close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈఎస్‌ఐలో గోలీమాల్‌

రూ.425 కోట్ల నిధుల వ్యయంలో అక్రమాలు
ఒకే కుటుంబ సంస్థలకు మందుల సరఫరా బాధ్యతలు
   ఈ-టెండరు విధానానికి తిలోదకాలు
   డైరెక్టర్‌, సిబ్బంది బాధ్యతారాహిత్యం
   తెలంగాణ నిఘా వర్గాలు వెల్లడి
   బాధ్యులపై కఠిన చర్యలకు సిఫార్సు
   సర్కారుకు సమగ్ర నివేదిక సమర్పణ

ఈనాడు-హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కొనుగోళ్లలో కనీస నిబంధనలకు తూట్లు పొడిచారు. తప్పనిసరిగా పాటించాల్సిన ఈ-టెండరు విధానానికి తిలోదకాలిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన బినామీ సంస్థలకు మందుల టెండర్లను కట్టబెట్టారు.

అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై లోతుగా విచారించిన నిఘా వర్గాలు ఇటీవలే సమగ్ర నివేదికను తెలంగాణ సర్కారుకు అందజేశాయి.  ఔషధ కొనుగోళ్ల అక్రమాల్లో ఈఎస్‌ఐ డైరెక్టర్‌(సంచాలకులు), ఇద్దరు సంయుక్త సంచాలకులు, ఔషధ నిల్వ సహాయ సంచాలకులు, ఇద్దరు ఫార్మాసిస్టుల పాత్ర ఉందని నిఘా నివేదిక వెల్లడించింది. వీరందరిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలివి..
డిస్పెన్సరీల నుంచి సంయుక్త సంచాలకులకు ఫలానా మందులు కావాలని అభ్యర్థన రాగానే అవి అవసరమా? కాదా? అని కనీసం పరిశీలించకుండా నేరుగా డైరెక్టర్‌కు పంపించారు.
డైరెక్టర్‌ స్వల్ప మార్పులు చేసి కొనుగోలు ఉత్తర్వులను ఔషధ సంస్థలకు పంపించారు.
ఔషధ నిల్వ కమిటీని ఏర్పాటుచేసి మందుల కొనుగోళ్లకు తప్పనిసరిగా ఆ కమిటీ ఆమోదం పొందాలి. అయితే 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలలో కమిటీలను ఏర్పాటు చేయలేదు.
ఫార్మాసిస్టు, ఔషధ నిల్వ గోదాము సహాయ సంచాలకులు రూపొందించిన మందుల జాబితానే డైరెక్టర్‌ ఆమోదించారు.
ఆ జాబితాల్లో కొన్నింటిని అధికారులు సంబంధిత ఔషధ సంస్థల ప్రతినిధులకు నేరుగా అందజేశారు. కనీసం ఎవరు తీసుకెళ్లారనే సమాచారం కూడా ఈఎస్‌ఐ కార్యాలయంలో లేదు. కేవలô ఆ ప్రతినిధి పొట్టి సంతకం ఉంది. కొన్నింటిని సాధారణ తపాలా ద్వారా పంపించారు. ఆ జాబితా ఆయా సంస్థలకు ముట్టిందో లేదో తెలిపే పత్రాన్ని కూడా తపాలా పంపిణీలో జతచేయలేదు. నమోదు పుస్తకంలోనూ ఔషధ అవసర పత్రాలు ముట్టాయా? లేదా? అనే సమాచారాన్ని భర్తీ చేయలేదు. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారని స్పష్టమవుతోంది.
సాధారణంగా టెండరులో తక్కువ ధరను పొందుపర్చిన(ఎల్‌1) సంస్థకు ఔషధ సరఫరా బాధ్యతను అప్పగిస్తారు. ఒకవేళ ఆ సంస్థ మందులను సరఫరా చేయలేని పరిస్థితుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సంస్థలకు అవకాశమిస్తారు. అయితే ఇక్కడ అసలలాంటి ప్రయత్నమే జరగలేదు. మందులను సరఫరా చేయనందుకు ఎల్‌1 సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న సంస్థలతో సంప్రదించకుండా నేరుగా విపణిలో అత్యధిక ధరలతో మందులను కొన్నారు.
ఉదాహరణకు ముందే కుదుర్చుకున్న ఔషధ ధరలో ఎల్‌1 టెండర్‌ ధర ‘హ్యూమన్‌ ఇన్సులిన్‌’ 10ఎంఎల్‌ వాయిల్‌కు రూ.66.72 ఉండగా.. దీన్ని బహిరంగ విపణిలో రూ.139.59 చొప్పున కొన్నింటినీ, రూ.122.82 చొప్పున మరికొన్నింటిని కొన్నారు. అలా పదుల రకాల మందులను లక్షల్లో కొన్నారు. ఫలితంగా రూ.కోట్లలో వ్యత్యాసం వచ్చింది.
2016-17లో ఒప్పంద ధరల ప్రకారం రూ.113.91 కోట్ల మందులు.. విపణి ధర ప్రకారం 101.66 కోట్ల విలువ కలిగినవి కొన్నారు. 2017-18లో ఒప్పంద ధరలో రూ.142.87 కోట్లవి.. విపణి ధర ప్రకారం రూ.66.60 కోట్లవి కొన్నారు.
