Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

సంఘ్‌ చెక్కిన మేరునగం

ఒంటిచేత్తో   మరోసారి కమలాన్ని  వికసింపజేసిన మోదీ
వాగ్ధాటి... చాణక్య రీతి ఆయన సొంతం

నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ... 
భాజపాకు ఈ పేరు ఇప్పుడు పర్యాయపదం.  పార్టీని రెండోసారి ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చిన, కమలం పార్టీని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిపిన మేరు నగధీరుడు. చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించి... సమున్నత శిఖరాలకు చేరుకున్న కృషీవలుడు. ఇంటాబయటా ఎన్ని విమర్శలు వచ్చినా వెరవకుండా.. వాటినే విజయసోపానాలుగా మలచుకున్న రాజకీయ దురంధరుడు. కట్టిపడేసే వాగ్ధాటి, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే చాణక్యం, సందర్భోచితమైన ఆహార్యం, సాహసోపేత నిర్ణయాలు, విమర్శల్ని దీటుగా తిప్పికొట్టే చతురత, ఆటుపోట్లకు వెరవని ధీరత్వం

... ఇవన్నీ కలిస్తే నరేంద్ర మోదీ

ఎన్డీయే సర్కారును రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే కాకుండా వారణాసిలో భారీ ఆధిక్యం సంపాదించి, ఆయన రికార్డు సృష్టించారు. ఒకప్పుడు దేశంలో భాజపా అంటే వాజ్‌పేయీ, ఆడ్వాణీలు మాత్రమే చప్పున గుర్తుకువచ్చేవారు. ఇప్పుడు మాత్రం పార్టీని మించిన స్థాయిలో వ్యక్తిగత పలుకుబడిని మోదీ దక్కించుకున్నారు.

నలుచెరగులా పార్టీ విస్తరణ
కొంతమందిలా ఆయన ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అంతకన్నా కాదు. ఏరికోరి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తీ కాదు. చిన్నప్పుడు రైల్వేస్టేషన్లలో, ఆర్టీసీ క్యాంటీన్లో టీ విక్రయించడం నుంచి అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గళాన్ని వినిపించి అనేకాంశాల్లో మద్దతు కూడగట్టడం వరకు ఆయన జీవితం మొత్తం వైవిధ్యభరితం. సన్యాసమైనా పుచ్చుకోవాలి, లేదా సైన్యంలోనైనా చేరాలి అని అనుకున్న వ్యక్తి చివరకు దేశంలో ఉన్నత పదవిని అధిష్ఠించడమే కాకుండా కమలం ఉనికిని నలు చెరగులా విస్తరింపజేసి చరిత్రలో స్థానం పొందారు. 2014 ఎన్నికల్లో భాజపాకి సొంతంగా 281, ఈసారి దానిని అధిగమించిన స్థాయిలో స్థానాలు లభించడం వెనక పార్టీ శ్రమతో పాటు ఆయన వ్యక్తిగత పలుకుబడిదీ ప్రధాన భూమికే.

నేరుగా సీఎం బాధ్యతల్లోకి
రాజకీయ పదవుల్లో ఎలాంటి పూర్వానుభవం లేకుండా నేరుగా గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత నరేంద్ర మోదీదే. ఆ పగ్గాలు చేపట్టి, పాలనలో తనదైన ముద్రను వేశాక యావద్దేశం దృష్టి గుజరాత్‌పై పడేలా చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. 2014 ఎన్నికల్లో ఆ అనుభవంతోనే పార్టీ ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 60 ఏళ్లు కాంగ్రెస్‌కు పగ్గాలు అప్పగించారు కాబట్టి 60 నెలలైనా తనకు అవకాశమిస్తే పాలకునిగా కాకుండా ఓ సేవకునిగా పనిచేస్తానని ఆ ఎన్నికల్లో దేశంలో అన్నిచోట్లా మోదీ వినమ్రంగా అర్థించి.. ప్రజల మనసుల్ని గెలుచుకోగలిగారు. తిరుగులేని ఆధిక్యంతో ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయగలిగారు. యూపీయేతో పోలిస్తే తన సర్కారుపై ఒక్క అవినీతి మరకా లేదని, ఉగ్రవాదం పీచమణచడంలోనూ భాజపాయే ముందుందని ధాటిగా చెబుతూ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మరోసారి ప్రజలముందుకు వచ్చి, ఇతర విమర్శలన్నింటినీ బలంగా తిప్పికొట్టి, విజయ మాలను మెడలో వేసుకోగలిగారు.

