close

ప్ర‌త్యేక క‌థ‌నం

మునగ.. పోషకాలు దండిగా 

పాలకూరకన్నా వందరెట్లు అధికంగా కాల్షియం 
30 రెట్లు అధికంగా ఇనుము పోషకం 
పూలలో క్యాన్సర్‌ నిరోధకాలు 
వేర్లలో ఉర్సోలిక్‌, ఓడియానోలిక్‌ ఆమ్లాలు 
సంతానలేమి, క్యాన్సర్‌ నిరోధకానికి ఉపయుక్తం 
చెట్టులో అన్ని భాగాలూ మానవ  ఆరోగ్యానికి ఎంతో మేలు 
జాతీయ బయొలాజికల్‌ పరిశోధన సంస్థ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మన అమ్మమ్మ, నానమ్మలను అడిగి చూడండి.. ఇంటి ముందు తులసి.. ఇంటి పెరడులో మునగచెట్టు ఉంటే ఆ ఇంటిలో వారి ఆరోగ్యానికి అవి రక్షణ ఇస్తాయని చెబుతారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే ఈ మాటలు వింతగా అనిపించి, విలువ లేనివిగా కొట్టి పారేయకండి. వారి మాటలే వేదవాక్కుల్లాంటివని ప్రస్తుత ఆధునిక పరిశోధనా సంస్థల అధ్యయనాల్లో నిరూపితమవుతోంది. పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించే మునగ చెట్టు మన ఆరోగ్యాన్ని కాపాడే కల్పవృక్షం లాంటిదని బెంగళూరులోని జాతీయ బయొలాజికల్‌ పరిశోధన సంస్థ వెల్లడించింది. కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సంస్థ శాస్త్రవేత్తలు మునగ జన్యువులపై నిర్వహించిన పరిశోధనల్లో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇవన్నీ మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు యథాలాపంగా చెప్పేవాటికి దాదాపు దగ్గరగా ఉండటం మరో ముఖ్యమైన అంశం. 
వేరు నుంచి పూల దాకా.... 
మునగ చెట్టు విత్తనం, వేరు, కాండం, ఆకులు, పూలలో ఉండే జన్యువుల పటాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. జన్యుపటాలను పరిశీలిస్తే అనేక పోషక విలువలున్నట్లు తేలింది. ప్రతీ భాగంలో ఎన్నో విలువైన ఔషధ గుణాలున్నాయి. వీటిని పరిశీలించిన తరవాత మునగ చెట్టు ఒక ‘మహత్యపూరిత చెట్టు’(మిరాక్యులిస్‌ ట్రీ)గా వారు అభివర్ణించడం విశేషం. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న ‘గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం’ ఆవరణలోని ఒక చెట్టు నుంచి వివిధ భాగాలను వారు సేకరించి పరిశోధించారు. ప్రయోగశాలల్లో అనేక కోణాల్లో, వీటి జన్యుపటాలను విశ్లేషించారు. ఈ చెట్టు మహత్యాన్ని వివరిస్తూ వీరు రాసిన వ్యాసం ‘జినోమిక్స్‌’ జర్నల్‌లోనూ తాజాగా ప్రచురితమైంది. 
సాధారణంగా ఆకుకూరలు అంటే మన ఇళ్లలో పాలకూర, చుక్కకూరలాంటివి ఎక్కువ తింటుంటాం. కానీ మునగ ఆకులతో కూర చాలా తక్కువగా కనిపిస్తుంది. పాలకూరలో ఉండే ఇనుముకన్నా 30రెట్లు, కాల్షియంకన్నా 100 రెట్లు ఎక్కువగా మునగ ఆకుల్లో ఉన్నట్లు గుర్తించారు. 
మునగ చెట్టు వేర్ల నుంచి కాండం ద్వారా ఆకులు, పూలు, కాయలలోకి ఇనుము, జింకు, మెగ్నీషియంను సరఫరా చేసే వ్యవస్థలు పక్కాగా ఉన్నాయి. ఈ పోషకాలు మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. బాగా పాలిష్‌ పట్టిన తెల్లని వరి బియ్యంలో ఈ పోషకాలు లేక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. 
