close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘ముంపు’కొచ్చిన ముహూర్తం

‘ఫ్యామిలీ ప్యాకేజీ’ ఆశతో ఆగమేఘాల మీద వివాహాలు
తమ కుమారులను ప్రత్యేక కుటుంబంగా గుర్తించాలని వినతులు
మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల్లో ఇదీ పరిస్థితి
గడువు కారణంగా కొందరికి దక్కని ప్యాకేజీ
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, తొగుట

పెద్దోడికి 21 ఏళ్లు నిండాయి. అసలే ముంపులో మునిగిపోనున్నాం. తెలిసిన సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేద్దాం. ఆడొక ఇంటి వాడవడమే కాదు.. ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ కూడా దక్కుతుంది. ఇదీ మల్లన్నసాగర్‌ జలాశయం పరిధిలోని నిర్వాసిత గ్రామాల్లో గత నాలుగు నెలలుగా వినిపిస్తున్న మాట.

ఇంట్లో 21 ఏళ్లు నిండిన కుమారుడికి పెళ్లి చేసేస్తే పునరావాస, పునరోపాధి ప్యాకేజీలో అదనపు లబ్ధి చేకూరుతుందని భావించి ఆగమేఘాల మీద మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల్లో పలువురికి పెళ్లిళ్లు చేస్తున్నారు. దీంతో ఏ గ్రామంలో చూసినా 21-23 ఏళ్లలోపున్న వారిలో చాలామందికి ఈ మధ్యకాలంలో వివాహాలు జరిగాయి. ఇలాంటివారి సంఖ్య దాదాపు 90కి పైగానే ఉంటుంది. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం, పునరోపాధి ప్యాకేజీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్లను సర్వే చేసి అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఆ క్రమంలో ఇంట్లో పెళ్లి కాని 18 ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షలతో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని చెప్పారు. ఒకవేళ పెళ్లి జరిగినట్లయితే వారిని కుటుంబంగా పరిగణించి రూ.7.5లక్షలతో పాటు 250 గజాల స్థలం, రెండు పడక గదుల ఇంటిని కట్టిస్తామన్నారు. ఇల్లు వద్దనుకుంటే రూ.5.04లక్షల విలువైన చెక్కును అప్పటికప్పుడు ఇస్తామన్నారు.

ప్యాకేజీ దక్కింది కొందరికే
తమ ఇంట్లో 21 ఏళ్లు దాటిన మగపిల్లాడు ఉన్న వాళ్లలో చాలామంది ఆలోచనలో పడ్డారు. ముంపులో తమ ఊర్లు ఎలాగూ మునిగిపోతాయి. అంతకుముందే గ్రామస్తుల సమక్షంలో పెళ్లి వేడుక చేసుకున్న తృప్తి మిగలడంతోపాటు ఫ్యామిలీ ప్యాకేజీ దక్కుతుందనే ఆశతో తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేద్దామనున్న వారు కూడా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఆ బాధ్యత పూర్తి చేశారు. ఈ నెల తొలివారంలో ప్రత్యేక శిబిరాలు పెట్టి మరీ అధికారులు చెక్కులు, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టారు. కొత్తగా వివాహం చేసుకున్న వారూ తమకు ఫ్యామిలీ ప్యాకేజీ ఇవ్వాలంటూ అధికారులకు వినతులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో కొందరికి ప్యాకేజీ దక్కగా, మరికొందరికి నిరాశే మిగిలింది. ‘ప్యాకేజీ వస్తుందనే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఇవ్వమంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని కొందరు నవవరులు ఆవేదనగా చెబుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోగా వివాహం చేసుకున్న వారినే తాము పరిగణనలోకి తీసుకుంటామని గతంలో వారికి స్పష్టంగా చెప్పామని అధికారులు వివరిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.