సాధారణ నేపథ్యం
అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చి, తేనీటిని విక్రయించిన తన మూలాల గురించి మోదీ అనేకసార్లు చెబుతుంటారు. ‘చెంబు ఇస్త్రీ’కి కూడా నోచుకోకుండా దుస్తులను మడతపెట్టి తలగడ దిండు కింద వాటిని ఉంచడం, కనీసం వేడినీళ్ల స్నానానికీ నోచుకోకపోవడం, మురికివాడలోని చుట్టుపక్కలి ఇళ్లలో పనులుచేసి తన తల్లి హీరాబెన్‌ నాలుగురాళ్లు సంపాదించడం వంటివి స్వయానా ఆయనే పలుమార్లు గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి ఉదాహరణలతో తానూ సామాన్యుడినేనని చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకప్పటి బొంబాయి రాష్ట్రం(ప్రస్తుతం గుజరాత్‌)లోని వాద్‌నగర్‌లో పచారీ సామాన్ల విక్రేత కుటుంబంలో ఆయన పుట్టారు. ఎనిమిదో ఏటనే ఆరెస్సెస్‌ విద్యార్థి విభాగంలో చేరిపోయారు. రైల్వేస్టేషన్లో టీ విక్రయించే క్రమంలో తరచూ సైనికుల్ని చూస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత కొన్నాళ్లకు సైనిక్‌ స్కూల్లో చేరాలని ప్రయత్నించినా ఆర్థిక పరిస్థితులు దానికి అంగీకరించలేదు.

అనూహ్యంగా వరించిన సీఎం పదవి

2001లో ఆయన్ని గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పంపించాలని సంఘ్‌ నిర్ణయించింది. ఏమాత్రం పూర్వానుభవం లేని ఆయన ఎంతో తటపటాయింపు తర్వాత అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతి ఏడాదే జరిగిన గోద్రా నరమేధం మచ్చ ఆయన్ని ఇరుకున పెట్టింది. అయినా కుంగిపోకుండా ఎన్నికలకు వెళ్లి, ప్రజాశీర్వాదాన్ని పొందగలిగారు. 2014 మే నెలలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేటంతవరకు సీఎంగా ఎకాఎకి 14 ఏళ్లు కొనసాగి తనదైన ముద్ర వేశారు. దాంతో మైనారిటీల ఆదరణనూ చూరగొన్నారు. 2014లో గుజరాత్‌లోని వడోదరాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచీ ఆయన లోక్‌సభకు పోటీ చేశారు. అక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా, విజయకేతనం ఎగరేసి విమర్శకుల నోళ్లు మూయించగలిగారు. తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేశారు. ఈసారి వారణాసి ఒక్కచోట నుంచే పోటీ చేసి ఘన విజయం సాధించారు.

హిమాలయాల్లో అన్వేషణ 
తన అభీష్టానికి వ్యతిరేకంగా చిన్న వయసులోనే జశోదాబెన్‌ను వివాహం చేసుకోవాల్సి రావడంతో ఇంటిని వదిలిపెట్టి దేశంలో పలు ప్రాంతాల్లో రెండేళ్లపాటు తిరిగారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్న సందేహాలు తన మెదడును తొలిచేస్తుంటే వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలో అంచెలంచెల్లో హిమాలయాల సమీపంలోని ఆశ్రమానికి చేరుకున్నారు. సన్యాసం స్వీకరించాలనుకున్నా అప్పటికి డిగ్రీ లేకపోవడంతో సాధ్యం కాలేదు. మళ్లీ గుజరాత్‌కే వచ్చేసిన ఆయన 1971లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో సేవకునిగా చేరి, దిల్లీ శాఖ వరకు వెళ్లి, అక్కడి ఆదేశాలతో కమలనాథునిగా మారారు. తనదైన పనితీరు, తర్కించే తత్వాలతో అగ్రనేతల దృష్టిలో పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగి దేశమంతటా పర్యటించారు. 

చేదోడుగా ‘అమిత’ ఆప్తుడు
అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడపడంలో మోదీకి అండగా నిలుస్తున్న కీలక నేత... పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా. అత్యంత విశ్వసనీయ స్నేహబంధం వీరి సొంతం. కేవలం పార్టీ హోదాతోనే ప్రభుత్వ కార్యకలాపాల్లో వేలు పెడితే లేనిపోని విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో కమల దళపతిని రాజ్యసభ సభ్యుడిని చేసిన విషయం తెలిపిందే. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోం మంత్రి పదవిని అమిత్‌ షా నిర్వర్తించారు. ఇద్దరూ ఒక జట్టుగా   భాజపాని, ఎన్డీయేని నడిపి వరసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కృతకృత్యులయ్యారు.

