబ్బుతో ఇంగ్లండ్‌లో ఒక ఎస్టేటు కొనుక్కుని కుటుంబంతో అక్కడకు వెళ్లి హాయిగా స్థిరపడ్డారు. అబిడ్స్‌లోని ఆయన దుకాణం 1939లో ఇంపీరియల్‌ థియేటర్‌గా మారింది. 1980లలో దాన్నీ పడగొట్టేశారు. ఆ దుకాణం కాలగర్భంలో కలిసి పోయినా ఆ ప్రాంతం మాత్రం ఇప్పటికీ అబిడ్స్‌గా అందర్నీ అలరిస్తూనే ఉంది!
*  ఇక మహబూబ్‌ ఆలీ ఖాన్‌ 1911లో చనిపోయారు. ఆయన తర్వాత సంస్థానం బాధ్యతలను ఆయన కుమారుడు ఉస్మాన్‌ అలీ ఖాన్‌ స్వీకరించారు. ఆయన ఓ రోజు తన తండ్రి సామాన్లు పరిశీలిస్తుంటే డ్రాలో, పాత బూటులో ఆ వజ్రం కనబడింది. దాన్ని గురించి మరి ఆయనకు పూర్తిగా తెలుసోలేదోగానీ తన బల్ల మీద కాగితాలు ఎగిరిపోకుండా పేపర్‌వెయిట్‌గా వాడటం మొదలుపెట్టారు. దీంతో నిజాం వజ్రాలను పేపర్‌వెయిట్‌గా వాడతారని పేరైతే వచ్చిందిగానీ.. ఆయన మాత్రం ఆ వజ్రాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. చివరికి నిజాం నగలన్నింటితో పాటు ఈ వజ్రం కూడా ట్రస్టుకు, అట్నుంచి భారత ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్లి, ప్రస్తుతం ఆర్‌బీఐ అధీనంలో ఉంటోంది. తాజాగా దిల్లీలో జరిగిన నిజాం నగల ప్రదర్శనలో మిగతా ఆభరణాలన్నింటి మధ్యా.. ఈ జాకబ్‌ వజ్రం కూడా వన్నెచిన్నెలు ఒలికించింది!!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.