అవసరమైన మందుల కొనుగోళ్లలో ‘ఔషధ నిల్వ కమిటీ’ సమావేశాన్ని కుటుంబ సంక్షేమ సంయుక్త సంచాలకుల ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉండగా ఒక్కసారి కూడా నిర్వహించలేదు. అసలు అలాంటి నిబంధన ఉందనే విషయమే తనకు తెలియదని కుటుంబ సంక్షేమ సంయుక్త సంచాలకులు విచారణలో చెప్పడాన్ని బట్టి.. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ ఉద్దేశపూర్వకంగానే సంయుక్త సంచాలకులకు తెలియకుండా వ్యవహరించారని తేటతెల్లమవుతోంది.
ముందే కుదుర్చుకున్న ధర ఒప్పంద విధానం ప్రాతిపదికనే మందులు కొనాలి. ఒకవేళ ధర ఒప్పందం విధానంలో లేని మందులను కొనాలంటే బహిరంగ టెండరు విధానాన్ని అనుసరించాలి. దీనికోసం ముగ్గురు సభ్యులతో స్థానిక కొనుగోలు కమిటీని ఏర్పాటుచేయాలి. ఆ కమిటీ మందుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తుంది. కానీ అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా కొన్నారు.
ఔషధ సంస్థలను క్షుణ్ణంగా పరిశీలించడంలో ఈఎస్‌ఐ కార్యాలయం పూర్తిగా విఫలమైంది. ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు సంస్థలు స్వల్పంగా ధరలను మార్చి, టెండర్లను దక్కించుకున్నాయి.
ఆన్‌లైన్‌లో టెండరు నిర్వహించకుండా గోప్యంగా తమకు నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టే విధంగా వ్యవహరించారు.
కొనుగోళ్లలో ఎక్కువ సంస్థలకు అవకాశమివ్వడానికి అనుకూలంగా విస్తృత స్థాయిలో అసలు ప్రచారమే నిర్వహించలేదు. రూ.25 లక్షలు, ఆ పైన నిధులను ఖర్చుపెట్టాలంటే తప్పనిసరిగా టెండరుకు వెళ్లాలి. పేరున్న పత్రికల్లో టెండరు ప్రకటనలివ్వాలి. ఒకవేళ పత్రికా ప్రకటన ఇవ్వకుండా కొనాల్సి వస్తే.. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్నారో సంతృప్తికరమైన సమాధానాన్ని లిఖితపూర్వకంగా పొందుపర్చాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించలేదు. కేవలం కార్యాలయ ప్రకటన బోర్డుపై సంబంధిత సమాచారాన్ని అతికిస్తున్నారు. ఎవరైతే క్రమం తప్పకుండా టెండర్లు పొందుతున్నారో వారికే ఆ సమాచారం తెలుస్తోంది.
ఒకే కుటుంబానికి చెందిన కొన్ని సంస్థలకు 2016-17, 2017-18ల్లో దాదాపు రూ.210 కోట్లకు పైగా సరఫరా బాధ్యతలు అప్పగించారు.
ముందే కుదుర్చుకున్న ఒప్పంద ధర విధానంలో కాకుండా ఎందుకు అధిక మొత్తంలో అప్పటికప్పుడు కొత్త ధరలతో కొనుగోలు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ వద్ద సరైన సమాధానమే లేదు. ‘అత్యవసర పరిస్థితుల దృష్ట్యా’ కొనాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. అంటే అసలు ఔషధ నిల్వలెన్ని ఉన్నాయి? ఎంత మోతాదులో ఖర్చయ్యాయి? ఎంత కొనుగోలు చేయాలనే స్పష్టమైన సమీక్షలేమీ డైరెక్టర్‌ నిర్వహించడంలేదని స్పష్టమవుతోంది.
మొత్తంగా ఔషధ కొనుగోళ్లలో పారదర్శకత లోపించింది. అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోంది.
ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని వెంటనే అమలుచేయాలి. టెండరు పరిశీలన కమిటీలను నియమించాలి.

డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి: సీపీఎం
బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ దేవికారాణిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో సుమారు రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఇటీవల విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించినా.. కారకులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు అవసరమయ్యే మందులు, ఇతర పరికరాలను ఎలాంటి టెండర్లు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ఫార్మసీ సంస్థల్లో కొనుగోలు చేశారని తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.