Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

టక్కర్‌ చేసినా ఫికర్‌ లేదా!

రోడ్డెక్కితే చాలు వాహనాల బలాదూర్‌
ప్రమాదాలంటే బేఫికర్‌
ప్రమాద కారకులకు ఇట్టే వస్తున్న బెయిల్‌
బాధితులకు సత్వరం దక్కని పరిహారం
విదేశాల్లో కఠినమైన చట్టాల అమలు
తెలంగాణలోనూ కొత్త చట్టం దిశగా ప్రయత్నాలు

*నార్కట్‌పల్లి శివారు పరిశ్రమలో పని చేస్తున్న చిట్యాల మండలం వట్టిపర్తి గ్రామానికి చెందిన రాయపల్లి వెంకటరమణ (34) హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతూ కారు ఢీకొనటంతో మృత్యువాతపడ్డారు. కారు నడుపుతున్న డ్రైవర్‌ స్టేషన్‌ బెయిల్‌పై వెళ్లిపోయాడు. బాధితుడి కుటుంబం పరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోంది.

*కట్టంగూర్‌ మండలం ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ముత్యాల సైదులు (41) రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారుకు బీమా కూడా లేదని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం 2017 జనవరిలో జరిగింది. బాధిత కుటుంబానికి ఇంకా పరిహారం అందలేదు.

రోడ్డు ప్రమాదాల తీవ్రతపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్తగా సురక్షిత రాష్ట్ర రహదారి రవాణా చట్టం-2019 తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

రాష్ట్రంలో రహదారులు రక్త పిపాసుల్లా మారిపోయాయి. రోజుకు ఒక్కచోటైనా ప్రమాదం చోటుచేసుకోవడం.. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మామూలైపోయింది. రక్తమోడుతున్న రహదారులతో చాలా కుటుంబాల్లో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోడ్లను భారీగా విస్తరించడంతో అత్యాధునిక వాహనాలు అడ్డూఅదుపూ లేని వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ వేగం ఎన్నో ప్రాణాలను మింగేస్తోంది. మరెందరినో క్షతగాత్రులను చేస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు గంటల వ్యవధిలో స్టేషన్‌ బెయిలుపై దర్జాగా బయటకొచ్చేస్తున్నారు.

ఈ ప్రమాదాల్లో బాధిత కుటుంబాలు పేద, మధ్యతరగతివైతే వారి దైన్య స్థితిని వివరించడానికి మాటలు చాలవు. కొందరికైతే పరిహారం కోసం పోరాడేంత చైతన్యం, ఆర్థిక స్థైర్యం కూడా ఉండడం లేదు. మరోపక్క చట్టాలేమో వారికి సత్వరమే పరిహారం అందించలేకపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితులపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై వెల్లడైన అధికారిక లెక్కలు కొంత ఆశావహంగాను.. ఆ వెనువెంటనే ఆందోళనగానూ కనిపించాయి. ప్రమాదాల సంఖ్య తక్కువగా నమోదవడం ఆశావహ దృక్పథాన్ని పెంపొందించగా... మృతుల సంఖ్య పెరుగుతోందన్న సమాచారం ఆందోళనను రేకెత్తిస్తోంది. ప్రమాదాల నివారణకు రహదారులను చక్కదిద్దటంతోపాటు వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టాల్సి ఉందని ఈ సందర్భంగా నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాద సమయంలో క్షతగాత్రులకు తొలిగంట అత్యంత కీలకం. ఆ గంట వ్యవధిలో సరైన వైద్యం అందజేస్తే చాలావరకు ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయనేది వైద్య నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం అలాంటి సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెస్తున్న సురక్షిత రాష్ట్ర రహదారి రవాణా చట్టం-2019తో కొంత మార్పు రావచ్చు. రహదారి భద్రతకు మొబిలిటీ వింగ్స్‌, రోడ్‌ సేఫ్టీ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయటం ద్వారా రహదారులపై నిరంతర నిఘా ఉంటుంది. అదే జరిగితే ప్రమాద బాధితులకు వేగంగా వైద్యం అందే అవకాశం లభిస్తుంది.

