Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మోదీని ఢీకొట్టలేక..

చతికిలబడిన ప్రతిపక్ష పార్టీలు
  కాంగ్రెస్‌కు సహకరించని నాయకులు
  ఫొటోలకే పరిమితమైన విపక్ష ఐక్యత
          కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణ లోపం
ఈనాడు, దిల్లీ

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చడం సాధ్యం కాదు. దాంతో అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం ప్రతిపక్షాలకు సులభం. భాజపాను దునుమాడేందుకు కావల్సినన్ని అవకాశాలున్నా.. కాంగ్రెస్‌ వాటిని సమర్థంగా వాడుకోలేకపోయింది. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనే విజయం సాధించలేని పార్టీ.. అధికారం ఇస్తే ఏం చేస్తుందన్న అనుమానాలు ప్రజలకు తలెత్తడమే కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గోసంరక్షణ పేరుతో హత్యలు, దళితులపై అఘాయిత్యాలు పెరిగినా వాటిపై దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించి, మోదీ సర్కారు మెడలు వంచేలా చేయలేకపోవడం ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనం. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భాజపా లేవనెత్తిన జాతీయతావాదాన్ని అడ్డుకునే సమర్ధ వ్యూహం కాంగ్రెస్‌ వద్ద కనపడలేదు. కొన్ని విషయాల్లో గట్టిగా ఉద్యమించే ప్రయత్నం చేసినా.. మోదీ లాంటి శిఖరసమాన నాయకుడిని ఢీకొనేంత స్థాయిలో అవి లేకపోవడం వల్ల ఆ పార్టీ ఎన్నికల పోరులో నిలబడలేకపోయింది. దానికితోడు మిత్రపక్షాలు కూడా పూర్తిస్థాయిలో కలిసి రాకపోవడం, ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకోవడంతో ప్రతిపక్షాల ఐక్యత అన్నది కాగితాలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో కనిపించలేదు. అది పరోక్షంగా ఎన్డీయే విజయానికి కారణమైంది.

ఎవరికి వారే..
మోదీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు విపక్షాల ఐక్యత పేరుతో జరిగిన తతంగమంతా ఫొటోలకే పరిమితమైంది. తర్వాత ఎవరికి వారుగానే ఉండిపోయారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఝార్ఖండ్‌లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరి రెండోవారం వరకు చాలా పార్టీలు తరచూ దిల్లీలో సమావేశమై, మోదీని ఓడిస్తామని ప్రతినబూనాయి. జాతీయస్థాయిలో పొత్తు, కనీస ఉమ్మడి కార్యక్రమాల గురించి భారీ ప్రకటనలు చేశాయి. అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. బాలాకోట్‌ వైమానిక దాడులు జరిగిన ఒకరోజు తర్వాత.. ఫిబ్రవరి 27న ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశమైనా, ఈ విషయంలో మోదీపై విమర్శలకు పరిమితమయ్యారు తప్ప ఐక్యత దిశగా ముందడుగు వేయలేదు. ఎన్నికల సంఘం మార్చి 10న షెడ్యూలు ప్రకటించే సమయానికి ప్రాంతీయ నాయకులు చంద్రబాబు, మమత, మాయ, అఖిలేశ్‌, శరద్‌పవార్‌ లాంటి వాళ్లంతా సొంత రాష్ట్రాల్లోనే ఉండి అభ్యర్థుల ఖరారుకే పరిమితమయ్యారు. భాజపాయేతర పార్టీలలో చాలావాటికి మోదీని గద్దెదించడమే లక్ష్యమైనా, చాలా రాష్ట్రాలలో అవి పరస్పరం పోటీపడ్డాయి. ఈవీఎంల లాంటి కొన్ని విషయాల్లో చూపించిన ఐక్యత.. ఎన్నికల్లో పోటీ విషయంలో చూపించలేదు. విపక్ష కూటమి వైఫల్యాన్ని చూసిన ఓటర్లు ఎన్డీయే మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని విశ్వసించారు. అదే సమయంలో భాజపా ప్రచారం గట్టిగా సాగింది. నీతిమంతుడైన మోదీపై పోటీకి అవినీతిపరులంతా కలిశారని, వారసులంతా కలిసి ప్రజాస్వామ్యవాదితో ఢీకొంటున్నారని చెప్పింది.

