close

ప్ర‌త్యేక క‌థ‌నం

గోదావరి.. ఇదిగో దారి

జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నది ప్రవాహం అధికం
ఈ సమయంలోనే ఎక్కువ నీటిని మళ్లించి నిల్వచేయాలి
పక్కా ప్రణాళికలుంటే నీరు కడలి పాలు కాకుండా నివారించొచ్చు
3 నెలల నీటి మళ్లింపే కీలకం
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

గోదావరి... దేశంలోనే రెండో అతిపెద్ద నది. తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం. కానీ ఈ నది ద్వారా ఏటా సగటున 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నీటిని చాకచక్యంగా ఒడిసిపడితే తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత తీరినట్లే. నదిలో లభ్యమయ్యే నీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. గోదావరి జలాల్ని కృష్ణాలోకి మళ్లించి, వినియోగించుకోవడంపైనా దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. గోదావరి నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన తాజాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాల ప్రణాళికాబద్ధ వినియోగంపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. వాస్తవానికి గోదావరిలో నీటి లభ్యత ఎంత? ఏయే నెలల్లో, ఎక్కడెక్కడ నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది?ఆ నీటిని ఎంత మేరకు వినియోగించుకోవచ్చు?? దీనిపై సమగ్ర కథనం..

గోదావరి నది.. తెలుగు రాష్ట్రాలకు జీవనాడి. కోట్ల మందికి ప్రాణాధారం.. వానాకాలంలో ఈ నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నదిలో లభ్యమయ్యే వేల టీఎంసీలలో 80 శాతం ఈ 3 నెలల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటే.. తెలుగు రాష్ట్రాలు ఎంత నీటిని మళ్లించుకొన్నా ఎలాంటి సమస్యా తలెత్తదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణహిత మొదలుకొని పోలవరం వరకు నీటి లభ్యత లెక్కలు ఈ విషయాన్నే స్పష్టంచేస్తున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ నీటిని మళ్లించి, నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయలేకపోతే సముద్రంలోకి పోయే వరద నీటిని వాడుకోవడం కష్టమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లెక్కలూ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ 1486 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ కేటాయింపు జరిగి నాలుగు దశబ్దాలైంది. ఇప్పటిదాకా ఇందులో సగం మాత్రమే వాడుకొన్నాం. కృష్ణా నదిలో కేటాయింపు మేరకు ఎక్కువ సందర్భాల్లో నీటి లభ్యత ఉండదు. కానీ గోదావరి ఇందుకు భిన్నం. ఎక్కువ సంవత్సరాలు కేటాయింపునకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా అంటే.. 2500 నుంచి 4 వేల టీఎంసీల వరకు నీరు అందుబాటులో ఉంటుంది.


  • గోదావరిలో లభ్యమయ్యే నీటిలో ఏటా సరాసరిన 3 వేల టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతోంది. లభ్యమయ్యే నీటిలో నాలుగోవంతునైనా రెండు రాష్ట్రాలు వినియోగించుకోగలిగితే కరవు ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు?

2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో గోదావరి నదిపై ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపల్లి, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-సాగర్‌ టేల్‌పాండ్‌, ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను, ఆంధ్ర ప్రాంతంలో పోలవరం, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను చేపట్టింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన నాటికి ఎల్లంపల్లితో పాటు దేవాదుల పాక్షికంగా పూర్తయ్యాయి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టి.. ప్రాణహిత-చేవెళ్ల స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల, కంతనపల్లికి బదులు తుపాకులగూడెం, రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌కు బదులుగా సీతారామ ఎత్తిపోతలను చేపట్టింది. ఈ పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరుగునపడింది. చింతలపూడీ అంతంత మాత్రమే. పట్టిసీమ, పురుపోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలను అదనంగా ఏపీ ప్రభుత్వం పూర్తిచేసింది. పోలవరం పూర్తయితే ఈ రెండు పథకాల అవసరం ఉండదు. 

(note: for zoom click on image)

ఎవరి వాటా ఎంత?

గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాల వినియోగం పోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1173 టీఎంసీల లభ్యత ఉంటుంది. పునరుత్పత్తి ద్వారా లభ్యమయ్యే నీటితో కలిపితే 1486 టీఎంసీలు. ఎగువ రాష్ట్రాల్లో కేటాయింపుల మేరకు వినియోగం లేదు. అదువల్ల దిగువకు నీరు ఎక్కువగా వస్తోంది. 1980లో నీటి కేటాయింపులు జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నీటిని వినియోగించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1486 టీఎంసీలలో తెలంగాణకు 912.250, ఆంధ్రప్రదేశ్‌కు 509.546 టీఎంసీలు, జల విద్యుత్తుకు 64.359 టీఎంసీల కేటాయింపు ఉన్నట్లు 2014లో పునర్విభజన సందర్భంగా అప్పటి ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. శాసనసభలో కూడా ప్రవేశపెట్టింది. ఇందులో అప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో, ప్రతిపాదన దశలో ఉన్నవి, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాల్ని పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణకు 1100 టీఎంసీలు అవసరమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల మిగులు జలాల ఆధారంగా ప్రతిపాదించిన గోదావరి-పెన్నా అనుసంధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే వెయ్యి టీఎంసీలకు పైగా అవసరం. అంటే అధికారికంగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ఉన్న కేటాయింపు కన్నా 600 నుంచి 700 టీఎంసీలు ఎక్కువగా నీరు అవసరం. ఇప్పటివరకు గోదావరి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు అవసరాన్ని బట్టి వినియోగించుకున్నాయి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాయి తప్ప పరస్పరం ఎలాంటి అంగీకారానికి రాలేదు. గోదావరిలో నీటి లభ్యత సమస్య లేనందువల్ల కృష్ణాలో లాగా ఎలాంటి వివాదం తలెత్తలేదు. మొత్తం నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి సమస్య ఉండదు,  భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావుండదు. 

తెలంగాణ అవసరం ఎంత?

గోదావరి నీటి కేటాయింపులో తెలంగాణకు ఎక్కువ వాటా ఉంది. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 471.68 టీఎంసీలు అవసరం. ఇందులో శ్రీరామసాగర్‌, శ్రీరామసాగర్‌ వరద కాలువ, నిజాంసాగర్‌, సింగూరు, కిన్నెరసానితో సహా అనేక మధ్య తరహా ప్రాజెక్టులున్నాయి. కేటాయింపులున్నప్పటికీ దీనికి తగ్గట్లుగా పూర్తిస్థాయిలో లభ్యత ఉండటం లేదు. ఇటీవలే నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు మరో 630 టీఎంసీలు అవసరం. కృష్ణాలో నీటి సమస్య ఉన్నందున కొంత నీటిని గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. గోదావరిలో నీటి లభ్యత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉప నదుల ద్వారానే ఎక్కువగా ఉంటుంది. ఈ నదులు గోదావరిలో కలిసిన తర్వాత లభ్యమయ్యే నీటిపైనే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి.

తెలంగాణలో ఎక్కడ ఎంత లభ్యత?

1966-67 నుంచి 2017-18 వరకు నీటి లభ్యత వివరాలను తీసుకొంటే ప్రాణహిత వద్ద సరాసరిన 1263 టీఎంసీలు ఉంది. 75 శాతం నీటి లభ్యత కింద కూడా 743 టీఎంసీలు ఉన్నట్లు జలసంఘం అంచనా.  ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు పరిమితమైన ప్రాణహితకు 20 టీఎంసీలు అవసరం. మిగిలిన నీరంతా దిగువకు వచ్చి కాళేశ్వరం వద్ద ప్రధాన గోదావరిలో కలుస్తుంది. ఈ రెండు కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉంది. ఇక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ద్వారా రోజుకు 23 వేల క్యూసెక్కుల(రెండు టీఎంసీలు) నీటిని ప్రధాన గోదావరి ద్వారానే వెనక్కు ఎల్లంపల్లికి తెస్తారు. దిగువన ఇంద్రావతి ఉంది. ఇక్కడ సరాసరి 795 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇంద్రావతికి దిగువన ఇప్పటికే పాక్షికంగా పూర్తయిన దేవాదుల ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల నీటిని మళ్లించాలన్నది లక్ష్యం. దేవాదులకు నీటి సమస్య లేకుండా చూసేందుకు తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇలా అన్నీ కలిసిన తర్వాత పేరూరు దిగువన సీతారామ ఎత్తిపోతల పథకం ఉంది. ఈ పథకం కింద 70 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యం. రోజుకు 13 వేల క్యూసెక్కులు మళ్లిస్తారు. మిగిలిన నీరంతా దిగువకు వదలాల్సిందే. దీనికి దిగువన శబరి(సీలేరు) కలుస్తుంది. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇక్కడ కూడా సరాసరిన 524 టీఎంసీలు ఉంది. ప్రాణహిత నుంచి సీతారామ ఎత్తిపోతల వరకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే రోజూ ఎత్తిపోసేది సుమారు 50 వేల క్యూసెక్కులు మాత్రమే. 100 రోజుల్లో ఈ నీటిని తెలంగాణ వాడుకొన్నా చాలా ఎక్కువ టీఎంసీలు దిగువకు వస్తాయి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నీటిని తెలంగాణ మళ్లించినా, దిగువన ఆంధ్రప్రదేశ్‌ ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టినా గోదావరిలో నీటి లభ్యతకు ఇబ్బంది లేదు. కావలసిందల్లా తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని మళ్లించి నిల్వ చేసుకోవడమే.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ కూడా వరద సమయంలో గోదావరి నీటిని మళ్లించి కృష్ణా బేసిన్‌లో నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం వాస్తవంగా లభ్యమయ్యే నీటిని పరిగణనలోకి తీసుకొంటే రెండు రాష్ట్రాలు ఎంత నీటిని వాడుకొన్నా ఎలాంటి సమస్య లేదు.

