close

ప్ర‌త్యేక క‌థ‌నం

అమ్మో.. అనుమతులా!

చేతులు తడిపితేనే బడుల ఏర్పాటుకు మార్గం సుగమం
 ధ్రువపత్రాలు, వాటి పునరుద్ధరణ పేరుతో విద్యాశాఖలో వసూళ్ల పర్వం
 క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఇదే తంతు
 ఇతర శాఖలకూ కాసుల వర్షం
ఈనాడు - హైదరాబాద్‌

ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చే విధానం విద్యాశాఖ అధికారుల జేబులు నింపుతోంది. చిన్న ప్రైవేటు బడి నుంచి కార్పొరేట్‌ పాఠశాలల వరకు అనుమతుల కోసం కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ‘మామూళ్లకే’ ఖర్చవుతోంది. పాఠశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలు విద్యాశాఖకే కాదు.. మరికొన్ని ఇతర శాఖలకూ కాసులు కురిపిస్తున్నాయి. అనుమతుల పునరుద్ధరణకూ అంతేస్థాయిలో ముట్టజెప్పాల్సిందే. లేకుంటే నిబంధనల అస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది కాబట్టి, పాఠశాలల యాజమాన్యాలు అడిగినంత ఇచ్చుకుంటున్నాయి. కొందరైతే ఆ లంచాలు భరించలేమని నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. బడి నడిపేందుకు కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయని దరఖాస్తు చేసుకుంటే విద్యాశాఖ అనుమతి ఇస్తుంది. ఆ శాఖతోపాటు ప్రధానంగా అగ్నిమాపక శాఖ, ఆర్‌ అండ్‌ బీ, ట్రాఫిక్‌/ పోలీసు, స్థానిక సంస్థలైన పంచాయతీ/ మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌ అనుమతులు కూడా తప్పనిసరి. 1-5వ తరగతి వరకు డీఈఓ, ఆపై తరగతులు పెంచుకుంటే ఆర్‌జేడీ అనుమతులు ఇస్తారు. ఒకేసారి 1-10 తరగతులకు అనుమతులకు మాత్రం కమిషనర్‌ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఏదైనా అనుమతి ప్రక్రియ ఎంఈఓ నుంచి ప్రారంభమవుతోంది.   జాతీయ బిల్డింగ్‌ నియమావళి(ఎన్‌బీసీ) ప్రకారం పాఠశాలల భవనాలు, తరగతి గదుల పరిమాణం ఉండాలి. ఒక్కో విద్యార్థికి 6-8 చదరపు అడుగుల విస్తీర్ణం తప్పనిసరి. ఇక ప్రతి 40 మందికి ఒక శౌచాలయం, ఆడుకునే మైదానం, ప్రహరీ నిర్మాణం, అంతస్తుల్లో ఉంటే వరండాలకు ఎత్తైన గోడ.. ఇలా ఎన్నో నిబంధనలను పరిశీలించాలి. తనిఖీ చేసే అధికారులకు నిర్దేశిత మొత్తం ముట్టచెబితే చాలు.. అసలు తనిఖీ చేయకుండానే నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నాయని దస్త్రంపై సంతకం పెట్టి పైకి పంపిస్తారు. 2017లో పాఠశాలల అనుమతుల కోసం అప్పటి విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ స్పష్టమైన నిబంధనలు రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధాన అనుమతులివీ..

పాఠశాలను ఏర్పాటు చేసేందుకు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ అత్యంత కీలకం. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే స్థలం ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే నీరు మంటలు ఆర్పేందుకు నీటిని నిత్యం నిల్వ చేసి ఉంచేందుకు భవనంపైన ట్యాంకు, ఆవరణలో సంపు ఉండాలి. ప్రతి అంతస్తుకు నీటిని సరఫరా చేసే ప్రత్యేక పైపు, కార్బన్‌ డయాక్సైడ్‌తో నింపిన సిలిండర్లు ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు బయటపడేందుకు ప్రత్యామ్నాయ మెట్లు తప్పనిసరి. వీటన్నిటికి రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. ప్రతి అయిదేళ్లకోసారి అనుమతి తీసుకోవాలి. భవనం ఎత్తు 18 మీటర్లు (5 అంతస్తులు) దాటితే డైరెక్టర్‌ కార్యాలయం అధికారులు అనుమతి ఇవ్వాలి.

పటిష్ఠమైన భవనం ముఖ్యం

పాఠశాల భవనం కూలితే వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయి. అందుకే భవనాలు పటిష్ఠంగా ఉన్నాయని తెలిపే స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ ధ్రువపత్రం ఇవ్వాలి. దాన్ని జిల్లాల్లో అయితే ఆర్‌ అండ్‌ బీ ఇంజినీరు.. జీహెచ్‌ఎంసీలో అయితే గుర్తించిన ప్రైవేటు ఇంజినీరు జారీ చేస్తారు. రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తే కనీసం తనిఖీలు లేకుండా భవనం గట్టిగా ఉందని సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో కూకట్‌పల్లిలో పాఠశాల భవనం కూలి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆ భవనానికి 15 సంవత్సరాల వరకు ఢోకా లేదని ఇంజినీరు ధ్రువీకరించారు. అయితే అది ఏడేళ్లకే కూలిపోయింది.

