close

ప్ర‌త్యేక క‌థ‌నం

పల్లే కదా స్వర్గసీమ

అభివృద్ధికి పంచాయతీల్లో ఎన్నెన్నో అవకాశాలు
  దేశంలో 27 లక్షల మంది ప్రజాప్రతినిధులుండేది గ్రామాల్లోనే
  మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు లేకున్నా పనులు చేయించవచ్చు
  19 రాష్ట్రాల్లోని 500 పంచాయతీలను దత్తత తీసుకుంటాం
‘ఈనాడు’ ముఖాముఖిలో ఎన్‌ఐఆర్‌డీ, పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి

అద్భుతాలు సృష్టించేందుకు గ్రామ పంచాయతీల్లో ఎన్నెన్నో అవకాశాలున్నాయని, తెలంగాణలోని గంగదేవిపల్లితో సహా వివిధ రాష్ట్రాల్లోని కొన్ని పంచాయతీలు ఆ దిశలో పయనిస్తున్నాయని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ, పీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేవని దిగులు చెందాల్సిన అవసరం లేదని, వివిధ శాఖల సహకారంతో పలు రకాల పనులను చేయించవచ్చని ఆయన విశ్లేషించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను (జీపీడీపీ) ఏవిధంగా రూపొందించాలో చెప్పేందుకు 19 రాష్ట్రాల్లోని 500 పంచాయతీలను దత్తత చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధిలో జీపీడీపీలు అత్యంత కీలక భూమిక వహిస్తాయన్నారు. తెలంగాణలో ఇటీవలే పంచాయతీ పాలకవర్గాలు కొలువుతీరాయి. త్వరలో మండల, జిల్లా పరిషత్‌ పాలక వర్గాలు రాబోతున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

* పంచాయతీరాజ్‌ సంస్థలపై ఎన్‌ఐఆర్‌డీ దేశవ్యాప్తంగా పలు అధ్యయనాలు నిర్వహిస్తోంది. పంచాయతీలు మెరుగ్గా పనిచేయాలంటే పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఏవిధంగా వ్యవహరించాలి.
రాజ్యాంగంలోని 73,74 సవరణల తర్వాత పంచాయతీరాజ్‌ సంస్థల ప్రాధాన్యం చాలా పెరిగింది. నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయటం, మూడంచెల వ్యవస్థ, 29 అంశాలపై అధికారాలను పంచాయతీలకు బదలాయించటం వంటివి రాజ్యాంగం కల్పించింది. వీటన్నింటినీ అన్ని రాష్ట్రాలు యథాతథంగా అమలు చేయకున్నా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం కొన్ని అంశాలను ఆచరణలోకి తెచ్చి వ్యవస్థను పరిపుష్టంచేశాయి. ఇటువంటి కారణాల వల్లనే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రూ.2.5 లక్షల కోట్ల నిధులు నేరుగా వస్తున్నాయి.

* ప్రభుత్వాల ఖర్చులో పంచాయతీలకు వెళ్లే వాటా దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో మెరుగ్గా ఉంది. చైనాలో అటువంటి వాటా 50 శాతం మేర ఉంటోంది. భారత్‌లో అది నామమాత్రంగా ఒక శాతం మేర మాత్రమే ఉంది.
రాష్ట్రాలు ఆర్థిక సంఘాలను సకాలంలో ఏర్పాటు చేయటంలేదు. ఒక వేళ ఏర్పాటు చేసినా వాటి సిఫార్సులను అమలు చేయటంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఇటువంటి వైఖరి పోవాలి. గ్రామపంచాయతీని పునాది స్తంభంగా భావించి విధులు, నిధులు, సిబ్బందిని సమకూర్చి, తగిన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందిస్తే గ్రామాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు.

* 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల నిధులన్నీ నేరుగా పంచాయతీలకే వెళ్తుండటంతో తాము ఎటువంటి పనులు చేయలేకపోతున్నామని  మండల, జిల్లా పరిషత్‌ల ప్రతినిధులు నాలుగేళ్లుగా చెబుతున్నారు. ఈ పరిస్థితిపై  అధ్యయనం చేశారా?
స్థానిక ప్రభుత్వాలకు ప్రజలతో నేరుగా సంబంధాలుండి,  ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది గ్రామ పంచాయతీల్లోనే. అటువంటి వాటికి ఇప్పుడు నిధులు నేరుగా వెళ్తుండటం వల్ల ఎక్కువ పనులను చేపట్టేందుకు వీలవుతుంది. మునుపటిలా వాటాలందనంత మాత్రాన మండల, జిల్లా పరిషత్‌లు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లు వంటి పనులను మండల పరిషత్‌లు.. పలు మండలాలకు ఉపయోగపడే మార్కెట్‌ యార్డులు వంటి పనులను జిల్లా పరిషత్‌లు ఆయా శాఖల సమన్వయంతో చేపట్టవచ్చు.