అవినీతి ఆరోపణలు తుస్‌
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందునుంచి ‘మై న ఖావూంగా, న ఖానేదూంగా’ (నేను అవినీతికి పాల్పడను, ఎవరినీ పాల్పడనివ్వను) అని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందంటూ దుమారం లేపాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించింది. సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలుచేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ దానిపై గట్టిగానే పోరాటం చేసింది. కానీ, మోదీ నిజాయతీని నమ్మిన ఓటర్లు.. ఈ ఆరోపణలను నమ్మలేదు. దాంతో ఎన్నికల ప్రచారంలో ‘రఫేల్‌’ పనికిరాలేదు. మోదీ నిజాయతీపరుడన్న ముద్రను నిలబెట్టుకోవడం, కాంగ్రెస్‌ పార్టీకి ఇతర ప్రతిపక్షాల మద్దతు లేకపోవడం అందుకు కారణం. విపక్షాలు తమలో తాము పోటీ పడటం, ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యం చూపించుకోవాలన్న ప్రయత్నం చేయడంతో అవి ఒక్కటిగా ఉండలేకపోయాయి. ప్రాంతీయ పార్టీలలో భాజపాకు దూరంగా ఉన్నవి మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌తో కలవలేదు.  బోఫోర్స్‌ కుంభకోణం ఆరోపణలు వచ్చినపుడు వామపక్షాలు - భాజపా చేతులు కలిపి కాంగ్రెస్‌ అవినీతిపై భారీగా ఉద్యమించాయి. ఇప్పుడు ఈ విషయంలో తాము మద్దతిస్తే ఆ ప్రయోజనం కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందన్నది మిగిలిన పక్షాల భయం. అందుకే అవి మిన్నకున్నాయి.

ప్రధాని అభ్యర్థుల వైఫల్యం
పైకి చెప్పకపోయినా ప్రధాని పదవిపై ఆశపెట్టుకున్న ప్రతిపక్ష నేతలు చాలామందే ఉన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్‌పవార్‌.. వీళ్లంతా ఆ కోవలోనివారే. కానీ వాళ్లు తమ సొంత రాష్ట్రాల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్నారు.కొంతలో కొంత మమతాబెనర్జీయే నయం.

న్యాయ్‌ ఉన్నా వెనుకంజే!
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ‘న్యాయ్‌’ లాంటి బలమైన పథకమున్నా అది ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. మేనిఫెస్టో ప్రకటన ఆలస్యం కావడం, దాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లలేకపోవడం పార్టీ వైఫల్యాలు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని సామాన్య ఓటర్లు నమ్మలేదు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిని 150 రోజులు చేస్తామని, 2020 మార్చికి 22 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని హామీలిచ్చినా, అవి ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తాయి.

వారసత్వమే గుదిబండ
నాయకులకు చాలా సందర్భాల్లో వారసత్వం కలిసొస్తుంది. కానీ ఈసారి రాహుల్‌ గాంధీ విషయంలో అదే పెద్ద గుదిబండగా మారింది. దేశం బలహీనంగా తయారవడానికి, పేదరికంలో మగ్గిపోవడానికి నెహ్రూ-గాంధీ కుటుంబమే కారణమని గత అయిదేళ్లలో భాజపా ప్రచారం చేసింది. ‘పేదరిక నిర్మూలన’ హామీని నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, సోనియా నుంచి ఇపుడు రాహుల్‌గాంధీ వరకు అందరూ ఇచ్చారని.. అయినా 70 ఏళ్లుగా పేదరికం అలాగే ఉందని భాజపా చెప్పిన మాటలు అందరికీ వెంటనే చేరిపోయాయి.


సంస్థాగత బలహీనత

సుదీర్ఘచరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. భాజపాకు సుశిక్షితులైన కార్యకర్తలు, బూత్‌స్థాయి యంత్రాంగం ఇవన్నీ ఉండగా కాంగ్రెస్‌ చాలావరకు సాధారణ ప్రజల మీదే ఆధారపడింది. రాష్ట్రస్థాయి నాయకుల ఆధిపత్యం ఎక్కువ. దీనివల్ల స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయింది. 2018 తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సీనియర్ల స్థానంలో యువతను రాహుల్‌ ప్రోత్సహించారు. తర్వాతి నుంచి పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైంది. క్షేత్రస్థాయి కార్యకర్తలతో రాహుల్‌ నేరుగా సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టినా, అదింకా ప్రాథమిక దశలోనే ఉంది. మరోవైపు భాజపా మాత్రం గడిచిన అయిదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, కేంద్రీకృత యంత్రాంగం, పైనుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు పక్కా సంబంధాలతో అమిత్‌ షా పార్టీని పూర్తిగా బలోపేతం చేశారు. లక్షలాది మంది కొత్త సభ్యులను పార్టీ చేర్చుకుంది. ఇలా ఒకవైపు సొంత పొరపాట్లు, మరోవైపు ప్రత్యర్థి పార్టీ బలం కలిపి కాంగ్రెస్‌ ఓటమికి దోహదం చేశాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.