Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అన్నీ తానై... భాజపా..

మిత్రపక్షాలను గెలిపించిన మోదీ
గ్రామీణ భారతంలో సరికొత్త ఓటు బ్యాంకు
ఫలించిన జాతీయవాదం.. ప్రచార వ్యూహాలు
రూ. 5వేల కోట్లతో ప్రభుత్వ పథకాల ప్రచారం
ఈనాడు, దిల్లీ, ఎన్నికల విభాగం

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒక్కటే నినాదం.. ‘నమో నమామి’. ప్రత్యర్థులంతా ఒక్కటై  పోరాడినా, తాను నమ్ముకున్న మిత్రుల అండతో ఒంటరి పోరాటం చేశారు. సరికొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవడం.. తనపై అపారమైన నమ్మకాన్ని కలిగించడం.. నిజాయతీపరుడన్న ముద్ర.. బ్రహ్మాండమైన మార్కెటింగ్‌ నైపుణ్యం.. వీటన్నింటితో ఎన్డీయేను భారీ ఆధిక్యంతో మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. విపక్షాల విమర్శలను అధిగమించి రికార్డుస్థాయి ఆధిక్యం సంపాదించినది నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీయే!

కాశీవాసులకు ధన్యవాదాలు. ఈ పవిత్రభూమికి సేవ చేయడం నాకు దక్కిన వరం. లోక్‌సభలో మరోసారి కాశీకి ప్రాతినిధ్యం వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కాశీ అభివృద్ధికి మనందరం కలిసి పనిచేద్దాం. కాశీలోని భాజపా కార్యకర్తలు చాలా శ్రమించారు. వారందరికీ కృతజ్ఞుడినై ఉంటాను.

- మోదీ ట్వీట్‌

నిజాయతీపరుడైన ప్రధానిగా నరేంద్ర  మోదీకి గట్టి ముద్ర పడింది. రఫేల్‌ కొనుగోళ్ల ఒప్పందంలో ఆరోపణలొచ్చినా వాటిని నమ్మినవారు తక్కువే. అందుకే చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసేందుకు వెనుకాడారు. భాజపా కూడా తమది మోదీ పార్టీ అని చెప్పుకొనేంతగా పరిస్థితులు మారాయి. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేసినా.. వాటికి పెద్దగా ఆధారాలు లేకపోవడంతో ఆ ప్రభావం సామాన్య ప్రజల్లో కనిపించలేదు. మోదీ అవినీతికి పాల్పడలేదన్న విషయాన్ని అత్యధిక శాతం ప్రజలు నమ్మడం వల్లే భాజపాకు ఇంత భారీ విజయం సాధ్యమైంది. తనకు, వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థులకు మధ్య స్పష్టమైన తేడాను మోదీ చూపించారు. అభ్యర్థుల మీద ఎక్కడైనా ఆగ్రహం ఉన్నా, మోదీ రాకతో అవి కొట్టుకుపోయాయి. గ్రామీణ ప్రాంతంలో మోదీకి సరికొత్త ఓటుబ్యాంకు ఒకటి వచ్చిపడింది. గడిచిన అయిదేళ్లలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలు తదితర కార్యక్రమాల ద్వారా భాజపా బాగా లబ్ధిపొందింది. ‘తల మీద నీడ’ ఒకటి ఉంటే చాలన్న భావన  గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉంటుంది. దాన్ని మోదీ సర్కారు ముందునుంచి గ్రహించి ఆ దిశగా బాగా కృషిచేసింది. ఉజ్వల యోజనలో గ్యాస్‌ కనెక్షన్లు, కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఒక్కో విడతకు రూ. 2వేల నగదు రైతుల ఖాతాల్లో పడటం లాంటివి గ్రామీణ ఓటర్లను భాజపావైపు మార్చాయి.

నెహ్రూ, ఇందిర తర్వాత

భారతదేశ చరిత్రలో నెహ్రూ, ఇందిర తర్వాత పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన నాయకుడు నరేంద్రమోదీ. 1951-52 ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి 489కి గాను 364 స్థానాలొచ్చాయి. ఆ తర్వాత 1957, 1962 ఎన్నికల్లోనూ ఆయన పార్టీని గెలిపించారు. 1967 ఎన్నికల్లో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 520కి గాను 283 స్థానాలు సాధించారు. 1971లో ఆమె 352 స్థానాలు సాధించి రెండోసారి అధికారం చేపట్టారు. ఇపుడు మోదీ కూడా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా భాజపా, మిత్రపక్షాలకు ఆధిక్యం సాధించిపెట్టి రెండుసార్లు అధికారం చేపట్టారు. 

