close

ప్ర‌త్యేక క‌థ‌నం

భూగర్భం..గరళం..!

విజయవాడలో ప్రమాద ఘంటికలు
భూమిలోకి ఇంకిపోతున్న మురుగునీరు
తాగితే ప్రమాదమంటున్న కేంద్ర భూగర్భ జలమండలి
వాడుకోవచ్చంటున్న రాష్ట్ర భూగర్భ జలశాఖ
కేంద్ర, రాష్ట్ర శాఖల మధ్య తేడాలు సుస్పష్టం
ఈనాడు - అమరావతి

యనమలకుదురు పంచాయతీ.. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్న గ్రామం.. అక్కడ బోరు నీరు నల్లగా మురుగు నీటిలా వస్తుంది.. పంచాయతీ ఆధ్వర్యంలోనూ బోరు నీటినే సరఫరా చేస్తున్నారు. వినియోగించేందుకు వీలు లేని పరిస్థితి..! కానూరు గ్రామం.. విజయవాడలో కలిసిపోయింది.. బోరు నీరు బకెట్‌లో అర్ధగంట సేపు ఉంచితే.. అడుగున ఒక పొరలా ఏర్పడుతోంది. ఆ నీటిని వినియోగించలేని దుస్థితి..!

చెంతనే కృష్ణమ్మ గలగలలు.. నగరంలో ప్రవహించే సాగునీటి కాలువలు.. చుట్టూ పచ్చని పంటపొలాలు.. నవ్యాంధ్ర రాజధానిగా గుర్తింపు.. ఇదీ విజయవాడ ప్రత్యేకత. నగరపాలక సంస్థ అందించే రక్షిత నీరు మినహా మిగిలిన నీటి వనరులు గరళంగా మారాయి. భూగర్భ జలాలను వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ భూమిలోకి ఇంకుతున్న కలుషితాలు భూగర్భ జలాన్ని విషతుల్యంగా మార్చేస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో ఫ్లోరైడ్‌ శాతం లీటరులో 1.5 మిల్లీగ్రాములు (సున్నా నుంచి 1.0 మిల్లీగ్రాములు అనుమతించవచ్చు) ఉన్నట్లు తేలింది. ఐరన్‌ 1.0 (0నుంచి 0.5మి.గ్రా) మి.గ్రాములు, నైట్రేట్‌ 45 మి.గ్రా (సున్నా నుంచి 1.0మి.గ్రా. వరకు పరిమితి) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ శాతం నమోదైంది.

నగరంలో ప్రవహించే సాగు, తాగునీటి కాలువలే భూగర్భ జలాలకు శత్రువుగా మారాయి. కాలువలు, వాగులు, వంకలు, డ్రైనేజీలలో కలుషిత నీరు భూమిలోకి ఇంకడంతో గరళంగా మారుతోంది. ఈ విషయాన్ని కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) రెండేళ్ల కిందటే చెప్పగా..రాష్ట్ర భూగర్భ జలశాఖ మాత్రం భూగర్భ జలాలు తాగేందుకు అనువుగా ఉన్నాయని నివేదికలు ఇస్తోంది.

అత్యంత జనసాంద్రత నివాస నగరంగా విజయవాడ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. నివాస ప్రాంతాల్లో సాధారణంగా భూగర్భ జలాలనే ఎక్కువగా వినియోగిస్తారు.  2017-18లో సీజీడబ్ల్యూబీ ఆధ్వర్యంలో 102 ప్రాంతాల్లో నమూనాలు సేకరించి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. శివారు ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనలవి కాదు.

నగరంలో రోజుకు భారీ స్థాయిలో మంచి నీటిని నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. కృష్ణానది ఫిల్టర్‌బెడ్‌ నుంచి 56 పవర్‌బోర్ల ద్వారా ఈ నీటిని అందిస్తోంది. దీన్ని నేరుగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ జలంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు సీజీడబ్ల్యూబీ గుర్తించింది.

కేంద్ర భూగర్భ జలమండలి ఏమంటుందంటే..

భూగర్భజలాల కాలుష్యంపై సీజీడబ్ల్యూబీ పరీక్షలు నిర్వహించింది. 5లక్షలు పైబడి ఉన్న నగరాల్లో  అధ్యయనం చేయగా విజయవాడ భూగర్భ జలాల్లో ప్రమాదకర  స్థాయిలో కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించింది.
* నగరంలోని భూగర్భ జలాల్లో ఉప్పునీటి గాఢత, కఠినత్వం, నైట్రేట్‌, ఫాస్పేట్‌, కాల్షియం, కోలీఫాం లాంటివి ఉన్నాయని గుర్తించింది. మాంగనీసు, ఇనుము అధిక మోతాదులో ఉన్నట్లు వెల్లడించింది.
* ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి నిబంధనల ప్రకారం టీడీఎస్‌(టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) శాతం 300 ఉండాల్సి ఉండగా 500 వరకు విజయవాడలో నమోదైంది.
* ప్రతినెలా 10 టన్నుల డిటర్జెంట్‌ భూమిలో కలుస్తోంది. బోరు నీటిని వినియోగించే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.

