close

ప్ర‌త్యేక క‌థ‌నం

లెక్కల్లో ఎంతో తేడా 

వాస్తవ విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ 
1 నుంచి 25 శాతం వరకు తప్పు 
2014లో జరిగిందిదే 
మళ్లీ విభిన్నంగా వివిధ సంస్థల అంచనాలు 
ఈనాడు-దిల్లీ

గ్జిట్‌ పోల్స్‌ రాగానే అన్ని వర్గాల్లో ఎంతో ఉత్కంఠ మొదలైంది. వివిధ సర్వేసంస్థలు వేర్వేరు రకాలుగా ఫలితాలను అంచనా వేయడంతో ఏది కచ్చితం.. ఏది కాదన్న చర్చ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలపై వివిధ జాతీయ ఛానళ్లు 2014లో ఇచ్చిన సర్వే ఫలితాలు కచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. 2019లో ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల చేసిన ఇవే సంస్థలు 2014లో వెల్లడించిన లెక్కలను పరిశీలించి చూస్తే ఒక్క ‘టుడేస్‌ చాణక్య’ తప్ప మిగతా లెక్కలన్నీ వాస్తవ విరుద్ధంగానే కనిపించాయి. 2014లో ఎన్డీయే కూటమికి 336 సీట్లు రాగా ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏబీపీ 55 సీట్లు తక్కువ చూపింది. టైమ్స్‌ నౌ 87, న్యూస్‌18.. 56, ఇండియాటుడే 64, సీఓటర్‌ 47, ఎన్‌డీటీవీ 57 సీట్లను తక్కువగా అంచనా వేశాయి. టుడేస్‌చాణక్య తప్పుశాతం 1.17% కనిపించగా, టైమ్స్‌ నౌ ఛానల్‌ తప్పు శాతం 25% మేర నమోదైంది. గత ఎగ్జిట్‌పోల్స్‌తో పోలిస్తే ఈసారి ఎన్డీయే కూటమికి  2014లో తాను అంచనావేసిన వేసిన (281) స్థానాల కంటే 14 సీట్లు తక్కువ వస్తాయని ఏబీపీ న్యూస్‌ అంచనా వేసింది. సీ ఓటర్‌ కూడా క్రితం కంటే 2 సీట్లను తగ్గించింది. ఇవి తప్ప మిగతా అన్ని ఛానళ్లూ 2014లో తాము వేసిన అంచనాల కంటే ఎక్కువ స్థానాలను ఎన్డీయేకు ఈసారి తమ ఎగ్జిట్‌పోల్స్‌లో కట్టబెట్టాయి. క్రితంసారి దాదాపు అన్ని సంస్థలూ ఎన్డీయేకి తక్కువ, యూపీయేకి ఎక్కువ అంచనా వేసి చూపగా ఫలితాల నాటికి అది తారుమారైంది. యూపీయేకి క్రితంసారి టౌమ్స్‌ నౌ అంచనాలకంటే 88 సీట్లు, ఇండియా టుడే అంచనాలకంటే 55 సీట్లు తగ్గాయి. టుడేస్‌ చాణక్య అంచనా ఒక్కటే యూపీయే లెక్కకు దగ్గరగా ఉంది. ఆ సంస్థ 61-79 సీట్లు వస్తాయని అంచనావేయగా చివరకు 60 వచ్చాయి. ఇతరుల లెక్కల విషయంలో టైమ్స్‌ నౌ అంచనా దాదాపు సరిపోయింది. 2014లో ఈ రెండు కూటముల్లో లేని పార్టీలకు 146 వస్తాయని ఆ సంస్థ అంచనా వేయగా అంతిమ లెక్క 147గా తేలింది. గత అనుభవాలను బట్టిచూస్తే ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించే సంస్థలు ఎక్కువ సీట్లు వచ్చే పార్టీలకు తక్కువ అంచనా వేయడం, తక్కువ వచ్చేవాటికి ఎక్కువ అంచనా వేయడం కనిపించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ వల్ల పార్టీల గెలుపోటములపై కొంత స్పష్టత వస్తున్నా.. సంఖ్య విషయంలో భారీ తేడా ఉంది. ఉదాహరణకు 2014లో టైమ్స్‌ నౌ సంస్థ ఎన్డీయే కూటమికి 249 వస్తాయని లెక్కించినా అంతిమ ఫలితం నాటికి ఆ సంఖ్య మరో 87 పెరిగింది. ఇది భారీ తేడా కిందే లెక్క. క్రితంసారి యూపీయే కూటమి సంఖ్యాబలం రెండంకెలకే పరిమితం అవుతుందని మూడు సంస్థలు గుర్తించగా, నాలుగుసంస్థలు మూడంకెలకు పైన ఇచ్చాయి. ఈ కూటమికి అన్ని సంస్థలూ కనిష్ఠంగా పది నుంచి గరిష్ఠంగా 88 సీట్లు ఎక్కువ ఇచ్చాయి. ఇతరుల అంచనాల్లోనే పెద్దగా తేడా రాలేదు. ఈ అంచనాల్లో తేడా 1 నుంచి 19 సీట్లకే పరిమితం అయింది. 