సవాళ్లను అధిగమించి..

ఎన్నికలకు ముందు.. 2018 చివర్లో నరేంద్రమోదీకి రెండు సవాళ్లు ఎదురయ్యాయి. అవి.. పంటలకు మద్దతుధర లేక రైతులు నిరాశా నిస్పృహలకు లోనుకావడం, అగ్రవర్ణాల్లో అసంతృప్తి. ఉత్పత్తి ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా కనీస మద్దతుధర నిర్ణయిస్తామని చెప్పిన భాజపా దాన్ని అమలు చేయలేకపోవడంతో రైతులు ఉద్యమాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు చెప్పినా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడంతో అగ్రవర్ణాల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ప్రకటించిన వరాలతో ఈ నష్టం చాలావరకు తగ్గింది. ‘కిసాన్‌ సమ్మాన్‌’ కింద రెండు వాయిదాల సొమ్ము రైతుల ఖాతాల్లో పడటంతో ఆ వర్గంలో అసంతృప్తి దూరమైంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించడం వారి ఆగ్రహాన్ని చల్లార్చింది. 

బీసీలలో కొన్ని వర్గాల అండ

దేశంలోని బాగా వెనకబడిన తరగతుల వారు.. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ లాంటి రాష్ట్రాలలోని యాదవేతర వెనకబడిన వర్గాలు అండగా నిలబడడం కూడా ఎన్డీయే మరోసారి అధికారం దక్కించుకోడానికి ప్రధాన కారణంగా నిలిచింది. కొన్ని రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాలలో కొందరు కూడా భాజపా, మిత్రపక్షాల వైపు మొగ్గు చూపించారు. భాజపాకు సంప్రదాయ ఓటర్లయిన అగ్రవర్ణాల ఓటుబ్యాంకు యథాతథంగా నిలబడటంతో పాటు.. ఈ వర్గాల నుంచి కొత్తగా ఓట్లు పడటం ఎన్డీయేకు అదనపు బలమైంది. ఇదే ఆ కూటమికి రెండోసారి అధికారం దక్కడంలో కీలకపాత్ర పోషించింది.

అపారమైన మార్కెటింగ్‌ నైపుణ్యం

చేసిన పని చెప్పుకోవడం పెద్ద కళ. మోదీకి ముందు కూడా చాలామంది ప్రధాన   మంత్రులు అనేక కార్యక్రమాలు చేశారు. పీవీ నరసింహారావు లైసెన్సుల బంధనాలు తెంచి భారత మార్కెట్లను విదేశీ సంస్థలకు తెరిచారు. వాజ్‌పేయీ ప్రభుత్వం అమెరికాతో కొత్త సంబంధాలు సృష్టించుకుంది. పౌర అణు ఒప్పందం, ఉపాధి హామీ మన్మోహన్‌ హయాంలో వచ్చిన మేలి మలుపులు. కానీ వారెవ్వరూ మోదీ చేసుకున్నంత ప్రచారం చేసుకోలేకపోయారు. గడిచిన అయిదేళ్లలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి మోదీ సర్కారు రూ. 5వేల కోట్లు ఖర్చుపెట్టింది. మోదీ తన విదేశీ పర్యటనలను కూడా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. దీనివల్ల.. విదేశాల్లో భారతదేశ పరువు ప్రతిష్ఠలను పెంచింది మోదీయేనన్న భావన వచ్చింది.

