close

ప్ర‌త్యేక క‌థ‌నం

కాలుష్య కట్టడికి కార్యాచరణ 

క్షీణిస్తున్న గాలి నాణ్యత.. పెరుగుతున్న పీఎం 10, 2.5 
హైదరాబాద్‌, పటాన్‌చెరు, నల్గొండ సమస్య అధికం 
సూక్ష్మ, అతిసూక్ష్మ ధూళికణాల్ని 20-30శాతం తగ్గించాలని లక్ష్యం 
జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాల మేరకు కార్యాచరణ

హైదరాబాద్‌, పటాన్‌చెరు, నల్గొండ.. తెలంగాణలో వాయు కాలుష్య సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలివి. గాలి నాణ్యత ప్రమాణాలు పడిపోయినట్లు జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దేశవ్యాప్తంగా గుర్తించిన 102 నగరాల్లో ఈ మూడూ ఉన్నాయి. కాలుష్య ఉద్గారాల్లో ప్రమాదకరమైన పీఎం 10, పీఎం 2.5 ఇక్కడ కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు చోట్ల కాలుష్యాన్ని నియంత్రించి గాలి నాణ్యతను పెంచే కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని (సీసీసీబీ) కలిసి త్వరలో ఎన్జీటీకి సమర్పించనుంది. 
కాలుష్య నియంత్రణపై అంశాలవారీగా కార్యాచరణపై నివేదిక రూపొందించారు. కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, పార్కింగ్‌ సదుపాయాలు పెంచడం, డీజిల్‌, పెట్రోల్‌ కల్తీనివారణ.. ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు, ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రోత్సహించడం, హైదరాబాద్‌లో పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్‌ వెలుపలకు తరలించడం, కాలుష్యంపై వాహన తనిఖీలు పెంచడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని అమలు అవుతుండగా కొత్త అంశాలను అమలుచేయనున్నట్లు ఆయా శాఖలు పేర్కొన్నాయి.

50శాతం వాహనాల వల్లే

మనం పీల్చే గాలిలో పీఎం 10, 2.5తోపాటు సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటి 40రకాల ఉద్గారాలు కలుస్తూ విషతుల్యం చేస్తున్నాయి. వీటిలో సూక్ష్మ, అతిసూక్ష్మ ధూళికణాలైన పీఎం 10, 2.5 ప్రమాదకరమైనవి. పీఎం 10, 2.5 ఉద్గారాల్లో 50శాతం వాహనాల నుంచి.. 11-33శాతం అధ్వాన రహదారులు, దుమ్ము నుంచి వెలువడుతున్నాయి. 2017లో నమోదైన పీఎం 10, పీఎం 2.5 తీవ్రతను 2024నాటికి 20-30శాతం వరకు తగ్గించాలన్నది లక్ష్యం.

ఆలోచన విధానం మారాలి

కాలుష్య నియంత్రణ మండలి ఉన్న ప్రాంతంలోనే అధిక కాలుష్యం నమోదవుతోంది. హైదరాబాద్‌లో ఒక్కచోటైనా వాయు కాలుష్యాన్ని తగ్గించలేకపోయింది. పీసీబీ, జీహెచ్‌ఎంసీ విధానాలతో సమస్యకు పరిష్కారం దొరకదు. గాలి నాణ్యత తగ్గడానికి.. ఎక్కువ దూరం, ఎక్కువసార్లు వాహన వాడకమూ కారణం. హైదరాబాద్‌లో గతంలో సైకిళ్లు ఎక్కువ వాడేవారు. ఇప్పుడు తగ్గిపోయింది. ఆ దిశగా సైకిళ్ల వాడకం, నడకదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలి.

ప్రచారం మొదలుపెట్టిన పీసీసీ

కాలుష్యాన్ని తగ్గించడంపై పీసీబీ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. తక్కువ దూరానికి వాహనాలు వద్దు. నడక/సైకిల్‌ వాడాలని.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చవద్దు.. కాలంచెల్లిన వాహనాలను వాడొద్దు.. ప్రజారవాణా వినియోగం పెంచాలి.. అని కోరుతోంది. 
వీటితోపాటు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించడం. వాహనాలకు ఇచ్చే పీయూసీ (పొల్యుషన్‌ అండర్‌ కంట్రోల్‌) సర్టిఫికెట్ల జారీ శాస్త్రీయంగా ఉండేలా చూడటం. రోడ్లపై ప్రయాణ సమయాన్ని తగ్గించడం. ఎలక్ట్రిక్‌ బస్సులు పెంచడం. ఫ్లైఓవర్ల నిర్మాణం, రహదారుల విస్తరణ. తద్వారా వాహనాలు వేగంగా వెళ్లి కాలుష్యాన్ని తగ్గించడం. మొక్కల పెంపకం. కాలుష్య పరిశ్రమలపై మరింత కఠినంగా వ్యవహరించడం లాంటివి చేయబోతున్నారు.

గాలి నాణ్యత పెంచేందుకు స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, పటాన్‌చెరు, నల్గొండలో వాయు కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను పెంచే ప్రణాళికలను ప్రభావవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అటవీపర్యావరణ, పురపాలక, రవాణా-రహదారులు భవనాలు, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి స్టీరింగ్‌ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నల్గొండలో..

2011లో ఘనపుమీటర్‌ గాలికి 80 ఎంజీగా ఉన్న పీఎం 10.. 2012నాటికి 100కు పెరిగింది. 2014లో 90కి, 2018లో 60కి తగ్గింది. పీఎం 2.5 40 మైక్రోగ్రాములు ఉంది.

పటాన్‌చెరులో

2011లో ఘనపుమీటర్‌ గాలికి 80 ఎంజీగా ఉన్న పీఎం 10.. 2014లో 100 ఎంజీకి పెరిగింది. 2018లో 80 మైక్రో గ్రామలుగా ఉంది.

గరిష్ఠ పరిమితికి రెట్టింపు

సీసీసీబీ నిర్దేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం 10 సూక్ష్మధూళికణాలు 60 మైక్రోగ్రాములు ఉండాలి. హైదరాబాద్‌లో 2011 నుంచి గరిష్ఠ పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. పీఎం 2.5 అతిసూక్ష్మధూళికణాలు ఘనపు మీటరు గాలిలో గరిష్ఠంగా 40 మైక్రోగ్రాములు ఉండాలి. మించితే ఆ ప్రాంతం కాలుష్యకోరల్లో చిక్కినట్లు. కానీ 2018లో 58 మైక్రోగ్రాములుగా నమోదైంది.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.