* స్థానిక సంస్థల పాలకవర్గాలు కేవలం రోడ్లు వంటి పనులతోనే సరిపెడుతున్నాయి. సామాజిక న్యాయంపై ఎక్కడా దృష్టి సారించటం లేదు. వీటిపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే యోచన ఉందా?
రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాల ఆర్థికాభివృద్ధితో పాటుగా సామాజిక న్యాయం అంశాలకూ తగు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాలికా విద్యను ప్రోత్సహించటం, వృద్ధుల సంక్షేమం, సమానత్వం వంటి ఎన్నో సామాజిక అంశాలను నిధుల ప్రమేయం లేకుండానే గ్రామాల్లో చేపట్టవచ్చు. దేశవ్యాప్తంగా పంచాయతీల్లో ఇప్పుడు 27 లక్షల మంది ప్రజా ప్రతినిధులున్నారు. మధ్య, జిల్లా స్థాయి పంచాయతీల ప్రతినిధులు మరో 1.5 లక్షల మంది ఉంటారు. వీరందరిలో 45 శాతం మంది మహిళలున్నారు. వీరిద్వారా సామాజిక న్యాయ అంశాలను అమలు చేయటం కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాం. క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేవారికి సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తూ ఇంతవరకు 5వేల మందిని తీర్చిదిద్దాం. తెలంగాణలోని సర్పంచులందరికీ శిక్షణ పూర్తయ్యింది. వార్డు సభ్యులకు సైతం శిక్షణ కోసం ప్రణాళికను రూపొందిస్తాం.

* గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ప్రకటించటమే తప్ప వాటిలో వారు చేసేదేమీ ఉండటం లేదు. దత్తత గ్రామాల్లో వారు ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది?
దత్తతను ప్రకటించినవారు ఆయా గ్రామాలపై శ్రద్ధ చూపాలి. వారంలో కనీసం ఒక రోజైనా గ్రామాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న కార్యక్రమాలను పరిశీలించాలి. ఎంపీల దత్తత గ్రామాల్లో గ్రామానికి ఇద్దరి చొప్పున మేం శిక్షణ ఇచ్చాం.  ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల్లో విధుల పట్ల అంకిత భావాన్ని పెంపొందించటం కోసం మా వద్దకు శిక్షణకు వచ్చేవారిందరికీ శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ ద్వారా అయిదు రోజుల పాటు (రోజుకు రెండు గంటలు) యోగ, ధ్యానం, స్మైలింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. గత రెండేళ్లుగా ఇది చేస్తున్నాం.

* పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ మొక్కుబడి తంతుగా మారింది. వీటిని సంస్కరించే యోచనేదైనా ఎన్‌ఐఆర్‌డీకి ఉందా?
గ్రామాల అభివృద్ధిలో జీపీడీపీల పాత్ర అపారం. అయిదేళ్లకు అవసరమయ్యే ప్రణాళికను తయారు చేసుకొని నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా వాటిలోని పనులను చేపట్టే విధానం ఉంటే గ్రామాలు సత్వరం అభివృద్ది చెందుతాయి. దేశవ్యాప్తంగా ప్రణాళికలను పొందుపర్చేందుకు ఉద్దేశించిన యాక్షన్‌ ప్లస్‌ సాఫ్ట్‌వేర్‌లో నాణ్యత అవసరం. అందువల్ల ఈ అంశాలను మేం స్వీకరించదలచాం. దీని కోసం 19 రాష్ట్రాల్లోని 500  పంచాయతీలను దత్తత చేసుకోబోతున్నాం. వాటి ప్రణాళికలను తయారు చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం.

* ఏ తరహా పంచాయతీకి ఎంత మంది ఉద్యోగులుండాలో చెప్పే సిఫార్సులేమైనా ఉన్నాయా
పంచాయతీల్లో సిబ్బంది ఏమేరకు ఉండాలనే అంశంపై ఇటీవల 29 రాష్ట్రాల్లో అధ్యయనం చేశాం. నివేదిక త్వరలో వస్తుంది. పట్టణాలకు సమీపంలో ఉండే, కొండ ప్రాంతాల్లో ఉండే పంచాయతీలకు సిబ్బంది నియామకాల్లో తేడాలుంటాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌లో సరిపడినంత  సిబ్బంది ఉన్నారు. కర్ణాటకలో పంచాయతీ అభివృద్ధి అధికారి ఉంటారు. తెలంగాణలో ఇటీవలే ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శి చొప్పున నియమించారు. వారందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పంచాయతీలు సొంత రాబడులను పెంచుకునే మార్గాలు..

పంచాయతీల పాలకవర్గాలు దృష్టిసారిస్తే సొంత రాబడులను పెంచుకునే మార్గాలు లేకపోలేదు. కేరళలో ఒక్కో పంచాయతీ సొంత రాబడి ఏడాదికి రూ.ఒక కోటికి పైగానే ఉంటోంది. ఒడిశాలోని ముకుందాపురం మహిళా సర్పంచి తమ గ్రామంలోని ఆలయం వద్ద 40 వరకు గదులతో ఒక దుకాణసముదాయాన్ని నిర్మించారు. నెలకు రూ.లక్షకు పైగానే సొంత రాబడి వస్తోంది. మేఘాలయలోని మొలింగ్‌నామ్‌ ఒక గిరిజన గ్రామం. పర్యాటకులు అధికంగా వస్తుంటారు. అక్కడి పంచాయతీవారు అతిథిÅ గృహాన్ని కట్టించి నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలు గ్రామాల్లో జాతరలు జరగుతుంటాయి. అలాంటి చోట పంచాయతీలు రాబడులు పెంచుకొనే చర్యలు తీసుకోవచ్చు.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.