close

ప్ర‌త్యేక క‌థ‌నం

బాలురూ సమిధలే..! 

రాష్ట్రంలో వారిపైనా లైంగిక అఘాయిత్యాలు 
ప్రబుద్ధుల్లో 90 శాతానికి పైగా సుపరిచితులే

ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ శివారు జల్‌పల్లి వాది-ఎ-ముస్తఫా కాలనీకి చెందిన బాలుడు(7) ఇటీవల రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి సమీపంలోని   దుకాణంలో సాఫ్ట్‌డ్రింక్‌ కొనేందుకు వెళ్లాడు. ఒంటరిగా వెళుతున్న బాలుడిని గమనించిన ఒమర్‌ బిన్‌ హసన్‌ (25) మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. దుస్తులు విప్పి లైంగిక చర్యలకు దిగడంతో బాలుడు గట్టిగా కేకలు పెట్టాడు. ఓ మహిళ అటుగా రావడంతో హసన్‌ దొరికిపోతానేమోననే భయంతో బాలుడి తలను బండరాయికేసి మోది చంపేసి పారిపోయాడు.

హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అక్కడి బాలురపై లైంగికదాడికి యత్నించాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబితే.. తల్లిదండ్రులు వివరాలు అడగ్గా జరిగిన సంఘటన గురించి వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

జల్‌పల్లిలో బాలుడు... తాజాగా హాజీపూర్‌ ఘటనలో బాలికలు  కామాంధుల చేతుల్లో బలయ్యారు. చాలాచోట్ల కుటుంబ సభ్యులు లేదా దగ్గరి సన్నిహితులే ఈ చర్యలకు దిగుతున్నారు. ప్రబుద్ధుల్లో 90 శాతానికి పైగా సుపరిచితులే. 

ఏడాదిలోనే 1093 కేసులు 

రాష్ట్రంలో సగటున ప్రతిరోజూ ముగ్గురు చిన్నారులపై దాడులు జరుగుతున్నాయి. పోలీసు రికార్డుల ప్రకారం బాధిత బాలబాలికలకు సంబంధించి నమోదైన కేసులివి. ఇక కేసుల వరకు రాని  ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏడాదిలోనే పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం కింద 1093 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిన్నారులను  దగ్గరకు తీసుకున్నట్లు నటిస్తూ లైంగిక దాడికి యత్నించే ఘటనలు పెరుగుతున్నాయి.    బహుమతులు ఇస్తామని, చాక్లెట్లు కొనిస్తామని మాయమాటలు చెబుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో బాలురపై లైంగిక దాడుల కేసులు అధికంగా   నమోదవుతున్నాయి. బాధితులు 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి కేసుల్లో విచారణ ఆలస్యమవుతోంది. మరోపక్క బాధిత బాలికల పునరావాసానికి ప్రభుత్వమిస్తున్న  ఆర్థిక సహాయం మాదిరి బాలుర విషయంలో ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు లేవు. జీవో 28 సవరణ జరిగితే వేగంగా పూర్తి సహాయం అందించేందుకు వీలుంటుంది. 


అవగాహనకు కార్యాచరణ 

సాధారణంగా లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను గుర్తించే విషయంపై తల్లిదండ్రులు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఈ మేరకు శిశు సంక్షేమశాఖ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించింది. దాడులకు గురైన చిన్నారుల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయని, తీవ్ర ఒత్తిడికి గురవుతారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే తల్లిదండ్రులు చేరదీసి విషయం తెలుసుకోవాలని పిల్లల మానసిక వైద్య నిపుణురాలు డా.సంహిత శర్మ సూచించారు. 


నోరు విప్పలేకపోతున్నారు 
బాలికలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగితే వెంటనే విషయం తెలుస్తోంది. కాని బాలురపై దాడులు పెరుగుతున్నాయి. తమపై దాడులు జరిగినా నోరు విప్పడం లేదు. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.

- శిశు సంక్షేమ వర్గాలు


ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటని గద్దిస్తున్నారు 
లైంగిక బాధితుల్లో బాలికలతో సమానంగా బాలురు ఉంటున్నారు. బాలురు ఎవరైనా ఏడ్వడం మొదలు పెట్టగానే ఇళ్లలో ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటని గద్దిస్తారు. దీంతో ఆ బాలుడు ఏ విషయాన్ని చెప్పడం లేదు.

- పోక్సో చట్టం అమలుపై పనిచేస్తున్న ఒక అధికారి వెల్లడి

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.