హిందువుల నాయకుడిగా గుర్తింపు

దేశంలో ముస్లింల జనాభా 20% దాటిన నియోజకవర్గాల్లో హిందూ ఓట్ల ఏకీకరణ జరిగింది. అంతకుముందు కులాల వారీగా పార్టీల మధ్య చీలిపోయిన ఓటర్లు గంపగుత్తగా భాజపావైపు మొగ్గారు. ముస్లింల ప్రాబల్య ప్రాంతాల్లో హిందుత్వ సెంటిమెంటును మోదీ మేల్కొలపగలిగారు. ట్రిపుల్‌ తలాఖ్‌ను చట్టవిరుద్ధం చేయడం లాంటివి కూడా హిందూ ఓట్ల ఏకీకరణకు కొంతవరకు దోహదం చేశాయి. తరచూ ఆలయాలను సందర్శించడం, గో సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, కశ్మీరీ వేర్పాటువాదుల విషయంలో కఠిన వైఖరి, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ లాంటి కరడుగట్టిన హిందుత్వవాదులను అభ్యర్థులుగా బరిలోకి దించడం ఇవన్నీ హిందూ ఓట్ల ఏకీకరణకు ఉపయోగపడ్డాయి. 

మధ్యతరగతి ఓట్లన్నీ ఇటే..

దేశంలో మధ్యతరగతి ఓటర్లు 29% వరకు ఉన్నారు. వారిపై మోదీ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రాహుల్‌గాంధీ ‘న్యాయ్‌’ పథకం ఎదురుదెబ్బ తినడానికి భాజపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమే ప్రధాన కారణం. నిరుపేదలకు ఏడాదికి రూ. 72 వేల వరకు ఇస్తామని రాహుల్‌ చెబితే, అందుకు కావల్సిన డబ్బులన్నీ మధ్యతరగతి నుంచే తీసుకుంటారని భాజపా ప్రచారం చేసింది. తాము కార్పొరేట్ల నుంచి పన్నులు వసూలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు, అంతకుముందున్న అల్పాదాయ వర్గాలు ఇటీవలి కాలంలో మధ్యతరగతిగా మారాయి. మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల కల్పనలో మోదీ సర్కారే నయమని ఈ వర్గం భావన. జీవనోపాధికి ఉద్యోగాలే అక్కర్లేదని మోదీ నిరూపించారు. గత అయిదేళ్లలో 4.81 కోట్ల మంది రూ. 2.4 లక్షల కోట్ల ‘ముద్ర’ రుణాలు తీసుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగారు. జీఎస్టీని మరింత సరళతరం చేస్తామని, చిన్న వ్యాపారులు ఈ పరిధిలోకి రారని చెప్పడంతో పాటు ఒక పరిధి వరకు రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఆ విభాగంలో మోదీ ఓటుబ్యాంకు విస్తరించింది. 

మాకు మోదీ.. మీకెవరు?

ఎన్డీయే తరఫున ప్రధాని అభ్యర్థిగా మోదీ కాక మరెవ్వరినీ ప్రస్తావనకు తేలేదు. అదే సమయంలో యూపీయే, తృతీయ కూటమి తమ ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయాయి. యూపీయేకు సొంతంగా ఆధిక్యం వస్తుందో రాదోనన్న అనుమానంతో రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ ధైర్యం చేయలేదు. దీన్ని భాజపా నాయకులు ప్రచారాస్త్రంగా మలిచారు. తమకు ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉన్నారని, విపక్షాలకు ఎవరున్నారని సూటిగా ప్రశ్నించినపుడు దానికి సమాధానం రాలేదు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్‌పవార్‌ లాంటి చాలామంది నాయకులున్నా వాళ్లెవరికీ జాతీయస్థాయి గుర్తింపు లేదు. రాష్ట్రస్థాయికే పరిమితమయ్యారు. అదికూడా మోదీకి అనుకూలంగా మారింది.

రాష్ట్రాలవారీ వ్యూహాలు

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం అమలుచేయడం ద్వారా మోదీ ఘనవిజయం సాధించగలిగారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ముస్లింలకు అనుకూలంగా ఉంటుంది. భాజపా అక్కడ జాతీయవాదాన్ని తలకెత్తుకుంది. ఆ రాష్ట్రంలో తమకు బలమైన నాయకులు లేకపోవడంతో.. వేరే రాష్ట్రాల నుంచి వ్యూహకర్తలను బెంగాల్‌కు పంపారు. ఝార్ఖండ్‌ లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి, రోడ్ల గురించి మోదీ ఎక్కువ ప్రస్తావించారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో గంగా హారతి ఇచ్చి అక్కడి హిందువుల మనోభావాలను సంతృప్తి పరిచారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.