close

ప్ర‌త్యేక క‌థ‌నం

సీట్ల లెక్కల్లో పొంతన లేమి 

కనిష్ఠ, గరిష్ఠ అంచనాల మధ్య తేడా 
గందరగోళంగా మిగిలిన ఎగ్జిట్‌పోల్స్‌ 
ఈనాడు - దిల్లీ

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన వెంటనే దేశంలోని వివిధ జాతీయ, స్థానిక సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌పోల్స్‌ ప్రజల్లో ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తే.. మరోవైపు తీవ్ర గందరగోళాన్ని మిగిల్చాయి. అన్ని సంస్థలూ పార్టీల వారీగా కాకుండా కూటముల వారీగా తాము అంచనా వేస్తున్న ఫలితాలను వెల్లడించాయి. వీటి ప్రకారం కాంగ్రెస్‌, తృతీయ కూటముల కంటే భాజపా స్పష్టమైన ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది. అవి వెలువరించిన సంఖ్యల్లో మాత్రం ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేదు. దాదాపు డజనుకు పైగా జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ‘న్యూస్‌ ఎక్స్‌ - నేత’ సంస్థ అందరికంటే కనిష్ఠంగా భాజపా కూటమికి 242 సీట్లు ఇవ్వగా, ఇండియాటుడే సంస్థ గరిష్ఠంగా 368 సీట్లు కట్టబెట్టింది. ఈ రెండింటి మధ్య తేడా 126. కాంగ్రెస్‌ కూటమి అంచనాల్లో కనిష్ఠం, గరిష్ఠానికి మధ్య 87, తృతీయకూటమి అంచనాల్లో 69 చొప్పున తేడా ఉంది. మొత్తం 12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌పోల్స్‌లో 7 సంస్థలు ఎన్డీయే కూటమికి 300కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేయగా, మిగిలిన 5 సంస్థలు ఆలోపు వస్తాయని చెప్పాయి. ఇందులో ‘న్యూస్‌ ఎక్స్‌’ ఎగ్జిట్‌ పోల్‌ నిజమైతే భాజపా కూటమి మెజార్టీ మార్కు చేరుకొనే పరిస్థితి లేదు. ఆ మార్కు చేరుకోవడానికి మరో 31 సీట్లు బయటి పార్టీల నుంచి సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇండియాటుడే - యాక్సిస్‌ సంస్థ భాజపా కూటమికి ఘన విజయాన్ని అంచనావేసింది. దేశవ్యాప్తంగా 7.42 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించడం ద్వారా అధికార కూటమికి 339 నుంచి 365 దాకా సీట్లు వస్తాయని అంచనా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించిది. ఇండియా టుడే, న్యూస్‌ 18, టుడేస్‌ చాణక్య సర్వేలు మాత్రమే ఎన్డీయే కూటమి దాదాపు 2014 సంఖ్యాబలాన్ని నిలబెట్టుకోవడమో, అంతకుమించి పెంచుకోవడమో జరుగుతుందని అంచనా వేశాయి. మిగతా అన్ని సర్వేలూ ఎన్డీయే బలం గత సార్వత్రిక ఎన్నికల కంటే తగ్గుతుందని లెక్కేశాయి. 2014లో 336 సీట్లు కూడగట్టుకున్న ఈ కూటమికి దాదాపు 30 వరకు సీట్లు  తగ్గవచ్చని మూడు సంస్థలు చెప్పగా, 46 - 94 మధ్యలో సీట్లు కోల్పోవచ్చని అయిదు సంస్థలు అంచనా వేశాయి. 
గతంలో ఇలా.. 
1999లో ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్‌లో భాజపా కూటమికి అన్ని సంస్థలూ 300 నుంచి 336 దాకా సీట్లు రావచ్చని అంచనా వేయగా అంతిమంగా 296 వచ్చాయి. 2004లో 248 నుంచి 290 దాకా అంచనా వేయగా చివరకు 189 దక్కాయి. 2009లో 177 నుంచి 197 వరకు వస్తాయని లెక్కించగా అంతిమ ఫలితం 159 వచ్చింది. 2014లో 249 నుంచి 340 వరకు వస్తాయని అంచనావేయగా చివరకు 336 వచ్చాయి. క్రితంసారి కేవలం చాణక్య సంస్థ మాత్రమే వాస్తవానికి దగ్గరగా అంచనా వేసింది. 1999 నుంచి 2009 వరకు భాజపా కూటమికి ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినదాని కంటే అంతిమ సంఖ్య కొంత తగ్గింది. 2014లో చాలా సంస్థల అంచనాల కంటే సంఖ్య పెరిగింది. 