close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇక దూసుకుపోదాం

లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునాది
6.98 నుంచి 19.45 శాతం వరకు పెరిగిన ఓటింగ్‌ శాతం
తెలంగాణలో పార్టీ బలోపేతంపై భాజపా దృష్టి
ఈనాడు - హైదరాబాద్‌

నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి జోరు మీదున్న కమలదళం ఇక తెలంగాణలో పట్టు పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్‌ కంటే ఒక స్థానం ఎక్కువే రావడం, ఉత్తర తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో పాగా వేయడంతో ఉత్సాహంగా ఉన్న కమలనాథులు రానున్న రోజుల్లో బలపడి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఫలితాలను పునాదిగా చేసుకుని 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధం అవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన భాజపా వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం గోషామహల్‌లో గెలిచిన కాషాయం పార్టీ 6.98 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు ఏకంగా 19.45 శాతానికి పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కేవలం 59 వేల ఓట్లు వచ్చిన భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.01 లక్షలకు పెరిగాయి. మల్కాజిగిరిలో 1.49 లక్షల నుంచి 3.04 లక్షలకు పెంచుకుంది. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 1.46 లక్షల నుంచి.. 3.77 లక్షలకు, కరీంనగర్‌లో 1.02 లక్షల నుంచి 4.98 లక్షలకు, నిజామాబాద్‌లో 92 వేల నుంచి 4.80 లక్షలకు, సికింద్రాబాద్‌లో 1.72 లక్షల నుంచి 3.84 లక్షలకు భాజపా ఓట్లు పెరిగాయి. నిజామాబాద్‌, కరీంనగర్‌ స్థానాల్లో దాదాపు నాలుగేసి లక్షల ఓట్లను భాజపా పెంచుకుంది.
పెద్దపల్లి అభ్యర్థిగా ఎస్‌.కుమార్‌ను ప్రకటించి ఆ తర్వాత బలమైన అభ్యర్థి కోసమంటూ పెండింగ్‌లో పెట్టారు. నామినేషన్ల ఆఖరిరోజున ఖరారు చేశారు. అయినప్పటికీ అక్కడ భాజపా ఓట్లు 20 వేల నుంచి 92 వేల పైచిలుకు వచ్చాయి. నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 12 శాతానికి పైగా ఓట్లు పెరగడం.. 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్లు కోల్పోయిన స్థితి నుంచి.. నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం.. మిగిలినచోట్ల గణనీయంగా ఓట్లు పెరగడం వెనుక పార్టీ అనుసరించిన వ్యూహం ఫలించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మోదీ పేరుతో జనంలోకి
వీలైనన్ని చోట్ల బలమైన, పేరున్న అభ్యర్థులను బరిలోకి దింపిన కమలదళం ఎన్నికల్లో విజయం కోసం మోదీ చరిష్మాను బలంగా నమ్ముకుంది. అసెంబ్లీ ఎన్నికలు.. లోక్‌సభ ఎన్నికలు వేరని.. రాష్ట్రంలో కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారని.. కేంద్రంలో భాజపాకు అవకాశం ఇవ్వాలంటూ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వ పథకాలను భాజపా అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లడం కలిసొచ్చింది. కేంద్రంలో రానున్నది ఎన్డీయే ప్రభుత్వమేనని.. తెరాస 16 సీట్లు గెలిచినా ఉపయోగం ఉండదని.. భాజపా అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రాభివృద్ధికి దోహదం అవుతుందన్న విషయాన్ని కూడా ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు భాజపా అభ్యర్థుల విజయం కోసం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిన స్థానాల్లో వీరు ఎక్కువగా పనిచేశారని పార్టీనేత ఒకరు తెలిపారు. యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం, సామాజిక మాధ్యమాలను విరివిగా వాడటం వంటి అంశాలు భాజపాకు కలిసి వచ్చాయి. తెదేపా పోటీ చేయకపోవడమూ తమకు కొన్నిచోట్ల కలిసి వచ్చిందని భాజపా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘‘ఓవైపు కాంగ్రెస్‌కు ఓటు వేయలేక, మరోవైపు తెరాసను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెదేపా ఓటర్లు భాజపా అభ్యర్థులకు ఓటేశారు. ఆ పరిణామం మాకు కలిసి వచ్చింది దీంతో పాటు సీఎం కేసీఆర్‌ హిందుత్వంపై చేసిన వ్యాఖ్యలు మాకు అనుకూలంగా మారాయి’’ అని ఓ అభ్యర్థి పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు కష్టపడి పనిచేయడం కూడా ఓట్లు, సీట్లు పెరగడానికి దోహదం చేసిందంటున్నారు.

పరిణామాలు మారుతాయ్‌..
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం తెలంగాణలోనే ఉందని భాజపా నాయకత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల కీలక నేతల్ని చేరుకున్న కాషాయం పార్టీ.. తాజా పరిణామాల నేపథ్యంలో తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. కొద్దికాలంలోనే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడతారని రాష్ట్ర నాయకత్వం చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.


 

అమిత్‌షా ‘సర్వే’క్షణ

తెలంగాణలో విజయావకాశాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండు నెలలకు ఒకసారి చొప్పున సర్వేలు చేయించినట్లు సమాచారం. ‘‘గతంలో కనీసం ఒక్కసారి అయినా పార్టీ గెలిచిన స్థానాలు ఏవన్నదీ చూశారు. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో విజయావకాశాలు ఉన్నట్లు పార్టీ గుర్తించింది. అందుకు అనుగుణంగా ఆయా స్థానాలతో పాటు మరో రెండుచోట్ల ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని మోదీ సహా అగ్రనేతలు, కేంద్ర మంత్రుల ప్రచారం ఎక్కువగా అక్కడ జరిగేలా నాయకత్వం చూసింది. మహబూబ్‌నగర్‌లో బలమైన అభ్యర్థి కోసం డి.కె.అరుణను, ఆదిలాబాద్‌లో ఆదివాసీ ఓట్లు గణనీయంగా ఉండటంతో సోయం బాపురావును చేర్చుకుని పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది’’ అని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థి ఒకరు తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.