పోలవరం వద్ద లక్ష క్యూసెక్కులకు పైగా...

గోదావరిలో దిగువన నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు పోలవరం. దీనికి దిగువన ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. గత ఐదు దశాబ్దాల నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొంటే పోలవరం వద్ద సుమారు 75 రోజులు లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువగా, 104 రోజులు 50 వేల క్యూసెక్కులకు పైగా, 140 రోజులు 25 వేల క్యూసెక్కులకు పైగా నీటి లభ్యత ఉంటుంది. గోదావరి డెల్టా, పోలవరం కుడి, ఎడమ కాలువలు, తాడిపూడి, పుష్కరం, చింతలపూడి ఎత్తిపోతల రెండు దశలు, పురుషోత్తపట్నం ఇలా అన్నీ కలిపితే రోజుకు 62 వేల క్యూసెక్కులు అవసరం. మూడున్నర నెలల పాటు ఈ నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. జులై ఆఖరు, ఆగస్టు నెల, సెప్టెంబరులో ఐదు లక్షల నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ్నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు రెండున్నర నెలలు ఎక్కువ నీటిని మళ్లించుకునే అవకాశం ఉంది. గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా 230 టీఎంసీల నీటిని రోజూ 20 వేల క్యూసెక్కులు మళ్లించేలా గతంలోనే ప్రణాళిక చేశారు. ఇది ఆరంభ దశలోనే ఉంది. అటు ఉత్తరాంధ్ర ఇటు గుంటూరు నుంచి నెల్లూరు వరకు, కొంత రాయలసీమ అవసరాలకు ఇంకా ఎక్కువ నీటిని మళ్లించడానికి అవకాశం ఉంది.

ఏం చేయొచ్చు?

70 నుంచి 80 రోజుల్లో ఎక్కువ నీటిని మళ్లించడంతో పాటు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన రిజర్వాయర్లను ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించుకొంటే గోదావరి నీటిని కృష్ణా, పెన్నా ఆయకట్టుకు ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గోదావరి ట్రైబ్యునల్‌ ద్వారా ఉన్న కేటాయింపులు మించి 300 నుంచి 400 టీఎంసీల వరద నీటిని వినియోగించుకోగలిగేలా పనులు పూర్తి చేయగలిగితే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఎగువన తెలంగాణలో గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల వల్ల నవంబరు తర్వాత దిగువకు వచ్చే ప్రవాహం తగ్గుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయ్యాక 197 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది కాబట్టి గోదావరి డెల్టా రెండో పంటకు, ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శబరి, సీలేరు ద్వారా ఏడాది పొడవునా వచ్చే నీరంతా ఆంధ్రప్రదేశ్‌కే ఉపయోగపడుతుంది. కావలసిందల్లా లక్ష క్యూసెక్కులకు పైగా వరద ఉండే 75 రోజుల్లో ఎంత ఎక్కువ నీటిని వినియోగించుకోగలుగుతారన్నదే ముఖ్యం. పోలవరం వద్ద వర్షాకాలంలో సరాసరి 2,750 టీఎంసీల లభ్యత ఉంటే.. ఇతర కాలంలో 265 టీఎంసీలు ఉంది. వర్షాకాలంలో లభ్యమయ్యే నీటిలో ఎంత ఎక్కువ మళ్లించుకోగలిగితే, నిల్వ చేసుకోగలిగితే అంత ఉపయోగం ఉంటుంది. సరైన ప్రణాళిక వల్ల రెండు రాష్ట్రాలు ఎలాంటి సమస్య లేకుండా గోదావరి జలాలను ఎక్కువగా వినియోగించుకోవచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.