2014లో అన్ని సంస్థలూ దేశంలో ఉన్న రాజకీయ వాతావరణానికి అద్దం పట్టగలిగాయి తప్ప వాస్తవమైన సంఖ్యను చెప్పడంలో విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో యూపీయేకు 92 నుంచి 120 దాకా సీట్లు వస్తాయని ఊహించగా చివరకు ఆ సంఖ్య 60 వద్దే ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా కూటమి 73 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తుందన్న విషయాన్ని ఎగ్జిట్‌పోల్స్‌ పసిగట్టలేకపోయాయి. 2009లో యూపీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందన్న విషయాన్నికూడా అంచనాలు పసిగట్టలేపోయాయి. ఆ ఎన్నికల్లో యూపీయేకి కనిష్ఠంగా 185, గరిష్ఠంగా 205, ఎన్డీయేకి కనిష్ఠంగా 165, గరిష్ఠంగా 195 సీట్లు వస్తాయని సర్వే సంస్థలు లెక్కించాయి. కానీ చివరకు యూపీయే 262 సీట్లు దక్కించుకోగా, ఎన్డీయే 159 వద్దే ఆగిపోయింది. 
అంచనాల్లో తేడా ఎందుకంటే.. 
స్థానికంగా దౌర్జన్యం చేసే నేతలు, పార్టీలకు వ్యతిరేకంగా ఓటేశామని చెప్పుకోవడానికి ప్రజలు ఇష్టపడరన్నది ఒక అభిప్రాయం. తాము ఓటేసిన విషయం బయటికి తెలిస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయంతో కొందరు బడుగు, బలహీనవర్గాల వారు లోపల ఒకరికి ఓటేసినా బయటికి మరొకరికి వేసినట్లు చెబుతుంటారని, దీనివల్ల కూడా అంచనాల్లో తేడా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్‌ ద్వారా, ఫోన్ల ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లోనూ స్పష్టమైన నాడి దొరికేందుకు అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. 2014లో దేశవ్యాప్తంగా మోదీ గాలి స్పష్టంగా కనిపించిన సమయంలోనూ ఎన్డీయే కూటమికి ఒక్క సంస్థ తప్ప మిగతా వారెవ్వరూ 300 దాటి ఇవ్వలేదని, ఇప్పుడు దాదాపు 7 సంస్థలు అంతకుమించి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెబుతున్నారు. 2014లో ఆ సంస్థలు సర్వే చేసినప్పుడు 300కి పైగా సంఖ్య వచ్చినా వాటిపై అనుమానం వచ్చి ఎందుకొచ్చిన గొడవలన్న ఉద్దేశంతో మధ్యేమార్గంగా కొంత తగ్గించి ఉంటాయని, ఇప్పుడు క్రితం ఫలితాలను చూసిన ధైర్యంతో 365 దాకా వెళ్లినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఒక్కో సర్వే సంస్థ లెక్కల 50 నుంచి 100 దాకా సీట్ల తేడా ఉండటంపట్ల ప్రజల్లో అయోమయం నెలకొంటోంది. తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన సర్వేలను ఆధారంగా చేసుకొని అభిమానులు మురిసిపోతుండగా, వ్యతిరేకించే వారు అతితక్కువ సంఖ్య చూపిన సర్వేను ప్రాతిపదికగా చేసుకొని లెక్కలు వేసుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 
జాతీయ రాజకీయాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కున్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ దక్కుతుందన్న దానిపై ఆసక్తి కనబరుస్తారు. దీనిపై నాలుగు సంస్థలు వెలువరించిన సర్వే చూస్తే రెండింట్లో భాజపా కూటమికి, మరో రెండింట్లో ఎస్పీ, బీఎస్పీ కూటమికి మెజార్టీ సీట్లు దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంలో దక్కే సీట్ల సంఖ్యను అందరూ సమానంగా అంచనా వేసినా... ప్రధాన పోటీదారులైన భాజపా, ఎస్పీ+బీఎస్పీల లెక్కల్లో మాత్రం తేడాలు చూపాయి. ఏబీపీ - ఏసీ నీల్సన్‌, సీ ఓటర్‌ సంస్థలు ఈ రాష్ట్రంలో భాజపాకు అత్యల్పంగా 22, 38, మహాకూటమికి అత్యధికంగా 56, 40 సీట్లు కట్టబెట్టాయి. మరోవైపు టైమ్స్‌ నౌ, జన్‌కీ బాత్‌ సంస్థలు భాజపా కూటమికి 58, 53, మహాకూటమికి 20, 24 సీట్లు మాత్రమే ఇచ్చాయి. మరోవైపు ఇండియా టుడే సంస్థ 68 ఇవ్వగా, టుడేస్‌ చాణక్య సంస్థ 73 దాకా యూపీలో భాజపా కూటమికి రానున్నట్లు అంచనా వేసింది.