సీసం, పాదరసం, ఆర్సినిక్‌ నికిల్‌, కాడ్మియం లాంటి రసాయనాలు బోరు నీటిలో అధిక శాతం ఉంటున్నాయని గుర్తించింది. వీటి వాడకం వల్ల చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తేల్చింది.చెంతనే కృష్ణమ్మ గలగలలు.. నగరంలో ప్రవహించే సాగునీటి కాలువలు.. చుట్టూ పచ్చని పంటపొలాలు.. నవ్యాంధ్ర రాజధానిగా గుర్తింపు.. ఇదీ విజయవాడ ప్రత్యేకత. నగరపాలక సంస్థ అందించే రక్షిత నీరు మినహా మిగిలిన నీటి వనరులు గరళంగా మారాయి. భూగర్భ జలాలను వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ భూమిలోకి ఇంకుతున్న కలుషితాలు భూగర్భ జలాన్ని విషతుల్యంగా మార్చేస్తున్నాయి.

డ్రెయిన్ల నుంచి నేరుగా సాగునీటి కాలువల్లోకి

నగరంలో రూ.271కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇంటింటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. కేవలం 32వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నుంచి డ్రైనేజీ నీరు నేరుగా సాగునీటి కాలువల్లోకి చేరుతోంది. మురుగు నీటిని శుద్ధి చేసే సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు లేవు. దీంతో ఆ మురుగు నీరు బుడమేరు, కృష్ణానదిలో, కాలువల్లో కలిపేస్తున్నారు. దీంతో మురుగునీరు 50మీటర్ల వరకు వెళ్లి భూగర్భంలో ఇంకడంతో జలాలు విషతుల్యమవుతున్నాయి.

నియంత్రణకు కఠిన చర్యలు..!

విజయవాడ నగరాన్ని శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాలువలను, నదిని ప్రక్షాళన చేస్తున్నాం. దీనిపై అవగాహన ముఖ్యం. పెరుగుతున్న భూగర్భ గరళాన్ని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉంది. యూజీడీ కనెక్షన్లు ఇవ్వాలని వీఎంసీని ఆదేశించాం. మురుగునీరు, సీవరేజ్‌ నీరు కాలువల్లోకి వదిలిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దీనిపై నిపుణులతో సమీక్ష జరిపి నివారణ చర్యలు తీసుకుంటాం. 

- ఏఎండీ ఇంతియాజ్‌, కలెక్టర్

రాష్ట్ర భూగర్భ జలశాఖ పరీక్షల్లో..!

రాష్ట్ర భూగర్భ జలశాఖ పరీక్షల్లో మాత్రం విజయవాడ నగరంలో భూగర్భ జలాలు స్వచ్ఛతతో ఉన్నట్లు వెల్లడైంది.  ఈ ఏడాది రుతుపవనాల తర్వాత నగరంలో 31 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ డైరెక్టర్‌ వరప్రసాదరావు ‘ఈనాడు’కు వివరించారు. మొత్తం మీద విజయవాడలో నీటిని తాగడానికి, వాడకానికి వినియోగించవచ్చని ధ్రువీకరించారు.
* నీటి గాఢత పీహెచ్‌ 7.43 నుంచి 8.50 ఉంది. స్వచ్ఛమైన నీరు(7.50 పీహెచ్‌) ఎలాంటి ఆమ్ల, క్షార గుణం కలిగి ఉండకూడదు. కానీ విజయవాడలో కొంత క్షారగుణం కలిగి ఉంది.
* కాల్షియం 100 పీపీఎంలకుగాను 75 ఉందని చెబుతున్నారు. మాంగనీసు కూడా అనుమతించే పరిధిలో ఉందని అంటున్నారు. సల్ఫేట్‌, క్లోరిన్‌, నైట్రేట్‌ కారకాలు పరిమితికి లోబడే ఉన్నాయని నివేదించారు.
* సీజీడబ్ల్యూబీ నివేదికపై మాత్రం వారు స్పందించడం లేదు. భూగర్భ జలశాఖ అధికారులు.. మొత్తం మీద నీటిని రక్షిత నీటిగా పేర్కొంటున్నా.. ప్రజలు వాడేందుకు ఇష్టపడటం లేదు.
* టీడీఎస్‌ (టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) అనుమతించేంత వరకు ఉంది. కానీ  సీజీడబ్ల్యూబీ నివేదికలో 200 శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ తక్కువలు ఉన్నట్లు జీడబ్ల్యూశాఖ చెబుతోంది.
* బోరు నీటిలో 75 అడుగుల లోపు ఎలాంటి నష్ట కారకాలు లేవని, 75 నుంచి 150 అడుగుల లోపు పరిమితికి లోబడి ఉన్నాయని, 150 నుంచి 300 అడుగులలోపు నీటిలో కఠినత్వం ఉన్నా పరిమితికి లోబడే ఉన్నాయని, 300 నుంచి 600 అడుగులలోపు తీవ్ర కఠినత్వం ఉండే నీటిలోనూ అనుమతించదగ్గ కారకాలే ఉన్నాయని వరప్రసాద్‌ వివరించారు.

భూగర్భ జలాలు కలుషితానికి కారణాలు..

* భూగర్భ మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం.
* వ్యర్థాలను ఇష్టానుసారం భూమిలో ఇంకే విధంగా చేయడం.
* కలుషిత నీటిని, కబేళాల వ్యర్థాలను కాలువల్లోకి విడిచిపెట్టడం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.