విటమిన్‌ సీ ని ఉత్పత్తి చేసే కీలక ఎంజైమ్‌ మొత్తం అన్ని భాగాల్లోనూ ఉంది. 
వర్షాలు బాగా తక్కువ కురిసే వర్షాధార భూముల్లోనూ తక్కువ నీటితో బతికే సామర్థ్యం మునగకు ఉంది. ఇందులో ఉన్న సీ2హెచ్‌2, ఎంవైబీ జన్యువుల వల్ల ఇది వర్షాభావాన్ని సైతం తట్టుకుని కరవు నేలల్లోనూ బతుకుతోందని గుర్తించారు. 
మొత్తం 36 రకాల జన్యువులపై పరిశోధనలు చేశారు. మనిషి ఎదుగుదలకు అవసరమైన ఔషధ విలువలు ఎక్కువగా ఆకులు, పూలలో ఉన్నాయి. 
క్యాన్సర్‌ నిరోధక ఏజెంటులా పనిచేసే కేఎంఫెరోల్‌ మునగ పూలలో ఎక్కువగా ఉంది. 
మునగ చెట్టు వేర్లలో ఉన్న ఉర్సోలిక్‌, ఓడియానోలిక్‌ ఆమ్లాలు సంతానలేమిని, క్యాన్సర్‌ను నిరోధించడానికి ఉపకరిస్తాయి 
మునగ ఆకులు నీటిని శుద్ధి చేయడానికి ఉపకరిస్తాయి. ఇందులో ఉన్న ఓడియాక్‌ ఆమ్లం నూనెల శుద్ధికి ఉపయోగపడుతుంది. 
గతంలో ఈ సంస్థ తులసి చెట్టుపై పరిశోధనలు చేసి అనేక అంశాలు వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు మునగ చెట్టుకున్న ఔషధ గుణాలను వెలుగులోకి తేవడం ద్వారా పురాతన భారతీయ వంటకాల్లో దీనికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారో శాస్త్రీయ ఆధారాలతో తేటతెల్లమైంది. 
మునగకాయలనే ఎక్కువగా మన మార్కెట్లలో అమ్ముతున్నారు. కానీ పలు దేశాల్లో మునగ ఆకులను కూరకు ఎక్కువగా కొనడం పెరుగుతోంది. 
హైదరాబాద్‌లోని టోకు మార్కెట్లకు ఆదివారం 696 మునగకాయల బస్తాలు వస్తే అందులో తెలంగాణ జిల్లాల నుంచి కేవలం 3 మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ ఇతర రాష్ట్రాల నుంచే వచ్చినట్లు మార్కెటింగ్‌ శాఖ వెల్లడించింది. వారం క్రితం క్వింటా మునగకాయల టోకు ధర గరిష్ఠంగా రూ.1200 ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి తగ్గింది. చిల్లరగా రైతుబజార్లలో రూ.10కి 3 మునగకాయలు అమ్ముతున్నారు.

మునగ ఆకుల పొడికి డిమాండ్‌ పెరిగింది

మునగ చెట్ల నుంచి లేత ఆకులను తెంపి ఎండబెట్టి పొడిచేసి అందులో కరివేపాకు పొడిని కలిపి మిశ్రమంగా మార్చి అమ్మడానికి అనేక వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ పొడికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ బాగా పెరుగుతోంది. నపుంసకత్వాన్ని అరికట్టే ఔషధ గుణాలు మునగకు అధికంగా ఉందని గతంలోనే ఎన్నో అధ్యయనాల్లో తేలింది. తెలంగాణలో 2 వేల ఎకరాల్లో సాగులో ఉంది. ఇంకా బాగా పెంచడానికి రైతులకు బిందుసేద్యానికి ఎకరానికి రూ.30 వేల దాకా రాయితీ ఇస్తున్నాం. ఈ పంట వేసిన వారికి ఆదాయం బాగా వస్తోంది. 

- వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, తెలంగాణ ఉద్యానశాఖ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.