Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

శిశువుకు శ్రీరామరక్ష

తెలంగాణలో తగ్గిన శిశు మరణాలు
గత నాలుగేళ్లలో 39 నుంచి 29కి తగ్గుముఖం
విశిష్ట సేవలందిస్తున్న ఎస్‌ఎన్‌సీయూలు
ఫలితమిస్తున్న తెలంగాణ సర్కారు పథకాలు
నాగాలాండ్‌, గోవా ముందంజ
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో గత నాలుగేళ్లలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు 39 మంది శిశువులు మృతి చెందగా, 2015లో ఈ సంఖ్య 35కు, 2016 గణాంకాల్లో 31కి, తాజాగా వెలువడిన 2017 గణాంకాల్లో 29కి తగ్గుముఖం పట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం(ఎస్‌ఆర్‌ఎస్‌)’ సర్వేలో ఈ విషయాలను వెల్లడించింది. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపర్చింది. శిశు మరణాల రేటుతో పాటు జనన, మరణాల రేటు, సహజ వృద్ధి రేటు.. తదితర సమాచారాలనూ అందించింది. రాష్ట్రంలోని గ్రామీణంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిల్లో గ్రామీణ తెలంగాణలో 1.54 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.55 లక్షల జనాభాను కలిపి, మొత్తంగా 2.09 లక్షల జనాభా నుంచి ఈ నమూనాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (33) కంటే తెలంగాణ(29)లో తక్కువగానే నమోదవడం విశేషం.

గ్రామీణంలో ఎక్కువే
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినా.. పట్టణ ప్రాంతాలతో పోల్చితే ఇంకా గ్రామీణ తెలంగాణలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్‌ఆర్‌ఎస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణలో ప్రతి వేయి జననాలకు 33 శిశు మరణాలు జరుగుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో వీటి సంఖ్య 23గా నమోదైంది. గ్రామీణంలో ఐఎంఆర్‌ అత్యల్పంగా 26గా, అత్యధికంగా 39గా నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో అత్యల్పంగా 13, అత్యధికంగా 32గా నమోదయ్యాయి. రెండిటినీ కలిపి చూస్తే అత్యల్పం 24కాగా, అత్యధికం 34గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ వైద్యంపై మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎలా సాధ్యమైంది?
బాల్య వివాహాల వల్ల పునరుత్పత్తి వ్యవస్థ వృద్ధి చెందకముందే ప్రసవాలు జరగడం, గర్భిణి దశలో సరైన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం.. బిడ్డకు బిడ్డకు మధ్య తక్కువ వ్యవధి పాటించడం.. తదితర కారణాల వల్ల ‘నెలలు నిండక ముందే పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం..’ వంటివి చోటుచేసుకుంటున్నాయి. మొత్తం ప్రసవాల్లో కనీసం 10-15% కాన్పులు ముందస్తుగా లేదా బరువు తక్కువతో ఉన్న శిశువులుంటారని అంచనా. రాష్ట్రంలో ఏటా ఇలా సుమారు 63 వేల నుంచి 93 వేల మంది శిశువులు ముందస్తుగా లేదా తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఇలా పుట్టిన పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు సోకడానికి అవకాశాలెక్కువ. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 25 నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(ఎస్‌ఎన్‌సీయూ)ను నెలకొల్పింది. వీటిల్లో ఏటా సుమారు 40వేల మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుండగా.. ఇందులో 76.5% శిశువులు క్షేమంగా ఇంటికెళ్తున్నారు. నల్గొండ, వరంగల్‌లోని ఎస్‌ఎన్‌సీయూల్లో అయితే కేవలం 600-700 గ్రాముల శిశువుకు కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైద్యంలో అత్తుత్తమ సేవలందించే చికిత్స కేంద్రాలుగా దేశంలోనే తెలంగాణలోని ఎస్‌ఎన్‌సీయూలకు పేరొచ్చింది. ప్రస్తుతమున్న ఎస్‌ఎన్‌సీయూలకు అదనంగా మరో 11 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను త్వరలో నెలకొల్పడానికి ఏర్పాట్లుచేస్తున్నారు.


స్వల్పంగా పెరిగిన సాధారణ మరణాలు

* ఎస్‌ఆర్‌ఎస్‌ గణాంకాల ప్రకారం..  తెలంగాణలో సాధారణ మరణాల రేటు స్వల్పంగా పెరిగింది.
* జనాభాలో ప్రతి వేయి మందికి 2014లో 7.3గా ఉన్న మరణ రేటు.. 2015లో 6.5కు, 2016లో 6.1కి తగ్గగా, తాజా గణాంకాల్లో 2017లో 6.6గా నమోదైంది. ఈ అంశంలో జాతీయ సగటు 6.3.
* జనన రేటు 2014-16 మధ్యన స్థిరంగా కొనసాగుతోంది. 2014లో 17.4 ఉండగా.. 2015లో 17.8, 2016లో 17.5గా నమోదు కాగా, 2017లో 17.2గా నమోదైంది. దీని జాతీయ సగటు 20.2.
* 2014లో 10గా నమోదైన జనాభా వృద్ధిరేటు.. 2015లో 11.3గా, 2016లో 11.4కాగా, 2017లో 10.6గా నమోదైంది. దీని జాతీయ సగటు 13.9.


వైద్య సేవలకు ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం వైద్యసేవలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో తల్లీబిడ్డల సంరక్షణ కోసం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాం. ఈ పథకంలో భాగంగా గర్భిణి దశ నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కుటుంబ నియంత్రణపై పెద్దఎత్తున ప్రచారం చేస్తుండడంతో తొలి బిడ్డకూ, మలి బిడ్డకూ మధ్య ఎడం పెరిగింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రాల పనితీరు మెరుగ్గా ఉంది. మరికొన్ని ఎస్‌ఎన్‌సీయూలను కొత్తగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

- డాక్టర్‌ యోగితా రాణా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.