శాస్త్రీయత ఏదీ?

లు సందర్భాలలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు, వాస్తవ ఫలితాలకు సంబంధం ఉండకపోవడంతో వీటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సంస్థలు కొన్నిసార్లు వాస్తవ ఫలితాలకు దగ్గరగా వస్తుండగా, మిగిలినవి గురికి బారెడు దూరంగా ఉంటున్నాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాలు సరిగా రాకపోవడానికి కూడా పలు కారణాలుంటాయి. సర్వే చేసేవాళ్లు అడిగే ప్రశ్నలు, అడిగే సమయం, వారు ఉపయోగించే పద్ధతి, తీసుకున్న శాంపిళ్లు.. అన్నీ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన ఒక ప్రముఖుడికి చెందిన సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాలకు కలిపి లక్షన్నర మందిని శాంపిల్‌గా తీసుకున్నట్లు చెప్పారు. అంటే సగటున జిల్లాకు సుమారు 11,500 మందిని మాత్రమే అడిగారన్న మాట. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్లు చెప్పిన మాటను మొత్తం రాష్ట్రానికి లేదా దేశానికి ఎలా అన్వయిస్తారన్నది అతి పెద్ద ప్రశ్న. అలాగే, శాంపిళ్లను ఎన్నుకోవడంలో క`ూడా వీరు శాస్త్రబద్ధంగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకలా ఉండవు. అందువల్ల ఎవరిని అడగాలన్న విషయాన్ని జాతీయస్థాయిలో దిల్లీలో కూర్చుని నిర్ణయిస్తే ఫలితాలు తారుమారు అవుతాయి.

అరకొర సిబ్బందితో...

గ్జిట్‌ పోల్స్‌ నిర్వహించే సంస్థలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సిబ్బంది ఉండటం అరుదు. అందువల్ల వివిధ రాష్ట్రాలలో అక్కడ స్థానికంగా ఉండే కొంతమందిని వారు నియమించుకుంటారు. అలాంటివారు ఎంతవరకు శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు, ఎంత నిష్పాక్షికంగా ఫలితాలు చెబుతారన్నది అనుమానమే. అలాగే ఒక నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి ఒక జిల్లా మొత్తం ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించాలంటేనే అనేకమంది సిబ్బంది, వారికి జీతభత్యాలు, తర్వాత విశ్లేషణకు కూడా పెద్దసంఖ్యలో యంత్రాంగం, వారికయ్యే ఖర్చు.. ఇవన్నీ ఉంటాయి. అలాంటిది రాష్ట్రవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఇలాంటి కసరత్తు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇంత చేయడానికి ఆయా సంస్థలు ఎంతవరకు ముందుకొస్తాయనేదాన్ని బట్టి కూడా వారు నిర్వహించే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఆధారపడతాయి. కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉండే సంస్థలు వాటికి పెద్దపీట వేసి, ప్రత్యర్థి పార్టీలను తక్కువగా చేసి చూపుతాయన్న ఆరోపణలు కూడా లేకపోలేవు. అన్ని సంస్థలూ ఒకే విధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించినపుడు అసలు ఒకరు చెప్పే ఫలితాలకు, మరొకరు చెప్పేవాటికి తేడా దాదాపుగా ఉండకూడదు. కానీ వివిధ సంస్థలు పూర్తి విరుద్ధంగా చెబుతున్నాయి. దీన్ని బట్టే వాటిని ఎంతవరకు నమ్మాలో.. వద్దో తెలిసిపోతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.