close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఐదేళ్లలో ప్రాంతీయ హవా 

సార్వత్రికంలో మారుతున్న సమీకరణాలు

రేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ సొంత ఆధిక్యంతోనే 2014లో అధికారంలోకి రావడంతో.. ఇక అప్పటినుంచి ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతుందని చాలామంది అనుకున్నారు. కేంద్రంలో బలమైన జాతీయపార్టీ అధికారంలో ఉండటంతో ఆ ప్రభావం రాష్ట్రాల మీద కూడా పడుతుందనే భావించారు. కానీ అయిదు సంవత్సరాల తర్వాత చూసుకుంటే.. ప్రాంతీయ పార్టీల ప్రభావం, వాటి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఈ అయిదేళ్లలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు పూర్తిగా బలహీనమైతే, మరికొన్ని చోట్ల బాగా బలపడ్డాయి. ప్రస్తుతం దాదాపు 13 పెద్ద రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒకరకంగా ఇది జాతీయ పార్టీలకు పంటికింద రాయి లాంటి పరిస్థితే. 
1989 నుంచి 2009 వరకు కేంద్రంలో బలహీన ప్రభుత్వాలు ఉండటంతో ప్రాంతీయపార్టీలు బలం పుంజుకున్నాయి. 1996 నుంచి మొన్నటివరకు పార్లమెంటులో ప్రాంతీయ పార్టీల బలం 200కు పైగానే ఉంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చూసుకుంటే అసలు జాతీయ పార్టీలకు అవకాశం అన్నది దాదాపుగా ఇవ్వకుండా మొత్తం ప్రాంతీయ పార్టీలే పంచుకున్న సందర్భాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ఐదేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే చాలావరకు స్థానాలు అటూ ఇటూ మారాయి. 2009లో 116 సీట్ల నుంచి 2014లో 282 స్థానాలకు భాజపా ఎదిగింది. అంటే 166 స్థానాలు పెరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ 162 స్థానాలు కోల్పోయింది. మరోపక్క ప్రాంతీయ పార్టీల బలం దాదాపు యథాతథంగానే నిలబడింది. వాటి ఓట్ల శాతం కూడా ఏ మాత్రం తగ్గలేదు. 1998 నుంచి చూసుకుంటే ప్రాంతీయ పార్టీలన్నింటికీ కలిపి సార్వత్రిక ఎన్నికల్లో వస్తున్న ఓట్లు 40 శాతం వరకు ఉంటున్నాయి. ఈసారి సైతం కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కొంత కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. 
సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే తమ ప్రాంత ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తాయి తప్ప వాటికి జాతీయ దృక్పథం ఉండదన్నది జాతీయ పార్టీల నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ. కేంద్రంలో ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించడం ద్వారా వాటిని పడగొట్టాలనుకోవడం, కీలకమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లు లాంటివాటికి ఆటంకాలు కల్పించడం ఎంతవరకు సబబని అడుగుతున్నాయి. రాష్ట్రాలు బలంగా ఉంటే తప్ప దేశం ఎలా బలోపేతం అవుతుందన్నది ప్రాంతీయ పార్టీల వాదన. బహుళ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పలు రకాల సమస్యలు, ఒత్తిడులు ఉండక తప్పదు. సంకీర్ణ ధర్మానికి పెద్దపీట వేస్తూనే ప్రభుత్వాన్ని నడిపించడం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు కత్తిమీద సామే. ప్రాంతీయపార్టీల ప్రాతినిధ్యం కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువగా ఉంటే సమాజంలోని వివిధ వర్గాల గొంతు బలంగా వినిపిస్తుంది. గడిచిన ఐదేళ్లలో ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం కేంద్రంలో ఎక్కువగా లేకపోయినా.. వస్తుసేవల పన్ను లాంటి అంశాలలో మాత్రం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై తగిన ఒత్తిడి  తీసుకొచ్చి తమ వాదన గట్టిగా వినిపించగలిగాయి. అదే సమయంలో చాలా ప్రాంతీయపార్టీలు ఈ ఐదు సంవత్సరాలలో తమ స్వరం మార్చుకున్నాయి. కొన్ని పార్టీలు కేంద్రంతో కొట్లాట ధోరణితోను, మరికొన్ని సానుకూలతతోను వ్యవహరించాయి. ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్‌ ముగియడం, ఫలితాలు కూడా మరికొన్ని రోజులలో వెలువడుతున్న నేపథ్యంలో రాబోయే అయిదేళ్లలో ప్రాంతీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయన్న విషయం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.