close

ప్ర‌త్యేక క‌థ‌నం

భూమి తల్లికి బోర్ల తూట్లు!

నగరాల్లో విచ్చలవిడిగా నీటిబోర్ల వినియోగం
800 నుంచి 1,500 అడుగుల్లో తవ్వకాలు
సమీప ప్రాంతాలపై ప్రభావంతో నీటి కష్టాలు
వాల్టా చట్టానికి అడుగడుగునా తూట్లు
ఈనాడు, అమరావతి

రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లోని ఆవాస ప్రాంతాల్లో 800, 1,200, 1,500 అడుగుల్లో వేస్తున్న భారీ బోర్లు చుట్టుపక్కల ఉండే సామాన్యులకు నీటి ఇక్కట్లు సృష్టిస్తున్నాయి. 800 నుంచి 1,200 అడుగుల్లో తీసిన బోర్లు రాష్ట్రంలో 90 వేలు, 1,200 నుంచి 1,500 అడుగుల్లో వేసినవి మరో 22 వేలు ఉన్నాయి. వీటిలో 85 శాతానికిపైగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు.

భూగర్భంలో నుంచి భారీగా రోజూ నీటిని పంపు చేయడంతో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపలోని 280 వార్డులు/డివిజన్లలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. నీటి లభ్యత తగ్గడంతో అనేక పట్టణాల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి తాగునీటిని అధికారులు అందిస్తున్నారు. 100 నుంచి 150 అడుగుల్లో ఉన్న బోర్లలో నుంచి వచ్చే నీటితో ప్రజల ఇంటి అవసరాలు తీరేవి. అలాంటి బోర్లన్నీ ఇప్పుడు పని చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమై పురపాలక, నగరపాలక సంస్థల అధికారులపైనా ఒత్తిడి పెరుగుతోంది. ప్రజలు నీటికి గగ్గోలు పెట్టడంతో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో అధికారులు పెద్ద బోర్లను కనుగొని వాటిని జప్తు చేస్తున్నారు. వీటిని నియంత్రించడంతో చుట్టు పక్కల ఉన్న ఇళ్లల్లోని బోర్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు.

పట్టించుకునే వారేరి?
భారీ బోర్ల తవ్వకాలను ప్రాథమిక దశలో నియంత్రించాల్సిన అధికారులు దృష్టి సారించకపోవడంతో వీటి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. రెవెన్యూ, భూగర్భజల, పురపాలక, నగరపాలక సంస్థల అధికారులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో ఇప్పటికీ నగరాల్లో బోర్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాజకీయ జోక్యంతో కొందరు అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నది అభియోగం. నీటి వినియోగం పెరగడంతో గత నాలుగు నెలల వ్యవధిలోనే 10 వేలకుపైగా బోర్లు తీశారని అంచనా.
* విజయవాడలోని భవానీపురం, పటమట, ఆటోనగర్‌, బిసెంట్‌రోడ్డు, గుణదల తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం వరకు బోరు కోసం 150 నుంచి 200 అడుగుల్లో తవ్వితే పుష్కలంగా నీరొచ్చేది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో 300 నుంచి 350 అడుగులకు వెళుతున్నా నీటి జాడలు కనిపించడం లేదు.
* విశాఖపట్నంలోని సీతమ్మధార, అక్కయ్యపాలెం, రవీంద్రనగర్‌, డాబాగార్డెన్స్‌లో గతంలో 300 అడుగుల్లో నీళ్లు పడేవి. ఇప్పుడు బోరు ఏర్పాటుకు 400 నుంచి 450 అడుగులకు వెళుతున్న పరిస్థితి. ఆరిలోవ, పెదవాల్తేరు వంటి ప్రాంతాల్లో 500 అడుగుల్లోకి వెళుతున్నా హామీ లేకపోతోంది.
* నాలుగైదేళ్ల క్రితం పట్టణ ప్రాంతాల్లో 18.50 లక్షలు ఉండే బోర్లు ప్రస్తుతం రూ.24.35 లక్షలకు చేరాయి. వీటిలో 55 శాతం నుంచి 60 శాతం బోర్లకు ప్రభుత్వశాఖల నుంచి అనుమతుల్లేవు.

వాల్టా చట్టం ఏంచెబుతోంది?
ఈ చట్ట ప్రకారం బోరు వేయాలంటే మొదట తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. బోరు వేసే ప్రాంతాన్ని భూగర్భ జలవనరులశాఖ జియాలజిస్టు పరిశీలించి నివేదిక ఇచ్చాకే తహసిల్దారు కార్యాలయం అనుమతులు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. నీరు పడే అవకాశం ఉందా? లేదా? బోరు వేస్తే అప్పటికే చుట్టుపక్కల ఉన్న వాటిపై ప్రభావం పడుతుందా? వంటి అంశాలను జియాలజిస్టు పరిగణనలోకి తీసుకుంటారు. అనుమతుల్లేకుండా బోర్లు తీస్తే బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకునే అధికారాన్ని చట్టంలో కల్పించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.