పరిహారానికి ఇదేం లెక్క?
ప్రమాదాల్లో మృత్యువాతపడిన సామాన్యులకు పరిహారం అందజేయడంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కనీస వేతన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇది కాగితాలకే పరిమితమైంది. కేంద్ర నిబంధనల మేరకు ఒక వ్యక్తి రోజువారీ కనీస వేతనం సగటున రూ.230. రహదారి ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం చెల్లించేందుకు ఆ మొత్తంలో రూ.100 మాత్రమే అతడి ఆదాయంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మూడింటిలో ఒక వంతు సొంత అవసరాలకు పోను మిగిలిన రెండొంతుల మొత్తాన్ని కుటుంబ పోషణకు వినియోగిస్తున్నట్లు భావించి పరిహారాన్ని లెక్కిస్తున్నారు. ఇది ఎంత వరకు సబబు అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.

దశాబ్దాల కిందటి శిక్షలు
రహదారి ప్రమాదాలపై ఐపీసీలోని 304(ఎ), 279, మోటారు వాహన చట్టంలోని 134(ఎ), (బి), 187 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ కింద నమోదు చేసిన కేసుల్లో నేరం రుజువైతే వాహన చోదకుడికి రెండు నుంచి ఆరేళ్ల పాటు జైలు శిక్ష పడుతోంది. అదే మోటారు వాహన చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో.. బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ శిక్షలు దశాబ్దాల కిందట నిర్ణయించినవి. నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి నిండు జీవితం ఒక్కసారిగా అంతమవడానికి కారణమైన వ్యక్తిపై హత్య కేసు ఎందుకు నమోదు చేయరన్న ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

శిక్షలు అరుదే
అధిక శాతం కేసుల్లో శిక్షలు పడే సందర్భాలు అరుదే. ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యమే కీలకం. చాలా కేసుల్లో సాక్ష్యం వీగిపోతుండటంతో వాహనచోదకులకు శిక్షలు పడటం లేదు. చనిపోయిన వ్యక్తిపోగా, తన సాక్ష్యంతో వాహనచోదకుడికి జైలు శిక్ష పడితే ప్రయోజనం ఏమిటిలే అన్న ధోరణితో అధిక శాతం కేసుల్లో సాక్షులు ముందుకు రావటం లేదన్న అభిప్రాయాలున్నాయి. కొన్ని కేసుల్లో లోపాయికారీ ఒప్పందాలు సైతం కారణం.

పరిహారానికి కనీసం మూడేళ్లు
ప్రమాదాల్లో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు పరిహారం అందటానికి కనీసం మూడు సంవత్సరాలకుపైగా పడుతోంది. కొన్ని సందర్భాల్లో అయిదేళ్లు దాటుతోంది. పరిహారం రావడానికి బాధిత కుటుంబ సభ్యులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బాధిత కుటుంబాల్లో చదువుకున్న వారు లేకపోయినా, పెద్ద దిక్కు లేకపోయినా వారి కేసుల్లో వచ్చే పరిహారంలో సింహ భాగం మధ్యవర్తులే జేబులో వేసుకుంటున్నారు. నామమాత్రపు సొమ్ము మాత్రమే బాధితులకు అందుతోందన్న ఆరోపణలున్నాయి. తొలినాళ్లల్లో ప్రమాదాల్లో మృతి చెందితే వారి కుటుంబానికి రూ.25 వేలు పరిహారంగా ఇచ్చే వారు. 1987లో రూ.50 వేలకు పెంచారు. అలాగే గతంలో ప్రమాదం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి వెళ్లి కేసు నమోదు చేయాల్సి వచ్చేది. 1994లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణతో కొంత సౌలభ్యం ఏర్పడింది. కన్యాకుమారిలో జరిగిన ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లా మారుమూల తండాకు చెందిన వ్యక్తి మృతి చెందితే పరిహారం కోసం అక్కడికి వెళ్లే పని లేకుండా ఆదిలాబాద్‌ జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయవచ్చు.

విదేశాల్లో చట్టాలు కఠినం
రహదారి భద్రత విషయంలో భారతదేశం మినహా ప్రపంచంలో అధిక శాతం దేశాల్లో కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడిప్పుడే రహదారి భద్రతపై ప్రభుత్వాలు కదులుతున్నాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే రహదారి భద్రతా చట్టాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయత్నం ప్రారంభించింది.

