close

ప్ర‌త్యేక క‌థ‌నం

చైనా 5జీ.. మనమూ బిజీ

క్రమంగా 5జీ మొబైల్‌ సేవల ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కొత్త తరం నెట్‌వర్క్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభం కాగా.. తాజాగా వాటి సరసన చైనా చేరింది. భారత్‌ కూడా త్వరలోనే ఈ సేవలకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో నిత్యజీవితంలో సాంకేతికంగా పెను మార్పులు చూడవచ్చు.


 

వేగం ఎంత?

5జీ సేవల ఆరంభంలోనే ఎక్కువ ఇంటర్నెట్‌ వేగం రాకపోవచ్చని భావిస్తున్నారు. తొలుత ప్రస్తుత 4జీ (లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌-ఎల్‌టీఈ) సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దీన్ని ఒక మార్గంగా నెట్‌వర్క్‌ ఆపరేటర్లు ఉపయోగించుకుని, స్థిరమైన సేవలు అందించేందుకు ప్రయత్నించవచ్చు. అంతిమంగా ఆపరేటర్‌ ఏ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌పై 5జీ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు? కొత్త టవర్లు, ట్రాన్స్‌మిటర్లపై ఎంత డబ్బు వెచ్చించారన్నదానిపై వేగం ఆధారపడి ఉంటుంది.

4జీతో పోలిస్తే 5జీతో 10 నుంచి 100 రెట్లు డౌన్‌లోడ్‌ వేగం సాధించవచ్చని విశ్లేషిస్తున్నారు. క్రమంగా 10వేల ఎంబీపీఎస్‌ వేగాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు.


 

ఏయే దేశాల్లో ప్రారంభం?

బ్రిటన్‌, దక్షిణ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో 5జీ వాణిజ్య సేవలను ప్రారంభించాయి. ఇటీవలే బ్రిటన్‌లో ‘ఈఈ’ సంస్థ తన సేవలకు శ్రీకారం చుట్టింది. జులై నుంచి సేవలు ప్రారంభిస్తామని వొడాఫోన్‌ ప్రకటించింది. ఇప్పుడు చైనా రంగ ప్రవేశం చేయడంతో.. భవిష్యత్‌లో 5జీ సేవల్లో ఆ దేశం అగ్రగామి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.


 

భారత్‌లో ధరపై తకరారు

5జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రక్రియ 100 రోజుల్లో ప్రారంభమవుతుందని, ఈ ఏడాది చివర్లోగా స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే వేలానికి సంబంధించిన మూల ధర భరించలేని స్థాయిలో ఉందని భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) ఆక్షేపించింది. ప్రపంచంలో ఇతర దేశాల కన్నా చాలా ఎక్కువగా ఉందని వివరించింది. అయితే 5జీ వ్యవస్థ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందువల్ల ధరను తగ్గిస్తేనే తాము 5జీ గురించి ఆలోచించగలమని కొన్ని కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో భారత్‌లో 5జీ సేవలు ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది. మూల ధర ప్రాతిపదికన చూస్తే దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రమ్‌ సేవల కోసం ఒక కంపెనీకి 142 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది.


 

స్పెక్ట్రమ్‌ సిద్ధం

5జీకి కేటాయించిన స్పెక్ట్రమ్‌: భారత్‌లోని 3300-3600 మెగా హెర్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో 20 మెగా హెర్జ్‌
ధర: మెగా హెర్జ్‌కు రూ.492 కోట్లు

జీఎస్‌ఎం అసోసియేషన్‌ అంచనాల ప్రకారం..
2025 నాటికి (భారత్‌లో)
* 92 కోట్లు: మొబైల్‌ చందాదారుల సంఖ్య
* 8.8 కోట్లు: 5జీ కనెక్షన్లు ఉండేవారి సంఖ్య

2025 నాటికి (చైనాలో)
* 30%: మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా


 

ఏమిటీ 5జీ?

5జీ లేదా ఫిఫ్త్‌ జనరేషన్‌ (ఐదో తరం) అనేది మొబైల్‌ ఇంటర్నెట్‌లో అధునాతన వెర్షన్‌. ఇందులో డేటా డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. రేడియో తరంగాల స్పెక్ట్రమ్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం ఇందులో కీలకం.
* ఇందులో రేడియో తరంగాలను ఏ పౌనఃపున్యంలో ఉపయోగించాలి, సెల్‌ టవర్ల తీరుతెన్నులు ఎలా ఉండాలన్నదానిపై కొత్త నిబంధనలు వచ్చాయి. గత ఏడాది మే నెలలో కాలిఫోర్నియాలో జరిగిన ఒక సదస్సులో ఇవి ఖరారయ్యాయి.
* 5జీ ప్రమాణాల వల్ల బేస్‌ స్టేషన్లు చాలా చిన్నగా ఉంటాయి. దీనివల్ల సెల్‌ఫోన్‌ టవర్లు ఏర్పాటు చేయాల్సిన స్థలం విషయంలో కొంత వెసులుబాటు లభిస్తుంది.

 


 

బోలెడు ఉపయోగాలు..

ప్రస్తుతం మనం మొబైల్‌ ఫోన్లతో చేస్తున్న పనులన్నింటినీ మరింత వేగంగా, మెరుగ్గా చేపట్టవచ్చు. మరిన్ని ఎక్కువ పరికరాలను ఏకకాలంలో మొబైల్‌ ఇంటర్నెట్‌కు అనుసంధానించడానికి వీలవుతుంది. విస్తృత కవరేజీ, మరింత స్థిరమైన కనెక్షన్లు కూడా సాధ్యమవుతాయి. వీడియోలు స్తంభించడం ఉండదు. వీడియో కాల్స్‌ కూడా మరింత స్పష్టంగా, కుదుపులు లేకుండా ఉంటాయి.
* 4జీ కనెక్షన్లు సరాసరిన ఒక హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి దాదాపు అర గంట పడుతుంది. 5జీ ద్వారా దాదాపు 25-40 సెకన్లలో అది పూర్తవుతుంది.

* ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ, మొబైల్‌ వర్చువల్‌ రియాల్టీతో కూడిన మరింత మెరుగైన స్మార్ట్‌ గ్లాసెస్‌ సాధ్యమవుతాయి. అనేక వస్తువులను ఇంటర్నెట్‌కు అనుసంధానించే ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (ఐవోటీ), కృత్రిమ మేధస్సు విస్తృతమవుతాయి. దీనివల్ల ఇళ్లు, నగరాలు మరింత స్మార్ట్‌గా రూపుదిద్దుకుంటాయి.
* డ్రోన్‌ కార్యకలాపాలు మరింత మెరుగవుతాయి. అవి సమూహంగా వ్యవహరిస్తూ, వేగంగా పరస్పరం సహకరించుకుంటూ విశ్లేషణలు, ట్రాఫిక్‌ పర్యవేక్షణ; సహాయ, గాలింపు చర్యలు వంటివి చేపట్టగలవు.
* స్వయం చోదక వాహనాలు పరస్పరం కమ్యూనికేషన్లు సాగించడంలోను మ్యాప్‌ను, ట్రాఫిక్‌ డేటాను అప్పటికప్పుడు విశ్లేషించడంలో 5జీ సేవలు కీలకం కాబోతున్నాయి.
* సమాచార బట్వాడాలో జాప్యం తక్కువగా ఉంటుంది.
* శరీరానికి ధరించే ఫిట్‌నెస్‌ సాధనాలు మరింత మెరుగ్గా, ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. అత్యవసర సమయంలో శరవేగంగా వైద్యులను అప్రమత్తం చేస్తాయి.

 
 
 
 
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.