ఒడిశాలో అంత తేడానా? 
యాక్సిస్‌ మై ఇండియా సంస్థ వెలువరించిన ఒడిశా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు చాలా ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. అక్కడ అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో రెండింటిపైనా ఆ సంస్థ సర్వే ఫలితాలు వెలువరించింది. మొత్తం 21 స్థానాలున్న ఒడిశాలో 45% ఓట్లతో భాజపా 15-19 సీట్లు గెలుచుకుంటుందని, 38% ఓట్లతో బిజూ జనతాదళ్‌ (బిజద) 2-6 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. అదే అసెంబ్లీ ఫలితాలకు వచ్చేటప్పటికి 44% ఓట్లతో బిజద 80-105 సీట్లు దక్కించుకొని వరుసగా అయిదోసారి అధికారం చేపడుతుందని వెల్లడించింది. పార్లమెంటు, అసెంబ్లీ మధ్య ఇంత పెద్ద ఎత్తున క్రాస్‌ఓటింగ్‌ ఉంటుందా అన్న ఆశ్చర్యం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 45% ఓట్లు సాధించే భాజపా అసెంబ్లీలో మాత్రం 35% ఓట్లతో కేవలం 29-43 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వైకాపాకు పార్లమెంటు ఎన్నికల్లో 45%, అసెంబ్లీ ఎన్నికల్లో 48% ఓటింగ్‌ ఇచ్చింది. తెదేపాకు పార్లమెంటులో 38%, అసెంబ్లీలో 40% ఓట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు పార్లమెంటులో 5%, అసెంబ్లీలో 6% ఓట్లు దక్కుతాయని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4%, బీజేపీకి 3%, ఇతరులకు 5% ఓట్లు ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇతరులకు 12% ఓట్లు ఇచ్చిన ఈ సంస్థ అసెంబ్లీలో ఆ సంఖ్యను 6%కి తగ్గించింది. ఇందులో మాత్రం కాంగ్రెస్‌, భాజపాకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది చెప్పలేదు. దీని ప్రకారం పార్లమెంటుతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు 3%, తెదేపాకు 2%, జనసేనకు 1% ఓటింగ్‌ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 2014లో యూపీలో భాజపా 42.63% ఓట్లతో 71 స్థానాలు గెలుచుకొంది. 19.77% ఓట్లు దక్కించుకున్న బీఎస్పీకి సున్నా రాగా,  22.35% సీట్లు దక్కించుకున్న ఎస్పీకి 5 సీట్లు వచ్చాయి. అప్పట్లో తొలిస్థానంలో ఉన్న భాజపాకు, మలిస్థానంలో ఉన్న ఎస్పీకి మధ్య 20% ఓట్లు, 66 సీట్ల తేడా వచ్చింది. తాజా యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం ఇప్పుడు ఈ రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 9% మాత్రమే. కానీ సీట్ల సంఖ్య మాత్రం భాజపాకంటే 52 తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పడం కొంత అయోమయానికి గురిచేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ విషయంలో ఏబీపీ సంస్థ భాజపాకు 33 ఇస్తే, యాక్సిస్‌ సంస్థ 68 వస్తాయని అంచనావేసింది. ఈ రెండు సర్వేల మధ్య 35 సీట్ల తేడా ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి భారీ తేడా కనిపిస్తోంది.


వాటిని నమ్మక్కర్లేదు 
ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేసిన విపక్షాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంచనాలతో వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ను కాంగ్రెస్‌ సహా విపక్షాలు తప్పుపట్టాయి. విజయం తమదేనని, ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు 23న వెలువడగానే అది రుజువవుతుందని ధీమా వ్యక్తం చేశాయి.

ఈసారీ నిరూపితమవుతుంది 
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా తప్పు అని చాలా సందర్భాల్లో రుజువయింది. 2004 మాదిరిగానే ఈసారి కూడా అది నిరూపిత మవుతుంది.

- హెచ్‌డీ దేవేగౌడ, మాజీ ప్రధాని

నిజమేమిటో 23న తేలిపోతుంది  
ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవం కాదని 23న తేలిపోతుంది. ఈ పోల్స్‌ను చూశాక దేశమంతా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఎలక్ట్రానిక్‌ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకున్న వర్గాలు ఈ ఫలితాలను ఇలా వెలువరించాయి. ఎన్నికలయ్యాక దిల్లీని వదిలి హిమాలయాల్లోకి వెళ్లిన మోదీ లాంటి ప్రధానిని నేను ఇంతవరకు చూడలేదు.

- శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత 

వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమే 

ఎన్నికల ఫలితాలు ఫలానా విధంగా ఉండబోతున్నాయంటూ వెలువడిన అంచనాల విశ్వసనీయత ప్రశ్నార్థకమే. గత చరిత్రను చూస్తే ఇది రుజువవుతుంది. ఆ అంచనాలు ఏమాత్రం వాస్తవం కాదని అనేకసార్లు తేలింది. ఇప్పుడూ అదే అవుతుంది.
- అశోక్‌ గహ్లోత్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి

అప్పుడూ తప్పయ్యాయి 
మళ్లీ ఎన్డీయే రాబోతోందన్న అంచనాలను నమ్మాల్సిన అవసరం లేదు. 2004లో మళ్లీ ఎన్డీయేనే గెలుస్తుందని ఎక్కువ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అవి తప్పయ్యాయి. కాబట్టి 23 వరకు వేచి చూస్తాను. 

- పినరయి విజయన్‌, కేరళ ముఖ్యమంత్రి 

అసలైన ఫలితాలు  
కాంగ్రెస్‌కు సంతృప్తికరంగా వస్తాయి 
ఎన్డీయే సర్కారే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నా అది ఏమాత్రం నిజం కాదనేది అసలైన ఫలితాలు చెబుతాయి. క్షేత్రస్థాయిలోని మా శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆ ఫలితాలు కచ్చితంగా కాంగ్రెస్‌కు సంతృప్తికరంగా ఉంటాయి. 

- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతాయనే  
ఇలాంటి ఫలితాలు  
కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలైనట్లు కనిపిస్తోంది. ఎన్డీయే ప్రతిష్ఠ దిగజారుతున్న తరుణంలో ఎగ్జిట్‌పోల్స్‌ భిన్నంగా రావడం అనుమానంగా ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండటంతో వాటిని అయోమయంలో పడేయడానికి భాజపా నాయకత్వం కుట్రపూరితంగా ఇలాంటి ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడేలా చేసింది. ప్రతికూల ఫలితాలు వెలువడితే స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతాయన్న మరో భయంతో మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చి, లేని ఎగ్జిట్‌పోల్స్‌ని బయటికి తీసుకొచ్చారు. ఇవి మాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్ని కుట్రలు పన్నినా 23న బండారం బయటపడుతుంది.

- కంభంపాటి రామ్మోహన్‌రావు, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి 


మళ్లీ మాదే విజయం:తృణమూల్‌

కోల్‌కతా: ఎగ్జిట్‌ పోల్స్‌ను వదంతులుగా కొట్టిపారేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పశ్చిమబెంగాల్‌లో ఈసారి కూడా తమదే విజయమని సోమవారం పేర్కొంది. ప్రతి నియోజకవర్గం నుంచి అంతర్గత నివేదికలు తెప్పించుకున్నామని.. వాటిలో స్పష్టమైన విజయం టీఎంసీదేనని తేలినట్లు వెల్లడించింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలకపాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను పార్టీ అధినాయకురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో యూపీ, మహారాష్ట్రల తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌ (42)లో ఈసారి టీఎంసీకి 24, భాజపాకు 16, కాంగ్రెస్‌కు 2 స్థానాలు రానున్నట్లు కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. 2014 ఎన్నికల్లో టీఎంసీ 34, భాజపా కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. కాగా తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తామేమీ ఆందోళన చెందడం లేదని, చాలా సందర్భాల్లో ఇవి వాస్తవాలకు విరుద్ధంగా వచ్చినట్లు టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతర పరిస్థితులపై తాము తెదేపా, కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌ తదితర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. తమ అంచనాల ప్రకారం ప్రతిపక్షాలే అధికారంలోకి వస్తాయని, భాజపా తిరిగి పగ్గాలు చేపట్టడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. 
 

భాజపాలో ఉత్సాహం.. ఆప్‌లో నిర్వేదం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలనూ భాజపా క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరోవైపు ఎగ్జిట్‌పోల్స్‌ కచ్చితత్వాన్ని కాంగ్రెస్‌, ఆప్‌ ప్రశ్నిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ ప్రక్రియపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ఈవీఎం కచ్చితంగా పనిచేస్తుందా?. ఎగ్జిట్‌పోల్స్‌ను స్పాన్సర్‌ చేశారా?. యూపీ, బిహార్‌, ఎంపీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, బెంగాల్‌లో భాజపా గెలుస్తుందంటున్నారు. ఎవరు నమ్ముతారు వీటిని?. వీవీప్యాట్‌- ఈవీఎంలలో తేడాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను రద్దు చేయాలని అన్ని పార్టీలు డిమాండు చేయాలి’’ అని సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు ఈ నెల 23న వెలువడే వాస్తవ ఫలితాల్లోనూ ప్రతిఫలించాలని దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఆకాంక్షించారు. రాజధాని ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను నమ్మడానికి కష్టంగా ఉందని దిల్లీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, చాందినీచౌక్‌ పార్టీ అభ్యర్థి జె.పి.అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. ‘‘అంచనాలు వాస్తవదూరంగా ఉన్నాయి. భాజపా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో గెలుస్తుందనడం నమ్మశక్యంగా లేదు’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.