అతిక్రమణ, ప్రమాద తీవ్రత ఆధారంగా పాయింట్లు
అమెరికా, బ్రిటన్‌లతోపాటు పలు దేశాల్లో ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణను గుర్తించేందుకు పాయింట్ల విధానం అమలులో ఉంది. ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ, ప్రమాద తీవ్రత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. పాయింట్లు పెరిగే కొద్దీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌కు చేరువ అయినట్లే. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తే డిఫెన్స్‌ డ్రైవింగ్‌ కోర్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అపరాధ రుసుము కూడా వంద డాలర్ల నుంచి వెయ్యి డాలర్ల వరకు ఉంది. ఒక్కో రాష్ట్రంలో నిబంధనలు ఒక్కో రకంగా ఉన్నాయి. మద్యం, మత్తుపదార్థాల ప్రభావంతో వాహనాలు నడిపి పట్టుపడిన పక్షంలో భారీగా అపరాధ రుసుము విధిస్తున్నారు. మత్తులో వాహనం నడిపి ఆస్తి, ప్రాణనష్టం జరిగితే రెండు నుంచి పదేళ్లపాటు జైలు శిక్ష ఉంటుంది. శిక్షలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేవు. గరిష్ఠంగా ఏడాదిన్నరలోగా ప్రమాదం కేసును పరిష్కరిస్తున్నారు.

బ్రిటన్‌లో 14 ఏళ్ల జైలు

బ్రిటన్‌ దేశంలో ప్రమాదకరంగా లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మృతికి కారణమైన పక్షంలో ఆ వాహన డ్రైవర్‌కు కనీసం రెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమిస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుమును విధిస్తారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన మార్గాల్లో సైకిల్‌ నడిపితే 500 పౌండ్ల అపరాధ రుసుము వసూలు చేస్తారు. వివిధ అతిక్రమణల కింద వెయ్యి నుంచి అయిదు వేల పౌండ్ల వరకు అపరాధ రుసుమును విధిస్తారు. అధిక శాతం కేసులు నెలల వ్యవధిలోనే పరిష్కరిస్తారు.

పొలానికి వెళ్లాలన్నా రోడ్డు దాటి వెళ్లాలి

ఊరుమీదుగా జాతీయ రహదారి వెళ్తోంది. ఊరి వాళ్ల కోసం అండర్‌ పాస్‌ కడతామన్నారు. కట్టలేదు. పొలానికి వెళ్లాలన్నా రోడ్డు దాటి వెళ్లాలి. ప్రతిదానికి జాతీయరహదారి దాటి వెళ్లాల్సిందే. అలా వెళ్తుండగా 2017లో మా నాన్నను కారు ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోజు సాయంత్రానికే డ్రైవర్‌కు స్టేషన్‌ బెయిలు ఇవ్వటంతో అతను వెళ్లిపోయినట్లు బంధువులు చెప్పారు. పరిహారం ఇంకా రాలేదు. కేసు కోర్టులో ఉంది. కారుకు బీమా కూడా లేదని చెప్పారు. పరిహారం ఎలా ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో తెలియదు.

- ముత్యాల సాయికుమార్‌, కట్టంగూర్‌

కూలి పనే దిక్కు

నా భర్త ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేటోడు. కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. జీవనాధారం పోయింది. ముగ్గురు పిల్లలను పోషించేందుకు కూలి పనికి వెళ్తున్నా. పైసలొస్తాయని వకీలు కోర్టులో వ్యాజ్యం వేస్తున్నట్లు చెప్పారు. ఒకసారి కోర్టుకు కూడా పోయొచ్చినా. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది. ఇంత వరకు పైసలు ఏమీ రాలేదు. చదువుకోకపోవటంతో ఎక్కడికి వెళ్లి ఏమని అడగాలో తెలవది. పిల్లలేమో చిన్నోళ్లు.

- రాయపల్లి నిర్మల, వట్టిమర్తి

ప్రత్యేక న్యాయస్థానాలతో సత్వర న్యాయం

ప్రమాదాల వ్యాజ్యాల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరగాలంటే ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరితే ఈ దిశగా ఏర్పాటుకు అవకాశాలున్నాయి. ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు రాష్ట్ర స్థాయిలోనా, మునుపటి జిల్లాల ప్రాతిపదికనా అన్నది రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు నిర్ణయించాల్సిన అంశం.

- కె.రామకృష్ణారెడ్డి, తెలంగాణ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.