Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మిద్దె పంటకు ప్రోత్సాహం 

ఇంటి భవనాలపై కూరగాయలు పండించేందుకు రాయితీ 
బ్యాంకుల నుంచి వ్యవసాయ పంటరుణం కింద రూ.30 వేలు 
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇళ్లపై 55 వేల ఎకరాల స్థలం 
అందరూ సాగుచేస్తే నగరానికి పుష్కలంగా కూరగాయలు 
నగరంలో అమ్ముతున్నవాటిలో 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాలవే 
ఈనాడు - హైదరాబాద్‌

మీ ఇంటి భవనంపై ఖాళీ స్థలం ఉందా?...ఉంటే అక్కడ కూరగాయలు పండించడానికి రూ.30 వేల రుణం బ్యాంకు ఇస్తుంది. దీనిని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. అంతేకాకుండా మొక్కలకు అవసరమైన కుండీలు, విత్తనాలు, ఎరువులు వంటివాటికి రూ.3 వేలకు పైగా ఉద్యానశాఖ రాయితీగా ఇస్తుంది. ఈ మొక్కలకు నీరు పోసి రోజూ కాసేపు గడిపితే మీకు వ్యాయామం లభిస్తుంది. అవి ఏపుగా పెరిగితే మీ ఇంటి చుట్టుపక్కల పచ్చదనంతో పాటు ప్రాణవాయువు(ఆక్సిజన్‌) అధికమై మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా...వీటన్నింటినీ వదిలేసి ఎక్కడో సుదూర రాష్ట్రాల్లోని తోటల్లో విషపూరిత రసాయనాలతో పండించి హైదరాబాద్‌కు తరలించి అమ్ముతున్న వాటినే మీరు రైతుబజార్లు, ఇతర మార్కెట్లలో కొని వండుకుని తింటున్నారు. వాటి నాణ్యత, తాజాదనం తక్కువ. పైగా రసాయనాలతో పండించినందున వాటిని తింటే కడుపులో మంట...అజీర్ణం. వీటినే వండుకు తిందామా...లేదంటే చక్కటి ఆరోగ్యాన్నిచ్చే తాజా కూరగాయలను ఇంటిపై పండించుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది.
 

కిలో రూ.50కి పైనే... 
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిలో రూ.10 నుంచి రూ.20కి దొరికే టమాటాలను చిల్లర దుకాణాల్లో రూ.50 నుంచి 60 దాకా అమ్ముతున్నారు. మంగళవారం బోయిన్‌పల్లి మార్కెట్‌లో టోకు ధర కిలో రూ.50 ఉండగా గతేడాది సరిగ్గా ఇదే రోజు రూ.14 మాత్రమే. క్వింటా ధర అప్పటితో పోలిస్తే ఏకంగా రూ.3,600 అదనంగా పెరగడం వల్ల చిల్లర మార్కెట్‌లో కిలో ధర రూ.60కి చేరినట్లు మార్కెటింగ్‌ శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది.  పలు రకాల కూరగాయల ధరలు 100 నుంచి 200 శాతానికి మించి పెరగడంతో కొనలేక సామాన్యులు అల్లాడుతున్నారు.

 

అన్నీ ఇతర రాష్ట్రాల నుంచే... 

కూరగాయల ధరల మంటపై మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ధరలు ఎందుకు పెరిగాయనేది విశ్లేషించింది. తెలంగాణ జిల్లాలు, ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ టోకు మార్కెట్లకు ఎంతెంత వస్తున్నాయనే దానిపై ఈ అధ్యయనంలో తేల్చింది. గత వారం రోజులుగా మార్కెట్లకు వచ్చిన వాటిలో పలు రకాలు 80 నుంచి 100 శాతం వరకు ఇతర రాష్ట్రాలవేనని తేలింది. ఉదాహరణకు ఈ నెల 20న బోయిన్‌పల్లి మార్కెట్‌కు 548 క్వింటాళ్ల పచ్చిమిరప కాయలు అమ్మకానికి  వచ్చాయి. వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్క శాతం కూడా తెలంగాణవి లేవు. తెలంగాణ రైతులు తెచ్చినవి 0.73 శాతం, ఏపీ రైతులవి 3.24 కాగా మిగిలిన 96.03 శాతం ఇతర రాష్ట్రాలవేనని వెల్లడైంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2018 మే 20న ఇదే మార్కెట్‌కు వెయ్యి క్వింటాళ్ల పచ్చిమిరప వస్తే ఈ ఏడాది అందులో సగమే రావడంతోపాటు అవీ ఇతర రాష్ట్రాలవే.  బీన్స్‌, చిక్కుడు వంటివైతే వందశాతం ఇతర రాష్ట్రాలవే.

 

ఇంటిపైనే పండిస్తే.... 
ఇంటిపై కూరగాయలు పండిస్తే చెట్లతో పచ్చదనం, ఆక్సిజన్‌ పెరగడమే కాకుండా రసాయనాలు లేని తాజా కూరగాయలు ప్రతి రోజూ లభిస్తాయి. ఇంటి ఆవరణలో ఒక చెట్టు పెరిగితే గంటకు సగటున 5 గ్రాముల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 
ఇంటిపై తక్కువ స్థలం ఉంటే ‘నిలువు సేద్యం’(వర్టికల్‌ గార్డెన్‌) విధానంలో కూరగాయల మొక్కలు పెంచవచ్చు. ఇలా పెంచే విధానాన్ని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో అభివృద్ధి చేశారు.

రాయితీని రూ.3,400 వరకు పెంచుతున్నాం 
అధిక ఎండలు, వర్షాభావం వల్ల కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మాట వాస్తవమే. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి భవనంపై కూరగాయలు పండించడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇప్పటికే నగరంలో 4,330 ఇళ్లపై 14,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 22లక్షలకు పైగా భవనాలున్నాయి. వీటిపైన ఉన్న స్థలం దాదాపు 55 వేల ఎకరాలకు సమానం. ఇందులో పండిస్తే నగర ప్రజలకు రోజూ పుష్కలంగా తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్‌ నుంచి బ్యాంకు రుణం ఇస్తారు. రాయితీ రూ.3 వేల నుంచి 3,400కు పెంచుతున్నాం.

- వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.