పారిశుద్ధ్యం కోసం..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం.. మురుగునీటి పారుదల వ్యవస్థపై ముందస్తు చర్యలు తీసుకోవడానికి శానిటేషన్‌ సర్టిఫికెట్‌ను విద్యాశాఖ అడుగుతుంది. దీన్ని ఆయా స్థానిక సంస్థలు ఇవ్వాలి. తనిఖీలు పెద్దగా లేకుండా ధ్రువపత్రం ఇచ్చేందుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకూడదని..

విద్యాసంస్థల వద్ద వాహనాల నిలుపుదలకు పార్కింగ్‌ స్థలం కూడా అవసరం. ఇందుకోసం పోలీసులు ఎన్‌ఓసీ జారీ చేయాలి. పాఠశాల స్థలంలో 25% పార్కింగ్‌కు కేటాయించాలి. అసలు పార్కింగ్‌ ఏరియా లేని పాఠశాలలు ఒక్క హైదరాబాద్‌లోనే వందల సంఖ్యలో ఉన్నాయి. రూ.10 వేల నుంచి రూ.25 వేలు తీసుకొని అనుమతులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

భరించలేక ‘నకిలీ’ మార్గం

అనుమతులు పొందడానికి భారీగా చెల్లించాల్సి రావడంతో.. వివిధ అనుమతులకు సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయాలంటే అనుమతి ఉన్న బడుల్లోనే చదవాలి. అప్పుడు ఆ పాఠశాల నామినల్‌ రోల్స్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) స్వీకరిస్తుంది. దాని కోసం గతంలో తీసుకున్న అనుమతుల గడువు తీరితే.. మళ్లీ పునరుద్ధరించుకోవాలి. ఆ పనికి రూ.లక్షలు ఖర్చవుతుందని నకిలీ అనుమతి పత్రాలు పుట్టించారు. ఇలాంటి కేసులు 2017లో ఏడెనిమిది వరకు హైదరాబాద్‌ జిల్లాలో వెలుగుచూశాయి. మామూళ్ల బాధ భరించలేక కొన్ని యాజమాన్యాలు సీబీఎస్‌ఈ బోర్డుకు బదిలీ అవుతున్నాయి. దానికైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ తీసుకుంటే చాలని, ఎంఈఓలు, డీఈఓల తనిఖీల నుంచి తప్పించుకోవచ్చని వారు భావిస్తున్నారు.

ఇక గండమే..

తమిళనాడులోని కుంభకోణంలో ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంతో పాఠశాలలకు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ తప్పనిసరని 2009 ఏప్రిల్‌ 13న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆ తర్వాత ప్రారంభమైన బడులు అగ్నిమాపక శాఖ నుంచి కూడా అనుమతి పొందాల్సి వస్తోంది. మరోవైపు 2009 కంటే ముందు అనుమతి పొందిన పాఠశాలలకు ఇచ్చిన పది సంవత్సరాల గడువు పూర్తయితే అవి అనుమతులన్నీ మళ్లీ తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరం 80 కొత్త పాఠశాలలకు, మరో 260 పాత పాఠశాలలకు అనుమతుల పునరుద్ధరణ లేకపోవడం వల్ల.. 340 పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పదో తరగతి మార్చి పరీక్షలు రాయడానికి ప్రభుత్వ పరీక్షల విభాగం అనుమతించలేదు. చివరికి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డీఈఓల ద్వారా హామీపత్రం తీసుకొని పరీక్షలకు అనుమతించారు. వచ్చే ఏడాది ఇలాంటి పాఠశాలల సంఖ్య వెయ్యి వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక ఆన్‌లైన్‌లో అనుమతులు

అనుమతుల్లో ఆన్‌లైన్‌ విధానం తీసుకురావాలని కసరత్తు చేస్తున్నాం. వచ్చే రెండు మూడు నెలల్లో అది పూర్తికావొచ్చు. దాంతో ఏ దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది, ఎందుకు ఆగిందో తెలుస్తుంది.
- టి.విజయ్‌కుమార్‌, కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ

సింగిల్‌ విండో విధానం తేవాలి

రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అందుకే బడి అనుమతులకు ‘సింగిల్‌ విండో’ విధానం తీసుకురావాలి. దానివల్ల అవినీతి తగ్గుతుంది.
- ఎస్‌ఎన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌
మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ట్రస్మా)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.