ప్రధానిగా సంచలనాల చిరునామా 

* 2014-19 మధ్య ప్రధాని హోదాలో మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనాలకు చిరునామాగా మిగిలిపోయాయి. 2015 డిసెంబరు 25న అఫ్గానిస్థాన్‌ నుంచి వస్తూవస్తూ ఆకస్మికంగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దిగి, అక్కడి ప్రధానమంత్రి (అప్పట్లో నవాజ్‌ షరీఫ్‌) నివాసానికి వెళ్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయన తల్లికి కానుకలిచ్చి ఆశీస్సులు తీసుకున్న నరేంద్రుడే కొన్నాళ్ల తర్వాత అంతే అకస్మాత్తుగా మన సైనిక దళాలతో అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులూ చేయించగలిగారు..! ఆ రెండూ  సంచలనాలే. 
* గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై విపక్షాల నుంచి వచ్చిన విమర్శల్ని తిప్పికొట్టే మాటల కోసం మోదీ ఏమాత్రం తడుముకోలేదు. నల్లధనం బెడద అయినా, బడా పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ అయినా, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం గురించైనా ఆయన దీటుగానే స్పందిస్తూ వచ్చారు. 
* గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీకి వీసాను నిరాకరించిన అమెరికాయే ఆయనకు ప్రధాని హోదాలో ఎర్ర   తివాచీ పరిచి శ్వేతసౌధంలో విందుకు ఆహ్వానించింది.
* యూపీ శాసనసభ ఎన్నికల్లోనే కాకుండా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థికైనా టికెట్‌ ఇవ్వకుండానే పార్టీకి తగిన ఫలితాన్ని రాబట్టడం మరో విశేషం.

రాత్రికి రాత్రి నోట్ల రద్దు 

రూ.500, రూ.1000 విలువైన పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఆకస్మికమైనదే. అజెండాను అత్యంత గోప్యంగా ఉంచి 2016 నవంబరు 8న రాత్రి పూట మంత్రిమండలి సమావేశం, అది పూర్తికాగానే విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అదేరోజు   అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆ నోట్లు ఇక చెల్లవని చెప్పేశారు. అది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. నోట్ల రద్దు తర్వాత నగదు కొరతతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నా మోదీ మాత్రం తన  నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.

జీఎస్టీ

వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) గురించి యూపీయేలోనే బీజం పడినా, రాష్ట్రాలను ఒప్పించి, దానిని ఆచరణలోకి తీసుకురాగలిగిన ఖ్యాతి మాత్రం మోదీకే దక్కుతుందని చెప్పాలి. 
యూపీయే హయాంలో మొగ్గ తొడిగిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకం, ఆధార్‌లను విస్తృతంగా వినియోగించుకోవడం, అనేక పథకాలను ఆ రెండింటితో ముడిపెట్టడంలో ఎన్డీయే ప్రభుత్వం కృతకృత్యమయింది. విపక్షంగా ఉన్నప్పుడు ఈ రెండింటినీ తప్పుపట్టినా, అధికారంలోకి వచ్చాక మాత్రం యూపీయే కంటే విస్తృతంగా వీటిని వినియోగించుకొంది.

చాయ్‌ పే చర్చా, మన్‌ కీ బాత్‌, నీతి ఆయోగ్‌ వంటి పేర్లతో పాటు స్వచ్ఛభారత్‌, బేటీ బచావో... బేటీ పఢావో, డిజిటల్‌ ఇండియా, జన్‌ధన్‌ యోజన, అటల్‌ పింఛన్‌ యోజన, నమామి గంగ, స్వాభిమాన్‌, స్వావలంబన్‌ వంటి అనేక పేర్ల ద్వారా హిందీ భాషపై తనకున్న ఆపేక్షను మోదీ వ్యక్తం చేశారు.

60 దేశాల్లో పర్యటన 

ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలో దాదాపు 60 దేశాల్లో పర్యటించారు. ఆహార్యం నుంచి అన్నింటా ప్రత్యేక ముద్ర కనపడేందుకు ఆయన పడే తపనపై తీవ్ర విమర్శలూ లేకపోలేదు. ఈ పర్యటనలకు రూ.2000 కోట్ల పైచిలుకు ఖర్చు కావడాన్ని విపక్షాలు తప్పుపడుతుంటాయి.

మోదీ జాకెట్‌

అధికారిక, అనధికారిక పర్యటనల్లో మోదీ ధరించే జాకెట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాని పేరే మోదీ జాకెట్‌ అయిపోయింది.

ముఖాముఖిలు మాత్రమే...

సాధారణంగా ప్రధానమంత్రులు అప్పుడప్పుడైనా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ వివిధ అంశాలపై స్పందిస్తూ రావడం రివాజు. మోదీ మాత్రం ప్రత్యేక ముఖాముఖిలు తప్పిస్తే ఒక్కటంటే ఒక్క ప్రెస్‌మీట్‌నైనా అయిదేళ్లలో నిర్వహించలేదు. ఎన్నికల క్రతువు ముగియవస్తున్న తరుణంలో విలేకరుల సమావేశాన్నయితే ఏర్పాటు చేసినా, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యతను తన సరసనే ఉన్న పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాపై వదిలేయడం గమనార్హం.
- ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.